Sunday, December 25, 2022

సనాతన ధర్మం అంటే ఏమిటి?* *అది ఎందువల్ల ప్రత్యేకమైనది*

 *సనాతన ధర్మం అంటే ఏమిటి?*

*అది ఎందువల్ల ప్రత్యేకమైనది*

     *"ధార్యతే ఇతి ధర్మః"*
పారమార్ధిక దృష్టితో చూస్తే అందరినీ ధరించి పాలించు విశేషస్వరూపమునే ధర్మం అనియూ, వ్యవహార దృష్టితో చూస్తే పాటించే మనిషికి సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టే అలవాట్లనూ ఆ అలవాట్లు మనస్తత్వంలో స్థిరపడేటందుకు అవసరమైన ఆలోచనా పద్ధతిని శాసించే నియమాలని కలిపి ధర్మం అనీ అంటారు.ఈ ధర్మం అనే ఒక్క మాటని పుట్టించి నిర్వచించి విశ్లేషించి నిరూపించి మానవ జీవితానికి కేంద్రస్థానంలో నిలబెట్టటమే సనాతన ధర్మం యొక్క విశిష్టత!

          ప్రాచీన భారతీయ సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తలు ధర్మపాలన అనే పేరున సత్యవాక్పరిపాలన, పరోపకారము, భూతదయ, బ్రహ్మచర్యం/ ఇంద్రియనిగ్రహం, దానశీలత, ఆహారశుద్ధి, విద్యుక్త కర్మాచరణం, శాంతస్వభావం, క్షమాగుణం అనే లక్షణాలను ప్రతి ఒక్కరికీ ఆవసరమైన లక్షణాలని పేర్కొన్నారు.అవి "మాకు నచ్చినవి, కాబట్టి చెయ్యండి!" అని చెప్పి వదిలెయ్యలేదు - ఎందుకు మంచివి అనే విషయాన్ని కూడా చెప్పారు,ఎట్లా వాటిని అనుష్ఠించాలో కూడా చెప్పారు. అట్లాగే లోభం, క్రోధం, మోహం వంటి అధర్మ సంస్కారాల్ని కూడా "మాకు నచ్చలేదు, కాబట్టి చెయ్యకండి!" అని కాక ఆ దుష్టత్వాలకు అలవాటు పడటం వల్ల కలిగే నష్టాన్ని చెప్పి వాటిని వదిలివెయ్యడానికి సులువైన మార్గాలను కూడా సూచించారు.

          *శ్రీ మహాభారత* కావ్యనాయకుడైన యుధిష్ఠిరుడు తన ధర్మానికి కట్టుబడి ఉండే తీవ్రత్వాన్ని బట్టి ధర్మరాజు అని పేరు సంపాదించాడు.శత్రువులు అతనిని కష్టాల పాలు చెయ్యటంలో ఇతని సంపదని హరించటంతో పాటు ఇతన్ని ప్రలోభపెట్టి ఇతని చేత అధర్మ కార్యాలను చేయించాలనే ఉద్దేశం కూడా ఇమిడి ఉంది - అయినా నిగ్రహం కోల్పోకుండా నిలబడి భగవత్స్వరూపుడైన శ్రీరాముడి కన్న విశిష్టమైన స్థానాన్ని అందుకున్నాడు!ఇది కూడా సనాతన ధర్మం యొక్క ప్రత్యేకతలలో ఒకటి - ధర్మమే దైవం,దైవమే ధర్మం, ధర్మపాలనకు కట్టుబడిన ప్రతి మానవుడూ దైవ సముడే!

          *"సనాతనస్య ధర్మ ఇతి సనాతన ధర్మః"*  - "సనాతనుని యొక్క ధర్మమును సనాతన ధర్మమని అందురు". ఇది షష్ఠీ తత్పురుష సమాసం - స్థాపిత స్థాపక సంబంధాలను సూచించే ఈ సాంకేతిక పదాన్ని బట్టి సనాతనుడైన భగవంతుని చేత స్థాపించబడినది గనక ఇది సనాతన ధర్మం అయ్యింది!జైనులు, బౌద్ధులు, యూదులు, జొరాష్ట్రియన్లు, క్రైస్తవులు, మహమ్మదీయులు - మహావీర తీర్ధంకరుని, శాక్యముని గౌతమబుద్ధుని, ప్రధమ ప్రవక్తయైన  అబ్రహామును, దార్శనికుడైన జరతూష్ట్రను,  క్రైష్టును,ఆఖరి ప్రవక్తయైన మహమ్మదును ఆయా మతాలకు మూలపురుషులని నమ్ముతారు.అట్లాగే సనాతన ధర్మాన్ని పాటించే వారు తమది సనాతనుడైన భగవానుడి చేత స్థాపించబడినది తప్ప యే ఒక్క మానవుడూ దీనికి స్థాపకుడు కాదని విశ్వసిస్తారు!

    కొందరు హైందవేతర మతప్రచారకులు రాముడినీ, కృష్ణుడినీ, శివుడినీ తమ మతప్రవక్తలతో పోలుస్తున్నారు - వారి మతాలలో ప్రవక్తలు ఎట్లాగో హిందూమతంలో వీరు అట్లాంటివారని వక్రభాష్యాలు చెప్తున్నారు.ఇది తప్పు - హిందూమతాన్ని స్థాపించినది సనాతనుడైన భగవంతుడు, ఆయనకు తప్ప ఇంకెవరికీ కర్తృత్వం లేదు!రాముడూ కృష్ణుడే కాదు శివుడూ విష్ణువూ కూడా తమ యోగసాధన వల్లా ధర్మపాలన వల్లా యోగీశ్వరులై కీర్తించబడుతున్నారు - అంతే!

సనాతన ధర్మం తప్ప మిగిలిన వాటిని మూడు విధాల వర్గీకరించవచ్చును -
 1).భూతకాలమున ఉండి వర్తమానమున లేనివి, 2).భూతకాలమున లేక వర్తమానమున ఉన్నవి, 3).వర్తమానమున ఉండి భవిష్యత్తున ఉండనివి.

సనాతన ధర్మం ఈ మూడు తెగల్లో దేనికీ సంబంధించినది కాదు. ఇతర ధర్మాల కంటె ముందునుంచీ ఉన్నది, ఇప్పటికీ కొనసాగుతున్నది, ఇకముందు కూడా అన్ని ప్రత్యేకతలను నిలబెట్టుకుంటూ కొనసాగుతుంది! కొందరు హిందువులకి ఈ మధ్యనే హిందూ మతం అంతరించి పోతుందేమోనని భయం పట్టుకుంది - ఆ భయం అర్ధం లేనిది. 

 *"యత్ జన్యం తద్ అనిత్యం"*
 అనే ప్రకృతి నియమం అనుల్లంఘనీయం. ఏదైతే పుట్ట బడుతుందో, అది గిట్టక తప్పదు. కొన్ని దుష్కర కార్యాలను సాధించటానికి భగవంతుడు అనేక రూపాలను ధరించి కూడా తన కర్తవ్యం పూర్తి కాగానే అవతారం చాలించాడు - తను పెట్టిన నియమాన్ని తను కూడా ఉల్లంఘించటం లేదు!ఆ లెక్క ప్రకారం పుట్టుక ఉన్న ఇతర ధర్మాలు నశిస్తాయేమో గానీ పుట్టుక లేని సనాతన ధర్మం ఎప్పటికీ నశించదు - అనుష్ఠించిన వారు రక్షణ పొందుతారు, అనుష్ఠించని వారే నశిస్తారు. దృశ్యమాన ప్రపంచంలోని సకల వృక్షజాతులూ జంతుజాలమూ ఆఖరికి శిలాఖండాలు కూడా ఈ ధర్మాన్ని పాటిస్తుంటే కొందరు మనుషులు పాటించనందువల్ల ధర్మం నశిస్తుందనుకోవడం అమాయకత్వమే!

 అన్ని విభక్తి ప్రత్యయాలతో కూడిన నిర్వచనాలను పరిశీలిస్తే సనాతనుడైన భగవంతుని చేత స్థాపించబడినది కావటం వల్లనూ స్వతః సనాతనమైనది కావటం వల్లనూ దీనిని విశ్వసించి పాటించిన వారిని సనాతనులను చేస్తుంది.

    సనాతన  ధర్మం ప్రతి ఒక నైష్ఠికుడికీ చెప్పేది మరణానంతరం పొందబోయే స్వర్గనరకాదులను గురించి కాదు, జీవంతో ఉన్నప్పుడే ఈ ప్రపంచంలోనే భగవంతుణ్ణి చూసి, విని, స్పర్శించి ఆనందించి అతనిలో ఐక్యం కావడం గురించి నొక్కి చెప్తుంది!సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించే ప్రతి మానవుడూ  మొదట ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది పిదప పరమాత్మ సాక్షాత్కారాన్ని అనుభవించి మరణ సమయానికి  గతాను గతికమైన పాపరాశి మిగిలి ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి వీలైన ఉత్తమజన్మనీ పాపరాశి శూన్యస్థితికి చేరుకుంటే ఇంక జన్మ లేని మోక్షస్థితిని అందుకుంటాడు - అది, తాను యే భగవానుడి నుండి విడివడి జన్మపరంపరలోకి వచ్చాడో, ఆ భగవంతుడిలో లీనమైపోవటం అవుతుంది!
  
మొదట తెలుసుకోగానే  అసాధ్యం అనిపించే ఇంతటి సంక్లిష్టమైన లక్ష్యాన్ని కూడా చాలా సులభంగా సాధించగలిగేటట్లు మానవాత్మలను సిద్ధపర్చటం కోసం ప్రాచీన భారతీయ ఋషులు ఎంతగానో శ్రమించి ఎన్నో మార్గాలను ఏర్పరచారు,ఎన్నో ఉపాయాలను చూపించారు, శ్రమ తెలియకుండా ఉండేటందుకు ఎన్నో ఆనందాలను సమకూర్చారు - శ్రద్ధ ఒకటి ఉంటే చాలును ఈ ధర్మానుష్ఠానం ద్వారా సాధన పూర్తయ్యాకనే కాదు సాధన మొదలు పెట్టగానే ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అనే స్థాయిల్లో ఏదో ఒకదాన్ని పొందవచ్చును!

 సనాతన ధర్మానికి ఆద్యంతాలు లేవు. సృష్టి స్థితి లయ విభూతు లన్నింటా ఇమిడిపోయి వాటిని నడిపిస్తూ ఉంటుంది. ప్రళయంలో సైతం నశించదు - బీజ రూపంలో నిద్రాణమై ఉండి సృష్టి మొదలైనప్పుడు చైతన్యవంతమై సకల భూతాలకీ రక్షణ నిచ్చే మనోగతమైన సంస్కారాల్నీ  క్రమబద్ధమైన జీవన విధానాల్నీ ప్రసాధించి శాసించేది సనాతన ధర్మమే!త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని పాటించేవారికి మరణానంతరం లభించే స్వర్గసుఖాల కన్న వెయ్యి రెట్లు అధికమైన ఆనందానుభూతి జీవిత కాలంలోనే అనుభవంలోకి వచ్చి మరణానంతరం జన్మలు లేని కైవల్యం సిద్ధిస్తుంది.మొత్తం సనాతన ధర్మం వేదములు, స్మృతులు, సాధు సంతుల సదాచార ప్రసంగాలు, ఆత్మకు ఆహ్లాదాన్ని కలిగించే సత్కర్మలు అనే నాలుగు పాదాల పైన నిలబడిన ఒక చతుష్పాత్తు, గోమాత!సనాతన ధర్మం జీవుడు తన సహజాతి సహజ ఉపాధిగతమైన సాంఘిక జీవన పరిధిలోనే ఎలా ప్రవర్తిస్తే తరిస్తాడో బోధిస్తుంది.

సనాతన ధర్మం  మానవులు సత్యవాక్పరిపాలన, అహింసాయుత వర్తన, త్యాగనిరతి, ఇంద్రియనిగ్రహం, పరోపకారం, అస్తేయం, నియమపాలన వంటి దైవీయ ప్రవృత్తులను అలవాటు చేసుకుని వ్యక్తిగత జీవితంలో ప్రశాంతతనీ సామాజిక జీవితంలో గౌరవాలనూ అందుకుని ప్రశాంత చిత్తులై తమ చరమ లక్ష్యమైన మోక్షసాధన కోసం ప్రయత్నించటానికి ప్రేరణ ఇస్తుంది, ఉత్తేజితం చేస్తుంది,దైవసముల్ని చేస్తుంది!మనుస్మృతి ధర్మం యొక్క పది లక్షణాలను ఇలా క్రోడీకరించి చెప్తుంది:

శ్లో.  *ధృతిః క్షమా దమోస్తేయం, శౌచ మింద్రియ నిగ్రహః*
*ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణం!*
*(మనుస్మృతి VI - 92)*

          "ఓర్పు, క్షమ, దమం. అస్తేయం, శౌచం, ఇంద్రియనిగ్రహం, ధీ, విద్య, సత్యం, అక్రోధం - ఇవి ధర్మము యొక్క పది లక్షణాలు" సనాతన ధర్మం ఐహిక సుఖాలను ఆశించటాన్ని వ్యతిరేకించదు, కానీ ఇంద్రియనిగ్రహాన్ని ప్రశంసించి మితిమీరిన భోగలాలసత గురించి హెచ్చరికలు చేసి అంతిమ నిర్ణయాన్ని మన విచక్షణకే వదలి వేస్తుంది.ఈ స్వేచ్చను మరి యే ఇతర ధార్మిక శాఖ ఇంత విస్తృత స్థాయిలో ఇవ్వలేదు!

          ఎంతమంది అనుసరిస్తున్నారు అనే అంకెల్ని మాత్రమే లెక్కకి తీసుకుని ప్రస్తుతం మూడో స్థానంలో ఉందని బెంగ పెట్టుకుని మొదటి స్థానం కోసం ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న ఇతర మతాల్ని అనుకరించటం కోసం అంగలు వేస్తున్న హిందువులు ఇంత స్వేచ్చను అనుభవిస్తున్న  ప్రజాస్వామిక పద్ధతిలో మా మతంలో చేరితే చాలు మీ రోగాలూ కష్టాలూ మటుమాయం అయిపోయి వైభవాలు దక్కుతాయనే లాభసాటి వ్యాపార ఒప్పందాలూ మేము చెప్పినట్టు వినాలే తప్ప ఎందుకూ ఎలా ఏమిటని అడక్కూడదనే హేతువుకు స్థానం లేని మూర్ఖపు నిబంధనలూ మేం చెప్పేది నమ్మకపోతే మా దేవుణ్ణి మీమీదకి ఉసిగొల్పుతాం, ఆయన మిమ్మల్ని రోగాలతోనూ చావులతోనూ శిక్షిస్తాడనే బెదిరింపులూ ఏవీ లేకుండా కేవలం వ్యక్తుల స్వయం నిర్ణయాత్మకతతో ఇంతమంది ఈ ధర్మానికి బద్ధులై ఉన్నారని తెలుసుకుంటే బెంగ పోయి హుషారు వస్తుంది!

  ఇతరులకి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఆ అబద్ధాల్ని నిజాలని నమ్మి చెప్పటం లేదు,ఎదుటివాళ్ళని నమ్మించటం కోసమే శతవిధాల ప్రయత్నిస్తూ  అత్యవసరమైతే తాము కూడా నమ్ముతున్నట్టు నటిస్తారే తప్ప వాళ్ళు అవి నిజాలని నమ్మరు!మనం గనక నిజానిజాలు నిర్ధారించుకోకుండా అబద్ధాల్ని నమ్మితే మనకే నష్టం అనేది రెండు మూడు సార్లు అనుభవంలోకి వచ్చాక తప్పకుండా తెలుస్తుంది.అది తెలిశాక మనకి ఆ అబద్ధాలు చెప్పినవాళ్ళ నిజస్వరూపం తెలియడం వల్ల బలమూ దమ్మూ దన్నూ ఉంటే నాలుగు తన్ని కచ్చి తీర్చుకోవటమో అది కుదరకపోతే వాళ్ళనుంచి దూరంగా పారిపోవటమో చేస్తాం - ఈ విధమైన వాస్తవిక జ్ఞానం  పుష్కలంగా ఉండటం చేత ప్రాచీన భారతీయ సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తలు తాము సత్యానికి కట్టుబడి సత్యవాక్పరిపాలనని అన్నింటికన్న సర్వోత్కృష్టమైన స్థానంలో నిలబెట్టి మనల్ని కూడా సత్యం వైపుకే నడవమని పదే పదే నొక్కి చెబుతున్నారు!
 
వరుసలో మొదట చెప్పటమే కాదు. లోనారసి చూస్తే సనాతన ధర్మం మొత్తం సత్యం పునాదుల మీద నిర్మించబడినట్టు తెలుస్తుంది.మన వలెనే మానవజన్మ ఎత్తిన రాముడు మనకు పూజనీయుడై దైవసముడు కావడానికి తను సత్యానికి కట్టుబడిన పద్ధతియే కారణం కదా!సత్యం యొక్క గొప్పతనాన్ని శ్రుతి ఇలా ఉగ్గడిస్తున్నది:

మం. *సత్యాన్నాస్తి పరోధర్మః,*
*సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా*
*సత్యేన వాయు రావాతి,* *సత్యేనాదిత్యో రోచతే*
*దివి సత్యం వాచః ప్రతిష్ఠా,*
*సత్యే సర్వం ప్రతిష్ఠితం*
*సత్యేన సువర్గా ల్లోకాత్ చ్యవంతే కదాచన*
*సతాం హి సత్యం, తస్మాత్సత్యే రమంతే!*

   "సత్యమును మించిన ధర్మము లేదు. సత్యమే జ్ఞానమును అనంతమునైన బ్రహ్మస్వరూపము. సత్యము వలననే వాయువు వీచుచున్నది. సత్యము వలననే వాక్కు శాశ్వతమగుచున్నది. సత్యమునందే సర్వజగత్తును సుప్రతిష్ఠితమై యున్నది. సత్యము వలననే మానవులు స్వర్గాదుల నుండి చ్యుతులు గాకుందురు. సత్యమే శాశ్వతము. అందుచేతనే మహాత్ములు సత్యమునందే రమించుచున్నారు"

"యోవై ధర్మః స సత్యంవై తత్" అని బృహదారణ్యకోపనిషత్తు ఉద్ఘాటించి చెప్పడం వల్ల సత్యము వేరు ధర్మము వేరు కాదు, ధర్మమే సత్యము లేక సత్యమే ధర్మము అని సనాతాన్ ధార్మిక సాహిత్య సృష్టికర్తలు భావించినట్లు స్స్పష్టమౌతున్నది. సత్యవాక్పాలన గురించి మనుస్మృతి ఇలా చెబుతున్నది:

శ్లో.  *సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయాత్,*.
*న బ్రూయా త్సత్య మప్రియం*
*ప్రియంచ నానృతం బ్రూయాత్*
 - *ఏష ధర్మః సనాతనః*
(మనుస్మృతి )

          "సత్యమునే పలుకుము ప్రియమునే పలుకుము.సత్యమైనను అప్రియము పలుకకుము. ప్రియమైనను అసత్యమును పలుకకుము." - ఇంతకన్న ఎక్కువ ఎవరైనా చెప్పగలరా? అలా చెబితే ఎబ్బెట్టుగా ఉండదూ!

          సత్యం తర్వాత సనాతన ధర్మం ఎక్కువ కీర్తించినది పరోపకార పరాయణత్వాన్ని. "పరోపకారార్ధ మిదం శరీరం" అన్న శ్రుతివాక్యం అసలు ఈ శరీరం మనకు లభించిదే పరోపకారం కోసం అని చెప్తున్నది కదా!

శ్లో. *హే బాల! లోకసేవార్ధం కృత్స్నం త్వజ్జీవితం సదా*
*అర్పయిత్వా హర్షేణ సార్ధకం కురు యత్నతః!*

          "ఓ మానవా! ఎల్లప్పుడు పరోపకారార్ధము నీ జీవితమునంతటిని సంతోషముతో అర్పించి ప్రయత్నపూర్వకముగ నీ జీవితమును సార్ధకము చేసుకొనుము." - ఇక్కడ హర్షేణ, యత్నతః అనే రెండు మాటల్నీ వాక్యపూరణ కోసం వాడలేదని గమనించాలి.ఎందుకంటే, పరోపకారం అనేది మనసులో ఏడుస్తూ మెహర్బానీ కోసం చెయ్యకూడదు. అట్లాగే అవకాశం దొరికితే చెయ్యడం కాదు,మన స్థాయిలో పూనుకుని ఎంతో కొంత పరులకి ఉపయోగపడితేనే ధర్మం నిలబడుతుంది!

          సనాతన ధార్మికుల  శాస్త్రీయత అంతా ఇంద్రియనిగ్రహం గురంచి మిగిలిన అన్నింటికన్న ఎక్కువ సార్లు చెప్పడంలోనే తెలుస్తుంది - ఎన్నిసార్లు "ధర్మం నీకు క్షేమాన్ని కలిగిస్తుంది!అధర్మం నీకు నాశనాన్ని తెచ్చిపెడుతుంది!" అని చెవినిల్లు గట్టుకుని చెప్పినప్పటికీ ఇంద్రియాల మీద అదుపు లేనివాడికి తొలి అడుగు క్షణిక సుఖాల వైపుకే పడుతుంది - సర్వభ్రష్టం అయ్యాక తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత? మధ్యలోనే తెలిసినా  ఆ సమయం అంతా వృధాయే కదా -  ప్రాచీన గురువరేణ్యులలో కూడా కొందరు ఈ స్థితిని కొతకాలం అనుంభవించి కాబోలు "ముందు తెలిసెనా ప్రభూ!అన్ని చైదములు చేసి యుందునా?" అని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు!

          సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తలు కీర్తించిన మరొక విశిష్టమైన లక్షణం క్షమాగుణం.క్షమ అంటే కష్ట నష్టములను గానీ పరుష వాక్యాలను గానీ సహించి మనని కష్టపెట్టిన వారిమీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకుండా మౌనంగా ఉండిపోవటం.

శ్లో.    *నరస్యాభరణం రూపం,* *రూపస్యాభరణం గుణః*
*గుణస్యాభరణం జ్ఞానం,* *జ్ఞానస్యాభరణం క్షమా!*

  "మానవుని యొక్క ఆభరణం రూపం.రూపం యొక్క ఆభరణం గుణం.గుణం యొక్క ఆభరణం జ్ఞానం.జ్ఞానం యొక్క ఆభరణం క్షమ" - అంటే,మానవునికి రూపం కన్న గుణం కన్న జ్ఞానం కన్న క్షమయే శోభని ఇస్తుందని పై శ్లోకం చెబుతున్నది.అందుకే సత్పురుషులు, ముముక్షువులు, భగవంతుడు ఇతరుల తప్పుల్ని  క్షమిస్తూ ఉంటారు.

          మోక్ష సాధనకు వైరాగ్యం చాలా అవసరం. తన చుట్టూ ఉన్న సమస్తాన్నీ దోషదృష్టితో చూసి విషయవాసనల పట్ల జుగుప్సను పెంచుకుని వస్తుగతమైన వాంచలను తిరస్కరించటాన్ని వైరాగ్యం అంటారు.మానవునికి వైరాగ్యం అనేక కారణాల వల్ల కలుగుతుంది - దుఃఖము చేత కలుగు వైరాగ్యము, భయము చేత కలుగు వైరాగ్యము, వివేకము చేత కలుగు వైరాగ్యము.వీటిలో మూడవది శ్రేష్ఠమైనది.మొదటి రెండూ దుఃఖము గానీ భయము గానీ తొలగిపోగానే వాటి వల్ల కలిగిన వైరాగ్యం కూడా మాయమైపోయే అవకాశం ఉంది.

          యుగాన్ని బట్టి యుగధర్మం ఉంటుంది.కలియుగంలో మనుషులు దానం చేత తరిస్తారని పరాశర స్మృతి ప్రకటిస్తున్నది.

శ్లో.     *తపః పరం కృతయుగే*,  *త్రేతాయాం జ్ఞానముచ్యతే*
*ద్వాపరే యజ్ఞమేవాహుర్దాన మేకం కలౌయుగే!*

          "కృతయుగంలో తపము, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము కలియుగంలో దానము ముఖ్యమైన ధర్మాలు." - తన స్వార్జితమైన గో హిరణ్యాదులను మూల్యం తీసుకోకుండా శాస్త్రవిధి ననుసరించి తనకు వాటిపై గల హక్కును వదులుకుని యోగ్యుడగు మరొకనికి పూర్తి హక్కులను ఇవ్వడమే దానం అని నిర్వచించటాన్ని బట్టి ఏది పడితే అది ఎవడికి పడితే వాడికి ఎలా పడితే అలా ఇచ్చేది దానం కాదని తెలుసుకోవాలి. తన కష్టార్జితాన్ని మాత్రమే దానం ఇవ్వాలి.యోగ్యులైన వారికే దానం ఇవ్వాలి.ఇతరేతరమైన ప్రతిఫలం ఆశించకుండా దానం చెయ్యాలి.దానం ఇచ్చే వస్తువు మీద వ్యామోహం పూర్తిగా తెంచుకున్నాకనే దానమివ్వాలి.

          కాలం అనే ఒక తన్మాత్రను గురించి ప్రాచీన భారతీయ విజ్ఞానులు తెలుసుకున్నది మాత్రమే జ్ఞానం అని వేదం అనిదంపూర్వమైన రీతిలో స్థాపించి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటమే మానవులకు పరమలక్ష్యం అని నిర్దేశించటం ఒక్కటే సనాతన ధర్మాన్ని ఇతర ధర్మాల కన్న అత్యున్నతమైన స్థాయిలో నిలబెడుతున్నది!

          వైదిక సూత్రాల ప్రకారం మానవుడు ఎప్పటి వరకు తనకు జీవిత లక్ష్యమును నిశ్చయించుకొనడో అప్పటి వరకు అతని జీవిత కాలము వ్యర్ధము.ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మానవుడు ప్రతి క్షణం ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నించాలి,ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగిపోకూడదు,నిరాశలో నిలిచిపోయి దిక్కులు చూడకూడదు,నిరంతరం లక్ష్యం వైపుకు ప్రయాణిస్తూనే ఉండాలి.

శ్లో.ధనే నష్టే పునః ప్రాప్తుం, శక్తి స్యాద్యస్య కస్యచిత్
గత కాలస్తు నాయాతి - ఏవ మీశ్వర శాసనం!

          "ఎవడైనను ధనం పోగొట్టుకుంటే మరల సంపాదింప వచ్చును. ఎవడైనను శక్తిని పోగొట్టుకుంటే మరల సంపాదింప వచ్చును. కానీ గడిచిన సమయం మాత్రం తిరిగి రాదనేది ఈశ్వర శాసనం." - కాబట్టి ప్రతి మనిషీ రోజులో మెలకువగా ఉండే సమయాన్ని తనకు అనుకూలమైన రీతిలో విడగొట్టుకుని ఆ ఏర్పాటు ప్రకారం అలసటకు తావు లేని పద్ధతిలో తన లక్ష్యాన్ని చేరుకోవాలి.

          మన చుట్టూ కనిపించే మనుషుల్ని మూడు విధాలుగా వర్గీకరించవచ్చును - మనల్ని ద్వేషించేవారు, మనల్ని ప్రేమించేవారు, మనపట్ల ఉదాశీనులు.లక్ష్యము పట్ల ధృవనిశ్చయమున్న వ్యక్తికి ఈ మూడు విధాలైన వ్యక్తులూ సహాయకారులే అవుతారు.

          హిందువులు యజ్ఞయాగాదులలో చేసే జంతుహింసను నిరసించి దానిమీద పోరాడటం కోసం గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించి అహింసకు పెద్ద పీట వేశాడనీ అప్పటివరకు హిందువులకు అహింస అంటే ఏమిటో తెలియనే తెలియదనీ చెప్పేవారు వైదిక సాహిత్యమే అహింసకు ఎన్నో నిర్వచనాలను ఇచ్చి అహింసా పరమో ధర్మః అని కీర్తించిందనేది యెందుకు మర్చిపోతున్నారో!

          భక్తిమార్గంలో మానసిక పూజ అత్యంత ప్రధానమైనది.ఈ పూజలో అష్టభావనాసుమాలతో భగవానుని అర్చిస్తారు.ఆ అష్ట పుష్పాలు ఇవే:

శ్లో.        *అహింసా ప్రధమం పుష్పం,* *పుష్ప మింద్రియనిగ్రహః*
*సర్వభూతదయా పుష్పం*,
*క్షమా పుష్పం విశేషతః*
*శాంతి పుష్పం, తపః పుష్పం,* *ధ్యానపుష్పం తధైవచ*
*సత్య మష్ట విధం పుష్పం విష్ణోః* *ప్రీతికరం భవేత్!*

   ఇక్కడ అహింసను ప్రధమ పుష్పంగా కీర్తించడం  దాని ప్రాధాన్యతను చెప్పడం కోసమే కదా!అహింస యొక్క ప్రాముఖ్యతను ప్రజల దృష్టికి తెచ్చి జనులందరు దానిని పాటించునట్లు చేయుటకే ధర్మప్రచారం జరుగుతుందని వ్యాసభగవానుడు మహా భారతంలోని శాంతిపర్వంలో చెప్పాడు.

*సర్వే జనా సుజనో భవంతు*                                            *సర్వే సుజనా సుఖినో భవతు*

No comments:

Post a Comment