Friday, November 18, 2022

#పిల్లల_జాతకాన్ని_మార్చలేమా !? ఈ ఇతిహాసం చదవండి తెలుస్తుంది..

 #పిల్లల_జాతకాన్ని_మార్చలేమా !?
ఈ ఇతిహాసం చదవండి తెలుస్తుంది..

అవంతీ నగరంలో ఒక వేదపండితుడు ఉండేవాడు ఇతనంటే ఊరందరికీ బాగా నమ్మకం. చివరికి రాజుగారికి కూడా నమ్మకం. ఎక్కడ ఏ కార్యం చేయలుకున్నా ఇతడి చేత చేయించేవారు.. ఇతనికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవడం వలన యజ్ఞాలు చేశాడు. యాగాలు చేశాడు. చివరికి పుత్రకామేష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు. ఎంతో సంతోషంతో జతకాది కర్మలు చేశాడు. ఒకరోజు ఈ పిల్లాడి జాతకచక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడు అని ఉంది.. గుండెఝల్లుమంది. అయినా మళ్ళి మళ్ళి వేశాడు. ఎన్నిసార్లు చుసినా గజదొంగ అవుతాడు అని వచ్చింది. అప్పుడు ''బాబోయ్! నేను పండితుడిని. వీడు గజదొంగ. పండితపుత్రుడు పరమ శుంఠ'' అనేమాట నిజమౌతుందేమో!''అని భయపడ్డాడు. ఇంతలోనే మనస్సుని అదుపులోకి తెచ్చుకొని వీడి జాతకాన్ని మార్చలేము కాని మనస్సుని అదుపు చేయాలి. ఎలా? ఎలా? ఎలా? అని అలోచించి ఆరోజు నుండి పిల్లాడికి రామాయణ భారత, భాగవతాలు, గరుడపురాణం లాంటి పురాణాలు బాగా పిల్లాడికి చెప్పాడు. వీటిలో ప్రత్యేకంగా గరుడపురాణం మరీమరీ ఒకటికి పదిసార్లు వినిపించాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది.. ఈ తప్పు చేస్తే ఈశిక్ష పడుతుంది. ఆ తప్పుచేస్తే మరో శిక్ష పడుతుంది.. బంగారం దొంగతనం చేస్తే కుష్ఠు వ్యాది వస్తుంది, వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాది వస్తుంది. ఎవరినైనా దూషించడం, పరులమీద నిందలు వేయడం, గురువులని వేదాలని నిందించడం, దొంగతనాలు చేయడం లాంటివి చేస్తే తీసుకుతీసుకు చావాలి, ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనస్సులో లోతుగా పాతుకుపోయింది. ఎట్టకేలకు ఈకుర్రాడు కూడా పండితుడు అయ్యాడు.. ఇతడి పేరు కూడా క్రమంగా ఆనోటా ఈనోటా పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది..

రాజుగారు ఆపండితుడి తండ్రిని పిలిపించి ఓ పండిత బ్రహ్మ! భూసురోత్తమా! నీ కుమారుడి గుణగణాలు విన్నాను. ఇక నుండి నాదగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్ళాడు. అలా వేళ్ళాడే కాని మనస్సంతా ఆందోళన.. వీడి జాతకంలో గజదొంగ అవుతాడని ఉంది. ఇన్నాళ్ళు నాదగ్గర ఉన్నాడు కనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనస్సు మళ్ళకుండా చేశాను. ఇప్పుడు రాజమందిరంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం, వెండి ఇతర విలువైన సామాగ్రి చూసి పొరబాటున మనస్సు మారి దొంగతనం చేస్తే వాడి తలే పోతుంది. అయ్యో పంపించకపోతే వీడికి భవిష్యత్తు ఉండదు. అక్కడికి వెళ్ళాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు. అని తననుతాను నిగ్రహించుకొని కొడుకుని పిలిచి నాయనా రేపటి నుండి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చేయాలి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుతో ఉన్నావా! తలే తీసేస్తాడు రాజుగారు అని మళ్ళి గరుడపురాణం చెప్పి, ఎన్నెన్నో నీతులు చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపించాడు.

చిన్ననాటి నుండి ఇలా పురాణాలు, రామాయణ, భారత భాగవతాలు చెప్తుంటే ఎందుకు చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఈ పండితపుత్రుడికి.. వీడు గజదొంగ అవుతాడని తండ్రికి తప్ప వీడికి తెలిదు. మొత్తమ్మీద రాజుగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితుడయ్యాడు. పూజ చేయడానికి పూజామందిరంలోకి వెళ్ళగానే అక్కడ ధగధగ మెరిసిపోతున్న వజ్రాలు, పగడాలు, బంగారం, వెండి వస్తువులు చూసి ఆహా! నాజీవితంలో ఇలాంటివి చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు. తీసుకోవాలి అనుపించింది. వెంటనే మనస్సులో అమ్మో ఈ దొంగతనం చేస్తే ఈ బాధలు పడాలి అని చిన్నప్పటి నుండి తన తండ్రి చెప్పిన మాటలు, పురాణాలు గుర్తొచ్చి అమ్మో! ఒద్దు ఒద్దు అని వెనక్కి తగ్గి పూజాది కార్యక్రమాలు చేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఆనాటి కార్యక్రమాలు పూర్తీ చేసి ఇంటికి వెళ్లబోతుంటే రాజద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూట చూసి 'ఏంటిది స్వామి చూపించండి;; అనగా అయ్యో ఏమిలేదు ఏమిలేదు అనగా అనుమానం వచ్చి లాక్కుని చుస్తే ఆ మూటలో తవుడు ఉంది. ఇదేంటి స్వామి తవుడు మూట పట్టుకుపోతున్నారు? బెదిరిపోతూ చూశాడు. సందేహంతో రాజుగారి దగ్గర ఇతడిని ప్రవేశపెట్టారు. అప్పుడు రాజుగారికి జరిగినదంతా పూసగుచ్చినట్లు భటులు చెప్పారు. అంతావిని భూసురోత్తమా! ''ఎందుకు ఇలా చేశావు? అని అడుగగా ''ఏమిలేదు మహారాజా! ఆవుకి పెట్టడానికి ఇంట్లో తవుడు నిండుకుంది. అందుకే ఇలా చేశాను. అనేసరికి రాజుగారు నవ్వుకొని; అదేంటి పండితపుత్రా! అడిగితే బస్తాలకి బస్తాలకి ఇచ్చేవాడిని. దొంగతనం చేయాల్సిన ఖర్మేమి వచ్చింది? చిన్నపిల్లాడి చేష్టల ఉంది అనుకోని అతడి తండ్రినిపిలిపించాడు.

తండ్రి గజగజా వణికిపోయి అయ్యో వీడేం చేశాడో? అనుకున్నదంతా జరిగినట్లు ఉంది. ఎంత చెప్పిన కర్మని మార్చలేము. అయ్యో వాడి తల తీసేస్తారు. కుయ్యో మొర్రో, అయ్యో, నాయనో అంటూ ఏడుస్తూ దర్బార్ కి వచ్చాడు. అప్పుడు రాజుగారు జరిగింది చెప్పాడు. మనస్సులో హమ్మయ్య! అనుకోని మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి. ఏకాంతంగా మాట్లాడాలి. అని రాజుగారి ఎంకాంత మందిరానికి తీసుకెళ్ళి ; మహారాజా! నన్ను క్షమించండి. ఇదిగో వాడి జాతకం. వీడి జాతక ప్రకారం గజదొంగ అవ్వాలి. కాని నేను మన భారత, భాగవత, రామాయణ, పురాణాలు చిన్ననాటి నుండి భోదించాను. వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తి అయింది. లేదంటే ఈపాటికి వాడు గజదొంగ అయ్యుండేవాడు. వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయ్యింది. ఇకమీదట ఎలాంటి అపశ్రుతి జరగదు అని మాటిస్తున్నాను. అని రాజుగారికి వివరించాడు. ఆ పండితుడి నిజాయితీకి మెచ్చుకొని మణిమాణిక్యాలు ఇచ్చి, బస్తాల కొద్ది ఆహారధాన్యాలు ఇచ్చి, తవుడు ఇచ్చి పంపించాడు.. ఆవిధంగా పిల్లాడి దోషాలని నివృత్తి చేశాడు తండ్రి.

అందుకే పిల్లలకి చిన్ననాటి నుండి ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలు చెబితే జాతకాలు మార్చేయవచ్చు.

No comments:

Post a Comment