Wednesday, December 21, 2022

****సృష్టి మంచిదా, చెడ్డదా? - రమణ మహర్షి

 సృష్టి మంచిదా, చెడ్డదా?
- రమణ మహర్షి
రమణ మహర్షి! గురుబోధ లేకుండానే, ఆధ్యాత్మిక సత్యాలను దర్శించిన అన్వేషి. ‘నేను’ అన్న మాట మీద దృష్టిని పెట్టండి చాలు, మాయ తెరలు తొలగిపోతాయని సూచించిన జ్ఞాని. తన 16వ ఏట ఆయనకు మరణానుభవం కలిగిన దగ్గర్నుంచీ, రమణుడు సాగించిన ఆధ్యాత్మిక యాత్ర అసాధారణమైనది. వంటలు చేస్తూ భౌతిక ధర్మాలను ఆచరించినా, తల్లికి సైతం గురువుగా నిలిచి సన్యాసానికి కొత్త నిర్వచనాన్ని అందించినా... రమణ పథం చాలా భిన్నమైనది. 1896 మొదలు, ఐదు దశాబ్దాలకు పైగా రమణులు తిరువణ్ణామలై నగరాన్ని తన కార్యక్షేత్రంగా మలచుకున్నారు. ఆ రమణుని చెంత సేదతీరి తమ ఐహిక దుఃఖాలను, ఆధ్మాత్మిక తృష్ణను తీర్చుకునేందుకు వందలాది జనం నిత్యం అరుణాచలానికి బారులు తీరేవారు. భక్తులు అడిగే ప్రతి ప్రశ్నకూ రమణులు తనదైన శైలిలో జవాబుని అందించేవారు. వాటిలో చాలావరకూ జవాబులు, నిన్ను నువ్వు ముందుగా తెలుసుకో అన్న సూచనతో ముగిసేవి. మరికొన్ని సందర్భాలలో రమణులు తనంతట తానుగా ఏదో ఒక విషయం గురించి అభిప్రాయాన్ని వెల్లడించేవారు. ఉదాహరణకు ‘ఈ ప్రపంచము సుఖం కోసం సృష్టించబడిందా? దుఃఖం కోసం సృష్టించబడిందా?’ అని ఓ పుస్తకంలో ఉన్నా ప్రశ్న గురించి రమణులు ఏం చెప్పారో చూడండి...
‘సృష్టి మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. అది ఉన్నట్లే ఉన్నది. మానవుని మనస్సు దానిని తన కోణం నుంచి చూస్తూ తనకు అనుకూలమైనట్లు వ్యాఖ్యానిస్తుంది.... ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నింటికీ ఈ సంబంధాలే కారణం. సృష్టి ఒక రావిచెట్టు వంటిది. పక్షులు దాని పండ్లు తినడానికి వస్తూ ఉటాయి. మనుష్యుల దాని నీడలో చల్లదనం కోసం వస్తారు. కొంతమంది ఆ చెట్టకు ఉరిపోసుకుని చచ్చిపోతారు. కానీ ఆ చెట్టు వీటన్నింటితో ఏమీ సంబంధం లేకుండా, ఇవేమీ గుర్తంచకుండా తన పాటికి తాను జీవిస్తూ ఉంటుంది. మానవుడి మనస్సే కష్టాలను సృష్టించుకుని సహాయం కోసం అలమటిస్తూ ఉంటుంది. ఒక మనిషికి కష్టాలిచ్చి మరొకడికి సుఖాలీయటానికి భగంతుడికంత పక్షపాతం ఉంటుందా? సృష్టిలో అన్నిటికీ చోటు ఉంటుంది. కానీ ఒక క్షుథార్తుడు ప్రక్కనే రుచికరమైన తిండి ఉండగా దానివైపు చేయిజాపి ఆకలి తీర్చుకోకుండా ఉన్నట్లు, మానవుడు సృష్టిలో ఉండే మంచివాటినీ, ఆరోగ్యకరమైన వాటినీ, సుందరమైనవాటినీ వదలిపెట్టి ఊరకే దుఃఖిస్తూ ఉంటాడు. ఇది ఎవరి తప్పు, భగవంతునిదా, మానవునిదా? కాని మనుష్యుల అదృష్టం కొద్దీ, భగవంతుడు అనంతదయాసాగరుడై మానవుని ఎన్నడూ వదిలిపెట్టడు. ఎల్లప్పుడూ గురువులనూ, శాస్త్రాలనూ ఇచ్చి, కొత్త అవకాశాలను ఇచ్చి, మార్గం చూపించి తన తప్పులను తెలుసుకొనచేసి తుదకు శాశ్వతానందాన్ని ప్రసాదిస్తాడు.

No comments:

Post a Comment