Friday, December 30, 2022

 అజ్ఞానానికి మూలం నేను అనే మూల తలంపు. ఆ తలంపు మనసుతో బాటు నాశనమయితే మిగిలేది పరిపూర్ణమైన ఆత్మ. 

 నిత్యమూ గాఢ నిద్ర నుంచి మేల్కొలిపేది నేను అనే అహం కాదు. నేనుకు అతీతమైన ఆత్మ చైతన్యమని తెలుసుకోవాలి.

 దేహం ఒక ఉపాధి మాత్రమే అని గ్రహించాలి. ఇది నశించిపోయేది. నేను అనేది అహం నుంచి వెలువడితే అదే ఆత్మ. స్వరూపం. అపుడు నేనుగా భాసించేది ఆత్మ చైతన్యం.

దేహాత్మ భావన వల్ల పరమాత్మ, జీవాత్మలు వేరు అనే భేదం ఉత్పన్నమవుతోంది. అజ్ఞానం పొర తొలగినపుడు అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మేనని అవగతమవుతుంది.

భేద భావంతో కలిగిన ఆత్మ ఆజ్ఞానం తొలగినపుడు స్వాత్మానుభవం కలుగుతుంది. అదియే 'తత్త్వమసి'.

 ఆత్మ ద్వైతం కాదు. అద్వైతమనే తలంపు కలిగిన వెంటనే నేను ఆత్మయందు స్థితి కలిగి నిలిచిపోవును. అజ్ఞానం వల్ల ఏర్పడిన నేను అనే తలంపును ఆత్మ చైతన్యమని తెలుసుకున్న తరువాత వేరొక జ్ఞానం అవసరం లేదు.

 ఆత్మ వ్యయరహితం, జనన మరణాలు లేనిది, అనంతమైన సచ్చిదానందాన్ని కలిగి ఉన్నది.

 బంధ మోక్షాలకు అతీతమైనది ఆత్మ. నేను ఆత్మగా వెలుగొందుతుంది.

 నేను అనేది లేకుండా తనకు తానుగా విచారిస్తే సర్వ

సందేహాలు తొలగి ఆత్మతత్త్వము బోధపడుతుంది. అదే తపస్సు.  శాశ్వతానంద తత్త్వము. ఫలాపేక్షరహిత కర్మయోగం. అదియే పూర్ణత్వమని రమణ మహర్షి మానవాళికి తెలిపారు. ఇదియే ఆయన అనుభవ సారము.

No comments:

Post a Comment