Saturday, December 24, 2022

రామో విగ్రహవాన్ ధర్మః

 241222i1752.    251222-5. 
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


          *రామో విగ్రహవాన్ ధర్మః*
                  ➖➖➖✍️

*మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది.*

*ఈ రోజుల్లోనే, రామ కథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం.*

*రాముడిని దేవుడిగా కొలవడం ముమ్మాటికీ తప్పు కాదు. కానీ రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే, రాముడి జీవితం నుంచి మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం.*

*తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో చేర్చి వదిలించుకొనే ప్రయత్నాలు చేయడం, ఆస్తిపాస్తుల కోసం అవసరమైతే తల్లిదండ్రులనూ, సోదరులనూ తుదముట్టించడానికి వెనుకాడని నేటి యువత రాముని పితృప్రేమ నుంచీ, సోదర ప్రేమ నుంచీ ఎన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి?*

*వికృత, అసహజ సంబంధాలు అనే భూతం జడలు విప్పి నృత్యం చేస్తున్న                     ఈ రోజుల్లో రాముని ధర్మబద్ధమైన వైవాహిక జీవిత నిష్ఠ, ఏక పత్నీవ్రత నియమం, సుందరాంగి తనంత తాను వలచి వచ్చి వారించినా కన్నెత్తై చూడని నిగ్రహ సంపత్తీ నేటి యువతరానికి మార్గదర్శకాలు.*

*రామకథ ఈనాటి సమాజానికి కూడా గురుస్థానంలో నిలుపుకోవలసిన మహాకావ్యమే, రాముడు నేటికీ మనకు మార్గదర్శకుడే. నాటికీ నేటికీ ఏనాటికీ రాముని శీలసంపద, గుణసంపత్తి, అగాధమైన అమృతసాగరం.*

*సర్వకాలాలకూ, సర్వదేశాలకూ ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం.*

*జన్మతః రాక్షసుడైనా రామబాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు రాముని వ్యక్తిత్వాన్నీ, దివ్యత్వాన్నీ సంపూర్ణంగా అవగాహన చేసుకొన్న ధన్య జీవి.*


* ‘రామో విగ్రహవాన్ ధర్మః’.* 

*మూర్తీభవించిన ధర్మమే రాముడు. ఈ ఒక్క వాక్యం శ్రీరాముని పరిపూర్ణమైన మానవత్వానికీ, దివ్యత్వానికీ దర్పణం పడుతుంది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment