Friday, December 23, 2022

అటువంటి వాడికి మరుజన్మ ఉండదు.

 శ్రీమంతుల ఇంట్లోపుడితే, అతనికి ఉన్న ధన బలము, అతని స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న వాతావరణం అతనిని చెడు అలవాట్లువైపు లాగుతుంది కదా! మరి, అతనికి యోగాభ్యాసం చేయడానికి ఎలా వీలు కుదురుతుంది. అని ప్రతి సందేహము కలుగుతుంది.

పూర్వజన్మలో యోగాభ్యాసము చేసి, అది పూర్తి కాకుండానే మరణించిన యోగి, మరుజన్మలో శ్రీమంతులు, ఆచారవంతులు అయిన వారి గృహములో జన్మిస్తాడు అని చెప్పాను కదా! అతనికి ఉన్న ధనము, పరిసరాలు అతడిని చెడు అలవాట్లవైపు లాగినా, ఈ యోగభ్రష్టుడు వాటి వంక చూడడు. ఆధ్యాత్మికతే వైపే మొగ్గు చూపుతాడు. అతడి పూర్వజన్మ సంస్కార బలం అటువంటిది. కాబట్టి మనం ఏచిన్న పుణ్యకార్యము చేసినా అది మనకు తరువాతి జన్మలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదే విధంగా పాపం చేసినా అది మరుజన్మలో పాపకార్యములు వంక లాగుతూనే ఉంటుంది. పుణ్యకార్యములు, ధ్యానము, మంచి బుద్ధిని కలిగిస్తే, పాపపు పనులు పాపబుద్దిని కలిగిస్తాయి.

ఇప్పటికీ మనం అక్కడక్కడా చూస్తుంటాము. రమణ మహర్షి, కంచి పరమాచార్య, త్యాగరాజు మొదలగు వారు. ఇంకా మనకు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. వారందరూ ముందు జన్మలో ఆధ్యాత్మికతలో మునిగి తేలిన వారు కాబట్టి, మరుజన్మలో కూడా వారు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక బుద్ధి కలిగి ఉంటారు. ఆధ్యాత్మికతవైపుకే లాగబడతారు. వారిని ప్రాపంచిక విషయాలు ప్రలోభపెట్టలేవు. అంటే, ముందు జన్మలో యోగాభ్యాసము ఆధ్యాత్మికత పెంపొందించుకున్నవాడు, మరు జన్మలో కూడా ఆ వైపుకు బలవంతంగానైనా లాగబడతాడు.

 అటువంటి జిజ్ఞాసువు, తిరిగి వేదములు, శాస్త్రములు, వాటిలో ఉన్న కర్మకాండల వంక చూడకుండా, కేవలము పరమాత్మను తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అతడు పూర్వజన్మలో ఈ కర్మకాండల స్థితిని దాటి, నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించే స్థితికి చేరుకున్నాడు. కాని కాలం తీరడం వలన మరణించాడు. మరుజన్మలో అతడు చెడు అలవాట్ల వైపు లాగబడకుండా, మరలా కర్మకాండల వంక, ప్రాపంచిక సుఖముల వంక పరుగెత్తకుండా, ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తాడు. పరమ సుఖమును, శాంతిని పొందుతాడు. తుదకు పరమాత్మలో ఐక్యం అవుతాడు. అటువంటి వాడికి మరుజన్మ ఉండదు.

follow: @bhagavadgithaa

 🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

No comments:

Post a Comment