211222h1715. 221222-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ప్రశ్నోత్తరాలు*
➖➖➖✍️
*జ్ఞానానికి ఆధారం ప్రశ్నించడమే. తమ ప్రశ్నలకు గురువుల సమాధాన వివరణలను ఆకళింపు చేసుకుంటూ శిష్యులు జ్ఞానవంతులవుతారు.*
*ప్రశ్న- జవాబులతోనే మానవ మేధ వికసిస్తుంది. అనేక ధర్మ సందేహాలకు మన పురాణాలు సమాధానాలు చెబుతాయి.*
*పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ధర్మరాజు ఒక యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఏర్పడింది. వరసగా అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు చెప్పి యక్షుడి రూపంలో ఉన్న ధర్మదేవతను మెప్పిస్తాడు.*
*మహాభారత యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడి అనేక సందేహాలకు భగవంతుడు అనుగ్రహించిన ఉపదేశ పూర్వక సమాధానమే భగవద్గీత. మానవాళికి మార్గదర్శకమైన భగవద్గీత ఆవిర్భావానికి అర్జునుడి సందేహాలే కారణమయ్యాయి.*
*అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరకు శ్రీకృష్ణుడితోపాటు ధర్మరాజు, నారదాది మహర్షులు వెళ్ళారు. శ్రీకృష్ణుడి అనుమతితో ధర్మరాజు అడిగిన అనేక ప్రశ్నలకు సవిస్తరంగా భీష్ముడు చెప్పిన సమాధానాలు శాంతిపర్వమై మానవజాతికి ధర్మ ప్రబోధకంగా భాసిల్లాయి.*
*వేదవ్యాస మహర్షి వేదాలను విభజించాడు. మహాభారతం రచిం చాడు. అయినా సంతోషం కలగలేదు. తన ఆశ్రమానికి విచ్చేసిన నారదు దీని వ్యాసుడు తన విచారానికి కారణ మేమిటని ప్రశ్నిస్తాడు. ధర్మ విశేషాలన్నీ వెల్లడించిన వ్యాసుడు విష్ణు కథలు మాత్రం సమగ్రంగా చెప్పలేదన్న విషయాన్ని నారదుడు గుర్తు చేస్తాడు. బంగారు | కమలాలతో, కలహంస పంక్తులతో శోభాయ మానమైన సరో వరంలా హరినామ కీర్తనతో ప్రకాశించే కావ్యాన్ని రచించి భగవంతుడైన మాధవుడి లీలల్ని అభివర్ణించమని నారదుడు సలహా ఇస్తాడు. నారదుడి మాటల పరమార్ధం గ్రహించిన వ్యాసుడు భాగవతమనే భక్తి రసామృతాన్ని మానవులకు అందించాడు.*
*మహర్షుల మనసులలో ఉత్పన్నమైన సందేహాలకు సమాధానాలు మానవులకు జీవన సరళిని నిర్దేశిస్తూ లోకకల్యాణకారకమవుతాయి. మనసు సంధించే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రయత్నంలో పరిశోధనలు ప్రారంభించేవారు శాస్త్రవేత్తలవుతారు. నూతన సిద్ధాంతాలను ఆవిష్కరిస్తారు.*
*వందమంది పృచ్ఛకులు అడిగే ప్రశ్నలకు భావగర్భితంగా ఛందోబద్ధంగా జవాబులు చెప్పే సాహిత్య క్రీడ శతావధానం. అవధాని మేధకు అవధులుండవు.* *భగవంతుడెక్కడున్నాడు అన్న ప్రశ్న మనసులో చిగురించగానే బుద్ధి భగవంతుడి వైపు మళ్ళుతుంది. తన ప్రశ్నకు జవాబు అన్వేషించే ప్రయత్నంలో భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడన్న నమ్మకం పెరుగుతుంది. మనసులో భక్తిభావన పెల్లుబుకుతుంది.*
*ఆధునిక కాలంలో ప్రశ్నిస్తేనే న్యాయం జరుగుతుంది. ప్రశ్నలతోనే నిజం వెలుగు చూస్తుంది. అనునిత్యం సందేహాలతో సతమతమయ్యేవారు జీవితంలో ఏమీ సాధించలేరు. సమస్య ఎదురైనప్పుడు వివేకంతో యోచించి పరిష్కరించుకునే ప్రయత్నం చేసేవారు విజయపథంలో పయనిస్తారు. ఆయా రంగాలలో నిష్ణాతులైనవారిని సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు ఉన్నత స్థితిలో రాణిస్తారు.*✍️
- ఇంద్రగంటి నరసింహ.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment