Wednesday, December 28, 2022

💎మౌనం 💎

 🌷🌷🌷🌷🌷

💎మౌనం 💎

                     దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.
                      గురువు మౌనం జ్ఞానానుగ్రహం.
                      జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.
                      భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.
ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు, మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.

💫⚜💫⚜💫⚜💫

మౌనమంటే -
                   నిరంతర భాషణ.
                   చింత, చింతన లేని తపస్సు.
                   అఖండ ఆనందపు ఆత్మస్థితి.
                   విషయ శూన్యావస్థ.
యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.
పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదుశాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహంవృత్తి ఏమాత్రం  ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు.

💫⚜💫⚜💫⚜💫

తనను తాను తెలుసుకుంటే, ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. తనని తాను, తాను తెలుసుకోక, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. ప్రవర్తన వినయంగా వుండేకొద్దీ మేలు అధికంగా, బహుముఖంగా వుంటుంది. దానికి సోమరితనం పనికిరాదు, కాలం వృధా చేయకూడదు, వర్తమానంలో జీవించాలి.

💫⚜💫⚜💫⚜💫

మౌనమే అనంత భాషణం.. అదే ఒక్కమాట.. అదే నిక్కమైన యిష్ఠాగోష్ఠి.. మౌనము నిరాటంకమైన విద్యుత్ ప్రవాహము వంటిది. కొన్ని వందల ఉపన్యాసాలు, గ్రంధాలు చేయలేని పనిని, జ్ఞాని కొన్ని క్షణాలలో మౌనం ద్వారా సాధకునిలో వివేకాన్ని నింపగలడు.

💫⚜💫⚜💫⚜💫

40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా వున్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.

🌷🌷🌷🌷🌷 

No comments:

Post a Comment