అరుణాచల వైభవం 🙏
19 వ భాగం
జ్ఞాన, ఆధ్యాత్మిక సుగంధములను విరివిగా వెదజల్లి, సమస్త ప్రపంచముచే నమస్కరింపబడి, సద్గురువుగా నిలిచిన భగవాన్ శ్రీ రమణ మహర్షి తమ డభయ్యవ యేట శరీరము విడిచిరి. అంతకు పూర్వము రెండు, మూడు సంవత్సరముల ముందు ఆయన యొక్క ఎడమ చేతిపై ఒక రాక్షస పుండు పుట్టెను. వైద్యులు రెండు మార్లు శస్త్రచికిత్స చేసిననూ ఫలితము కలుగలేదు. ఆ శస్త్రచికిత్సల సమయము నందు మహర్షి కనీసము మత్తుమందు సైతం తీసుకొనలేదు. శస్త్రచికిత్స సందర్భమున ఆ పుండును కోసి వేయు సమయమున కలుగు నొప్పి సామాన్యముగా యుండదు. కానీ రమణులు అలాగే శస్త్రచికిత్స చేసుకొనిరి. నొప్పి అన్న మాట కూడా అనలేదు. అయితే వారికి నొప్పి యుండదా అన్న సందేహము కలుగును. ఖచ్చితముగా నొప్పి యుండును. అది శరీరతత్వము. కానీ సామాన్యులు ఆ నొప్పితో తాదాత్మత చెందును. కానీ రమణులు శరీరమునకు కలిగే నొప్పిని సాక్షిగా చూసెడివారు. రాక్షస పుండు యున్న సమయమున "నొప్పిగా ఉంది" అన్న మాట సైతం అనలేదు. పైగా "శరీరమే ఒక పుండు. ఈ పుండు పై మరొక పుండు పుట్టెను" అనేడి వారు. ఆ పరిస్థితినందు కూడా సాక్షిగా నిలబడి శరీరముతో నిస్సంగీగా యుండెడివారు. శ్రీరమణుల ఆరోగ్యము కుదుటపడవలెనని పరిపరి విధములుగా భగవంతుని ప్రార్థించిన అనుచరగణం చివరిలో వారి శరీరము అనుభవిస్తున్న ఖేదము కనలేక ఇక నిష్క్రమించమని వేడుకొనిరి. వారి ప్రార్థనను మన్నించి భగవాన్ శ్రీ రమణ మహర్షి 1950వ సంవత్సరమున ఏప్రిల్ 14వ తారీఖున సాయంసంధ్య సమయము దాటిన అనంతరం, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన "అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల" యన్న అరుణాచల అక్షరమణిమాల వినబడుచుండగా, కళ్ళ యందు ఆనందభాష్పములు నిండగా, ఒక చిన్న గుడారము నందు ఒక పెద్ద ఏనుగు ఇమడలేక ఆ గుడారము చీల్చుకొని బయటపడునట్లుగా అనంతమై, సర్వవ్యాపకమైన ఆత్మ ఒక చిన్న శరీరము నందు యుండుటకు ఇష్టపడక యుండునట్లుగా, భగవాన్ శ్రీ రమణ మహర్షి లోని ఆత్మజ్యోతి శరీరమును విడిచిపెట్టెను. అదే సమయమున ఆయన నిర్యాణము జరిగిన గది పైన ఆకాశము నందు ఒక దేదీప్యమైన జ్యోతి దర్శనమిచ్చి యావత్ భారతదేశం చూస్తుండగా ఉత్తర దిశ వైపు పయనించి అరుణగిరి యందు కలిసిపోయెను. ప్రపంచమునకు జ్ఞానజ్యోతిని, ఆత్మజ్యోతి తత్వమును అందించిన ఆ మహాయోగి నిష్క్రమణతో ఒక శకము ముగిసిపోయెను.
ఈనాడు మనము దర్శించెడి "శ్రీరమణాశ్రమము" అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గమున, అగ్ని లింగము దాటిన అనంతరము, కుడి ప్రక్కగా యున్నది. ఆశ్రమ ప్రవేశము చేసినంతనే కుడి ప్రక్కగా మొదట పుస్తకాలయము, కార్యాలయము, రమణులు నిర్యాణము చెందిన గాడి యున్నవి. ఎడమ ప్రక్కగా తల్లి శ్రీ అళఘమ్మ గారి అధిష్టానమైన "శ్రీ మాతృభూతేశ్వరాలయము" దానిని ఆనుకొని రమణుల అధిష్టానము, దానిపై ప్రతిష్ట చేయబడ్డ "శ్రీరమణేశ్వర" లింగము దర్శనమిచ్చును. అవి దాటినా అనంతరం శ్రీరమణబావి, రమణులు దర్శనమిచ్చిన గది, భోజనాలయము, మహర్షి మోక్షము అనుగ్రహించిన గోలక్ష్మి మొదలైన మూగజీవుల సమాధులు యున్నవి. వాటి తర్వాత గిరిపైకి స్కందాశ్రమమునకు వెళ్ళు మార్గము యున్నవి. నేటికీ కూడా "శ్రీరమణేశ్వర" లింగము వద్ద కూర్చుని సాధన చేయు ఉపాసకులకు రమణులు చైతన్య రూపముగా తోడ్పడుచుండెను.
భగవాన్ శ్రీ రమణ మహర్షి తమ జీవితము నందు చేసిన బోధలలోని సారాంశము యొక్కటే. అదే "నీవెవరో తెలుసుకో". ఒక జీవునకు తనను తాను తెలుసుకొనుటకు బుద్ధివికసనము, ఏకాగ్రత ఏంతో అవసరం. దానికి మహర్షి చెప్పిన మార్గము, "అరుణాచల గిరి ప్రదక్షిణము". ఎన్నో రోజులు ధ్యానము చేసినా కుదరని ఏకాగ్రత అరుణగిరి ప్రదక్షిణ వలన కలుగునని చెప్పెడివారు. రమణులు యాభై సంవత్సరముల వయస్సు వచ్చు వరకు తరచుగా గిరి ప్రదక్షిణ చేసెడివారు. నిజమునకు రమణుల దృష్ఠి యందు ఆత్మకు, భగవంతునకు, అరుణాచలమునకు బేధము లేదు. ప్రతీవారు తమని తాము వేసుకొనవలసిన ప్రశ్న "నేనెవరు?". ఈ ప్రశ్న వేసుకొన్న అనంతరము ఇక ఏ ప్రశ్న వేసుకొనవలసిన అవసరము లేదు. భగవాన్ శ్రీ రమణ మహర్షి సందేశము యొక్కటే. "ఓ జీవుడా. నీ సహజస్థితిలో ఉండి నీవెవరో తెలుసుకో. నీలోన "నేను" అనేడిది ఏమిటో తెలుసుకో. ఈ అన్వేషణకు మనస్సు యందు ఉండేటి అహంకారము మరియు ఇతర వికారములు విడనాడవలెనని తెలుసుకో. ఆ "నేను" ను అన్వేషించుటయే ధ్యానమని, తపస్సుయని తెలుసుకో. ఆ అన్వేషణ ద్వారా నీవే ఆత్మవని తెలుసుకో, ఆ ఆత్మ సర్వత్రా నిండి యున్నదని (విష్ణుస్వరూపముగా) తెలుసుకో, ఆ ఆత్మయే సర్వకాలముల యందు నిలిచియున్నదని (శివస్వరూపపముగా) తెలుసుకో. ఆత్మను తెలుసుకొని, ఆత్మగా నిలబడుటయే ఆత్మ సాక్షాత్కారమని తెలుసుకో. ఆ ఆత్మయే సకల జీవరాశి యందు యున్నదని తెలుసుకో. సమస్త జగత్తు ఆ ఆత్మ యందే జన్మించి, ఆ ఆత్మ శక్తి వల్లనే నడుచుచున్నదని తెలుసుకో. ఆ ఆత్మయే పరమాత్మ యని తెలుసుకో. నీతో బాటు సకల జీవుల యందు ఉన్నది ఒక్కటే పరమాత్మ తత్వమని (అద్వైతము) తెలుసుకో".
భారతదేశము నందు జన్మించి, భగవాన్ రమణ మహర్షి నడయాడిన నేలపై నడిచి, వేదము చెప్పిన ఆత్మస్వరూపమును దర్శించి, తరించి, తరింపచేయుచున్న ఆ బ్రహ్మజ్ఞాని చూపిన మార్గము నందు నడుస్తూ, వారి బోధలను అనుక్షణము జ్ఞప్తికి యుంచుకొని, ఆచరించి, జీవించుటయే ఆ మహాయోగికి మనమిచ్చు సరైన నివాళి.
ఓం శ్రీ రమణేశ్వరాయ నమః
శ్రీ రమణార్పణమస్తు
అరుణాచల వైభవం సంపూర్ణం
సేకరణ రాధ 🙏
No comments:
Post a Comment