బాగా ధ్యానం చెయ్యడం మరి ప్రాపంచిక జీవితానికి సంబంధించి ఏమీ అడగకుండా ఉండడమే సరియైన జీవితం. సరియైన జీవితాన్ని జీవిస్తూంటే .. రావలసినవి అన్నీ వాటంతట అవే వస్తాయి.
“ధ్యానం” అన్నది ఒక ఆత్మవిజ్ఞానమహాశాస్త్రం! ఇంత గొప్ప శాస్త్రాన్ని నిరంతర ధ్యానప్రచారం ద్వారా ప్రపంచం అంతా తెలియజేసే బృహత్తర బాధ్యతను చేపట్టిన “పిరమిడ్ మాస్టర్స్” అందరూ “ఆత్మవిజ్ఞాన శాస్త్రవేత్తలు”!
గత అనేకానేక జన్మలుగా “శ్వాస మీద ధ్యాస” పెట్టి ధ్యానం చేసి చిత్తవృత్తులను నిరోధం చేసుకుని .. నాడీ మండలాన్ని శుద్ధి చేసుకుని .. దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుని తమ మీద తామే ప్రయోగాలు చేసుకున్న ఈ అనుభవజ్ఞానశాస్త్రజ్ఞులు .. ఇప్పుడు ఆ ఆత్మవిజ్ఞానాన్నంతా ఇతరులకు బోధించడానికే ఈ జన్మలో ఆ దివి నుంచి ఈ భువికి దిగివచ్చారు.
దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ “మనంకూడా దివి నుంచి భువికి దిగి వచ్చిన ఆత్మలం” అని తెలుసుకుంటారు. సుఖమయప్రాణాయామం ద్వారా మరి అభ్యాస వైరాగ్యాల ద్వారా సూక్ష్మంలో మోక్షాన్ని పొందుతారు.
ఇలా అభ్యాస వైరాగ్యాల ద్వారా గత అనేకానేక జన్మలుగా ఎంతెంతో ధ్యానసాధన చేసిన మాస్టర్లంతా ఒక్కొక్క జీవిత ప్రణాళికతో .. ప్రపంచంలోని ఒక్కొక్క ప్రాంతంలో పుట్టి తాము నేర్చుకున్న ఆత్మవిద్యను అందరికీ బోధిస్తూ ఆధ్యాత్మిక ఉద్యమాలను నిర్వహిస్తున్నారు.
తమ దివ్యచక్షువుతో ఉన్నత లోకాలను దర్శిస్తూ అక్కడి మాస్టర్లతో సజ్జనసాంగత్యం చేస్తూ తమ “జ్ఞానచక్షువు”ను ఉత్తేజితం చేసుకుంటారు. అప్పుడే వాళ్ళకు “యుక్త అవబోధ” కలిగి ఇతరులకు ఆత్మసత్యాలను సరిఅయిన విధంగా బోధించగలిగే అర్హత వస్తుంది.
సకల రాజరికపు సంపదలతో తులతూగుతూన్న బుద్ధుడు తన అంతర్వాణి ప్రబోధంతో సంపదలన్నీ వదిలివేసి .. ప్రపంచానికి దుఃఖ నివారణా మార్గం కనుగొనడానికి బయలుదేరాడు. ఆనాపానసతి ధ్యానసాధన చేసి తన దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుని .. తన గతజన్మ పరంపరను చూసుకుని .. కర్మసిద్ధాంతాన్ని అవగతం చేసుకుని “బుద్ధుడు” అయ్యాడు.
“బుద్ధుడి”గా అయిన తక్షణమే అతడు తాను కనుక్కున్న సత్యాన్ని అందరికీ తెలియజేయడం మొదలుపెట్టాడు. మరి తన వాక్కును అద్భుతంగా వినియోగించుకుంటూ లోకోద్ధరణకు నడుము కట్టాడు.
అందుకే మనస్సును నిగ్రహించుకుని సత్యదర్శనం చేసిన ఒకానొక ధ్యానయోగి మాటకే అంతటి విలువ వస్తుంది కనుక “అర్జునా! నువ్వు ధ్యానయోగివికా నాయనా!” అని సూచించాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో! అందుకు అర్జునుడు
*“చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవద్ధృడమ్*
*తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్”*
(భ.గీ.6-34)
“ఈ మనస్సు చాలా చంచలమైంది. బాగా ప్రమాద స్వభావం కల్గినదీ, దృఢమైనదీ మరి ఎంతో బలమైంది. దీనిని నిగ్రహించడం అంటే గాలిని ఆపడంలా ఎంతో దుష్కరం” అని వాపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ..
*“అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్*
*అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చగృహ్యతే”*
(భ.గీ.6-35)
“నిస్సందేహంగా మనస్సు చంచలమైందే మరి దానిని వశపరచుకోవడం చాలా కష్టం! కానీ కౌంతేయా! .. అభ్యాస వైరాగ్యాల ద్వారా దానిని వశపరచుకోవడం సాధ్యమే! అని తెలియజేశాడు శ్రీకృష్ణుడు. “అభ్యాసం” + “వైరాగ్యం” ..
రోజులో కాస్సేపు చర్మచక్షువులను మూసేసుకుని కర్మేంద్రియ చాపల్యాలన్నింటినీ లోపలికి ముడుచుకుని .. కూర్చోవడాన్ని “వైరాగ్యం” అంటాం! మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యడాన్ని “అభ్యాసం” అంటాం. ఇలా అభ్యాస వైరాగ్యాల ద్వారా ఇంద్రియాలతో కూడిన మనస్సును అదుపులో ఉంచుకున్న వారే మహేంద్రులు. వారి దగ్గరికే అక్షయపాత్ర .. కామధేనువు .. కల్పవృక్షం .. చింతామణి .. వజ్రాయుధం .. ఐరావతం.. ఇలాంటివి అన్నీ వచ్చి చేరుతాయి.
కాబట్టి మనస్సు పట్ల జాగ్రత్త! మాట పట్ల జాగ్రత్త! మరి చేసే కర్మల పట్ల జాగ్రత్త వహించాలి! వారికే మాట శాంతంగా ఉంటుంది .. మనస్సు శాంతంగా ఉంటుంది .. మరి వారు చేసే కర్మలు ప్రశాంతంగా ఉంటాయి! ఇలా ప్రజలు అందరూ యోగులుగా మారితే భూలోకం అంతా కూడా శాంతిమయం అవుతుంది.
*భగవద్గీత కు జేజేలు! వేదవ్యాసుల వారికి సహస్రకోటి ప్రణామాలు!!*
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment