Friday, December 9, 2022

మనం పెళ్ళిచేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీపూజ చెయ్యాలి. గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది.

 *శివపురాణం* -23 వ  భాగం:(C)

ఆంద్రదేశమునందు, తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్ళిచేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీపూజ చెయ్యాలి. గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది. అన్నీ అమ్మవారి స్వరూపములే. పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకువిల్లు పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మనకోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టి నంతటినీ చేసి మరల ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదికి వెడుతున్నపుడు ఆమెకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక ఆమెయందు అటువంటి బలం రావాలని ఆమెచేత సన్నికల్లు తోక్కిస్తారు. పెళ్ళి పీటలమీద కూర్చునేముందు పెళ్ళి కూతురుచేత గౌరీపూజ చేయిస్తారు. ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు ‘సన్నికల్లు ఎలా ఉందొ అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్తమీద మామమీద మరిది మీద ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమయిన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండు చేయకు అని బోధ చేస్తారు. వధువు ‘నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంది పోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా, అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్లుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదను గాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై వుండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు’ అని పెళ్ళికూతురు గౌరీ తపస్సు చేస్తుంది. మన ఆర్షధర్మం అంత గొప్పది. మనజాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీపూజ చేస్తాము.

అక్కడ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. అక్కడ అమ్మవారు పులిని కూడా మందర పర్వతము దగ్గరకు తీసుకువెళ్ళింది. దానిని పరమశివునకు చూపించి – ‘అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చింది. తన స్వభావమును మార్చుకుంది. కాబట్టి దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురమునందు రక్షణ భారము వహించే అదృష్టమును ఇవ్వండి’ అంది. అపుడు శంకరుడు తప్పకుండా పార్వతీ అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటిముందు నందీశ్వరుని కన్న కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమథగణములలో ఒకడిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనపడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం ఈ గౌరీ వృత్తాంతం కౌశికీ వృత్తాంతం రాక్షససంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపుకుంకుమలతో పదికాలాలపాటు ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. కనుక అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితిని మనం పొందెదముగాక !

ఇంతటితో శివపురాణం -23 వ  భాగం సమాప్తమైనది... 

|| ఓం నమః శివాయ ||

No comments:

Post a Comment