Friday, January 6, 2023

శ్రీ రమణాయ అధ్యాయము 16 ఆణిముత్యాలు - -1 ( ఆచారాలు )

 భగవాన్ రమణ మహర్షి నిత్య పారాయణం
 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 
అధ్యాయము 16
ఆణిముత్యాలు - -1 ( ఆచారాలు ) 
       భగవాన్ వారి యొక్క లీలలు అనంతముగా దేశమంతటా వ్యాపించి ఎందరో భక్తులు భగవాన్ దర్శనానికి విదేశీయులతో సహా వచ్చి పోతుండేవారు . వారు ఎన్నో గొప్ప విషయాలు మరియు ఆత్మ సాక్షాత్కారము గురించి భగవాన్ దివ్యమైన ఆత్మబోధలను ఎన్నో చేశారు . నిజానికి భగవాన్ గురించి వ్రాయటమంటే ఏమి వ్రాయగలం . వారు చెప్పిన బోధలు సముద్రమంత వైశాల్యము కలిగి మరియు సముద్రమంత లోతులో ఉండేటటువంటి బోధలు ఎన్నెన్నో కలవు . అన్నీ వ్రాయుటకు కష్టం . ఎందుకంటే వారు చెప్పిన ప్రతి మాటలో అంతరార్ధం దాగియున్నది . అన్ని ఏరి పట్టుకుని వ్రాయటం అంటే నా బోటి వారికి ఎంతో కష్టసాధ్యమైనది . భగవాన్ ని అనన్యశరణాగతి కోరి సముద్రమువంటి వారి బోధలలో కొన్ని ఆణిముత్యాలను స్వీకరించి తెలియపరుచున్నాము . ఇకనుంచి వచ్చే ప్రతి అధ్యాయము ఆణిముత్యములుగా పరిగణింపబడినది . 

         భగవాన్ వారి తల్లి నిర్యాణము చెందిన పిదప వెంటనే లేచి వచ్చి అందరితో భోజనం చేసినారు అని చెప్పుట జరిగినది . భగవానకు ఎటువంటి మైల , ఆచారాలు , పట్టింపులు చూపేవారు కాదు . వారి వద్ద వచ్చిన భక్తులను వారికున్న ఆచారలనే బంధాన్ని తప్పించుటకు భగవాన్ ప్రయత్నించేవారు . పైగా భగవాన్ ఎల్లప్పుడు “ ఏదీ వద్దు . నిశ్చలముగా కూర్చో అదే సరైనది . ఏ యాత్రా అవసరము లేదు . ఈ అరుణాచలమే కాశీ , హిమాచలం " అని అనేవారు . మురుగనార్ తల్లి ఆబ్దికము రోజున ఒక పెద్ద పనసకాయను తెచ్చి ఆశ్రమములో ఉన్నవారి అందరికి పంచి పెట్టుచుండెను . అదే సమయమున భగవాన్ అక్కడకు వచ్చి “ ఈ మమకారాలు ఇంకా పోలేదన్నమాట " అని అన్నారు . భగవాన్ మరియు ఇట్లనెను , “ క్రతువులు కూడా మనిషికి బంధాలే ” ఇది వినటానికి సంశయముగా ఉన్నప్పటికి భగవాన్ చెప్పినది అక్షర సత్యం . మనిషి జీవించి ఉండగనే ముక్తి పొందవలెను . వారే జీవన్ముక్తులు . దానికి మనిషి బంధాలను తెంచుకోవటమే మార్గము . *ఏ బంధము లేనివాడు జీవన్ముక్తుడే* . కర్మాణుగుణముగా కర్తవ్యానుసారముగా మనిషి తల్లి , తండ్రి , భర్త , భార్య పుత్రులు ఈ విధమైన సంబంధం మన శరీరానికి మాత్రమే పెట్టుకున్న బంధాలే తప్పలోన ఆత్మకుకాదు . భగవాన్ మురుగనాద్ గారి తల్లి ఆబ్దికము రోజున పనసకాయ పంచుట చూచి మమకారము ఇంకా వీడలేదని గ్రహించిన భగవాన్ తన భక్తునికి సూచన నిచ్చినారు . చివరికి క్రతువులు చేసినను అవి బంధాలే అవుతాయని నిర్ధారించినారు .

      సుందరేశయ్యర్ అనునతడు భగవాన్ భక్తుడు . వీరి విషయములో కూడా ఒకసారి వారి తండ్రి గారికి తర్పణము వదలాలనే ఉద్దేశ్యముతో ఆ తర్పణము చేసే రోజున ఏ ఫలహారము తీసికొనక కార్య నిమగ్నులైయున్నారు . అది గమనించిన భగవాన్ తన భక్తుడిని ఫలహారము చేసినంత మాత్రమున వారికి ఏ హాని జరుగదని భగవాన్ హామీ ఇచ్చినారు . సంపూర్ణమ్మ అనే భక్తురాలు అరుణాచలంలో రమణాశ్రమమున కొన్ని రోజులు వంటపని చేసినారు . ఆశ్రమములో ఆడవారు బైట ఉన్న సమయమున ఆశ్రమ భోజనము చేయరు . ఎక్కడో వేరేచోట ఏర్పాటు చేసేవారు . ఒకసారి సంపూర్ణమ్మ బైట ఉన్న సమయమున ఆమెకు భోజనము ఎక్కడా ఏర్పాటు కాలేదు . కావున ముష్టివారు ఉన్న మంటపములో కూర్చుని ఉన్నది . భగవాన్ ఆరోజు సంపూర్ణమ్మ ఏది అని అడిగినారు . జరిగినది భగవానుకు చెప్పగా భగవాన్ ఆమెకు భోజనము పెట్టండని ఆజ్ఞాపించినారు . ఆశ్రమములోని వారు భోజనమును మంటపమునకు తీసుకుపోయి పెట్టెదమని భగవానుని వేడగా అందుకు భగవాన్ కోపించి “ ఏం కర్మం ఆమెను రమ్మనండి . బైట ఉంటేనేం అంతా బ్రహ్మం . ముట్టేమిటి . ఇక్కడికి రమ్మనండి అని భగవాన్ ఆజ్ఞాపించినారు . భగవాన్ స్కందాశ్రమములో ఉన్నప్పుడు కూడా ఆ ఆశ్రమమునకు కట్టెలు తెచ్చేవానికి భోజనము పెట్టమని తల్లికి చెప్పేవారు . భగవాన్ తల్లిమడి ఆచారము ఉన్నను భగవాన్ ఏ మనిషిలోను తారతమ్యాలు చూసేవారు కాదు . అలాగే రంగన్న అనే భక్తుడు తన తండ్రికి తర్పణం విడవడానికి ఊరికి వెళతానంటే భగవాన్ ఒక గ్రూపు ఫోటోలో ఉన్న అతని తండ్రిని చూపి నీ తండ్రి ఇక్కడే ఉన్నారు " అని అన్నారు . 

     ఒకసారి ఆశ్రమం వంటింట్లో పనిచేసే ఒక ఆడమనిషి బైట ఉన్నదని ఆమెకు ఫలహారం వేరుగా చేసి ఇవ్వబోగా అది గ్రహించిన భగవాన్ “ అదేమిటి ? బైట ఉంటే మైలా ఏ మైల ఎందుకు మైల . అట్లా భేదం చూపకండి " అని అన్నారు .

 భగవాన్ పై చెప్పిన పలుకులు ఆణిముత్యాలు వారి బోధనలో ఎన్నో రహస్యాలు ప్రకాశించి ధైర్యశక్తిని కలుగచేయును . అయితే వాటిని దృఢముగా నమ్ముకుని విశ్వసించి భగవాన్ చెప్పిన ప్రతిమాటలో గూఢార్ధమును గ్రహించి శరీరము అనేమాట మరచి ఆత్మ అనేమాట ఎల్లప్పుడు తలచి ఉన్నవారికి ఎటువంటి బంధములు , క్రతువులు , ఆచారములు , మైల మడి అనునటువంటివి ఏమీ ఉండవు . ఆ దృఢమైన నమ్మకాన్ని , విశ్వాసాన్ని , ధైర్యాన్ని మనకు కూడా కలుగవలెనని భగవాన్ శ్రీ రమణ మహర్షిని శరణువేడుదాం . రమణా ! నీవే మాకు శరణాగతి . 

అరుణాచల శివ. 

No comments:

Post a Comment