కృష్ణుడు యోగులను నాలుగు రకాలుగా చెప్పాడు. తపస్సు చేసే వాళ్లు అంటే దైవాన్ని సగుణోపాసన చేసే వాళ్లు. వీరు భక్తులు అని కూడా అనవచ్చు.
రెండవ తరగతి వారు శాస్త్రములను చదవడం, వినడం, మననం చేయడం, మననం చేసిన దానిని చక్కగా అర్థం చేసుకోవడం, దాని ద్వారా జ్ఞానం సంపాదించడం. వీరిని జ్ఞానులు అని అంటారు. మూడవ తరగతి వారు 'కర్మిభ్యః' అంటే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, వ్రతాలు, పూజలు మొదలగు కర్మలు చేసేవాళ్లు.
నాల్గవ తరగతి వారు యోగులు. ఈ యోగులు ఎవరంటే, పైన చెప్పిన తరగతులు అన్నీ దాటి, వాటిలో చెప్పినవి అన్నీ చేసి, ఇంద్రియనిగ్రహం, మనోనిగ్రహం పాటించి, ధ్యానంలో కూర్చుని, మనసును ఆత్మయంగు నిలిపిన వాడు యోగి. ఈ యోగి పైన చెప్పబడిన యోగులందరికంటే అధికుడు.
మనకు తపోధనులు, పండితులు, వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేసిన వారు, అగ్నిహోత్రము, యజ్ఞాలు, యాగాలు మొదలైన కర్మలు చేసినవారు, సాధారణంగా కనపడుతుంటారు. వీరందరి కంటే యోగి గొప్పవాడు. యోగి అంటే యోగాన్ని అభ్యసించిన వాడు, యోగము అంటే ధ్యానయోగం. మనసును ఆత్మలో నిలపడం. ఆత్మదర్శనం చేయడం. ఆత్మానందాన్ని పొందడం. దీనినే యోగం అని తెలుసుకున్నాము. ఈ యోగం అవలంబించిన వాడే ఉత్తముడు, సర్వశ్రేష్ఠుడు.
శ్రద్ధ భక్తితో ధ్యానం చేసి, మనసును నిగ్రహించి ఆ మనసును ఆత్మలో లయం చేసే వాడే యోగి. వాడే అందరి కంటే గొప్పవాడు. అంటే తపస్సు చేసే తాపసులు, శాస్త్రములను అధ్యయనం చేసే జ్ఞానయోగులు, కర్మలను చేసే కర్మయోగులు తక్కువ వారు అని అర్థం కాదు. వీరిలో ఒకరికంటే ఒకరు గొప్పవారు. కర్మ, జ్ఞానము, తపస్సు, వీటి కంటే ధ్యానం, ఆత్మదర్శనం చేసినయోగి మోక్షానికి దగ్గరగా ఉంటాడు.
యోగులు అంటే కాషాయాలు ధరించి, జడలు కట్టుకొని దండం పట్టుకొని తిరగడమో లేక మఠాలు స్థాపించడమో కాదు. ఎవరైనా ఎక్కడైనా, ఇంట్లో నైనా ఎక్కడైనా యోగం చేయవచ్చు, ఆత్మదర్శనం పొందవచ్చు అని నిరూపించాడు కృష్ణుడు. మనస్సును ప్రాపంచిక విషయాల నుండి మరలించి ఆత్మలో స్థిరంగా ఉంచడమే యోగం అని వివరంగా చెప్పాడు. నిరతంరం భగవంతుని మననం చేయువాడే యోగి అని చెప్పాడు. కాబట్టి ఆ యోగాన్నిఆచరించడం మన ధర్మం.
Follow: @bhagavadgithaa
🙏 హరే కృష్ణ 🙏
No comments:
Post a Comment