Thursday, December 29, 2022

ఇవన్నీ లక్ష్యానికి చేరువగా తీసుకువెళ్ళే గొప్ప గుణాలు!-

 సరైన ప్రయత్నం ద్వారా సాధ్యంకాని వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎవరైనా ఆశించిన వస్తువును అందుకునేందుకు ప్రయత్నిస్తే వారు తప్పక దాన్ని సాధిస్తారు. చేపట్టిన పనిని మాత్రం దృఢచిత్తంతో కొనసాగించాలి’ అని బోధించింది సుప్రసిద్ధ తాత్వికగ్రంథం యోగవాసిష్ఠం.

స్వప్రయత్నం ద్వారా జీవనాధారం సాధించి మానవ జన్మను సార్థకం చేసుకొమ్మని మన సంస్కృతి హితవు పలుకుతోంది. శ్రమపడకుండా ఫలం లభించాలని కోరుకోవద్దని వేదం చెబుతోంది. ప్రతి వ్యక్తీ ఇతరుల తోడ్పాటు కోసం ఎదురుచూడక ప్రయత్నశీలుడు కావాలి.

కార్యసాధనకు కావలసినవి ముఖ్యంగా రెండు. ఒకటి స్వప్రయత్నం. రెండోది దైవానుగ్రహం. పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం ఎప్పుడూ లభిస్తుంది. దైవకృప, పురుష ప్రయత్నం రెండూ అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. మనం చేపట్టిన పని చిన్నదైనా పెద్దదైనా కావచ్చు. దాన్ని మనసుపెట్టి చేయడానికి ప్రయత్నించాలి. ఎంత గొప్పవాళ్లకైనా ప్రయత్నం వల్లే కార్యసిద్ధి లభిస్తుంది.

దేవేంద్రుడైనా ప్రయత్నంచేస్తే తప్ప అమృతాన్ని సాధించలేకపోయాడు. ఇంద్ర పదవిని చేపట్టడానికి అసుర సంహారం చేయడం అంత సులభమైన పని కాదు. ప్రయత్నం చేస్తేనే తప్ప ఇంద్రుడు ఆ దశకు చేరుకోలేకపోయాడు. అంటే నిరంతర ప్రయత్నంవల్లే ఎవరైనా విజయాన్ని సాధిస్తారు.
చీమ చిన్నదైనప్పటికీ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెయ్యి యోజనాల దూరం సైతం చేరుకోగలుగుతుంది. కదలకుండా, ప్రయత్నం చేయకుండా ఒక్కచోటే కూర్చుని ఉంటే గరుత్మంతుడు అంతటివాడూ ముందుకు వెళ్లలేడు. అందుకే ఆరొంతులు మన ప్రయత్నం ఏడోవంతు దైవకృప అన్నారు పెద్దలు. సాధన చేయకుండా, నిరంతర పరిశ్రమ లేకుండా ఉన్నత పథం చేరుకున్నవారెవరూ లేరు.

మన ప్రగతికి మనమే శిల్పులు కావాలనుకుంటే సింహావలోకనం చేయాలి. అరణ్యంలో సంచరించే సింహం ఒక్కోమారు తన ముఖాన్ని వెనక్కి తిప్పి తాను నడిచివచ్చిన దారిని చూస్తుంది. దీన్నే సింహావలోకనం అంటారు. ఆ విధంగానే మనమూ మన మనసును శోధించాలి. ఆత్మ విమర్శ చేసుకోవాలి. లక్ష్యం చేరడానికి శ్రద్ధాభక్తులతో పనిచేయాలి. కార్యసిద్ధి కోసం నిరంతర సాధనచేస్తూ ప్రతి అవకాశాన్నీ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.

ఏ మనిషైనా ప్రయత్నం సిద్ధిస్తే అది తన విజయంగా భావిస్తాడు. విఫలమైతే దాన్ని ఇతరుల పైకి నెడతాడు. జయాపజయాలు రెండింటినీ సమభావంతో స్వీకరిస్తేనే మనిషి ఎలాంటి కార్యాన్నయినా సాధించగలడు.
=======

శివుడి ఆజ్ఞలేనిదే పూచిక పుల్లయినా కదలదని కొందరంటారు. మనిషి పరిస్థితులకు దాసుడని కొందరి అభిప్రాయం. తలరాత, గ్రహగతులు, కర్మఫలం ఇవన్నీ ఉన్నప్పటికీ మానవ ప్రయత్నం సరైన దిశలో సాగితే దేవుడు సైతం జీవన గతులను మార్చగలడు భర్త ప్రాణం కోసం సావిత్రీ యముడి వద్ద చేసిన ప్రయత్నం వలన విధి రాత మార్చి భర్తను పునర్జీవిగా చేసుకొని మాంగళ్యాన్ని కాపాడుకొని ఆదర్శంగా నిలిచిన కథ తెలిసిందేగా...
మనిషి ఓటమిపాలైనప్పుడు ఓదార్పు కోసం చెప్పే మాటలను వాటి ఆంతర్యాన్ని గ్రహించకుండా గుడ్డిగా పాటిస్తూ, సోమరిగా జీవితం గడిపే వ్యక్తులు ఏ కార్యాలనూ సాధించలేరు. అటువంటి మనస్తత్వం, వ్యక్తులను పిరికివాళ్లుగా మారుస్తుంది. అందుకే మనిషి స్వప్రయత్నాన్నే నమ్ముకోవాలి.

ధైర్యశాలురు, సాహసవీరులు, జ్ఞానులు అదృష్టం కోసం వేచి ఉండరు. స్వప్రయత్నంతో, సాహసంతో ముందంజ వేస్తారు. ప్రతిబంధకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తమ లక్ష్యాలను సాధించుకుంటారు. ప్రతి మనిషీ విభిన్నంగా ఆలోచించాలి. కొత్తదారుల్లో ప్రయాణించే ధైర్యం కలిగి ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఇవన్నీ లక్ష్యానికి చేరువగా తీసుకువెళ్ళే గొప్ప గుణాలు!-

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం

No comments:

Post a Comment