ప్రొటీన్లు కోసం మాంసమే తినాలా?
ఇంటర్నెట్ డెస్క్: ప్రొటీన్లు శరీరానికి అత్యవసరమైన సూక్ష్మ పోషకాలు. శరీర నిర్మాణంలో.. ముఖ్యంగా ఎముకలు, కండరాలు, కీళ్లను బలోపేతం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే, శరీరానికి సరిపడా ప్రోటీన్లు తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఎన్ని కిలోల బరువుంటారో అన్ని గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అవసరమవుతాయట. అయితే, ప్రోటీన్లు ఎక్కువగా మాంసాహారంలోనే లభిస్తాయి. దీంతో శాకాహారులకు తక్కువ మొత్తంలోనే ఇవి అందుతాయని చాలా మంది భావిస్తుంటారు. నిజమే.. గుడ్డు, మాంసాహారంలోనే ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. అయితే.. మాంసం తినని వాళ్లకు ప్రోటీన్లు కావాలంటే కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవేంటంటే..
గుమ్మడికాయ గింజలు: గుమ్మడి కాయల్లో ఉండే గింజల్లో.. గుడ్డులో ఉండే ప్రోటీన్ల కంటే ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ప్రతి 100 గ్రాముల గింజల్లో 19 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఉండేది కేవలం 13 గ్రాముల ప్రోటీన్లే.
శెనగలు/పచ్చి బఠాణీలు: సంప్రదాయ వంటకాల్లో శెనగలు/పచ్చి బఠాణీలను విరివిగా వాడుతుంటారు. వీటితో చోలె, కుల్చే, భటూర్, టిక్కా పరాటా, చాట్ ఇలా రకారకాల రుచులు చూడొచ్చు. ఉడకబెట్టిన శెనగలు, బఠాణీలకు మసాలా దట్టించి చేసే చిరుతిండ్లు దేశవ్యాప్తంగా ఫేమస్. వీటిలో మనిషికి కావాల్సిన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల శెనగల్లో 19 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.
పన్నీర్: శాకహారులు ఎక్కువగా ఇష్టపడే కూరల్లో పన్నీర్‌తో చేసేవి ముందువరుసలో ఉంటాయి. 100 గ్రాముల పన్నీర్లో 23 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి.. తరచూ పన్నీర్‌తో చేసిన వంటకాలు తినడం అలవాటు చేసుకుంటే మంచిది.
గ్రీక్ యోగర్ట్: సాధారణ యోగర్ట్‌లో కంటే.. ప్రత్యేకంగా లభించే గ్రీక్ యోగర్ట్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. చాలా మందికి భోజనం చివర్లో యోగర్ట్ వేసుకోనిదే తిన్నట్లు ఉండదు. దాన్ని అలాగే కొనసాగించాలి. ఒక కప్పు గ్రీక్ యోగర్ట్‌లో 23 గ్రాముల ప్రోటీన్లుంటాయి.
సోయాబీన్స్: ప్రోటీన్లు అధికంగా ఉండే మరో శాకాహారం సోయా బీన్స్. ఒక కప్పు సోయాబీన్స్‌లో అత్యధికంగా 29 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. సోయాబీన్స్ వంటకాలతో తినడమే కాదు.. సోయాపాలను తాగినా ప్రోటీన్లు అందుతాయి. ఇవే కావు.. బాదం, అరటిపండ్లలోనూ ప్రోటీన్లు మెండుగా ఉంటాయి.✍️
No comments:
Post a Comment