“త్రుటి’లో తప్పిన ప్రమాదం’ అంటాం. ఏమిటీ త్రుటి?‘
అంతా కాలమహిమ’ అని తేల్చేస్తాం. ఏమా మహిమ? ‘కాలం కలిసివచ్చింద’ని సంబరపడతాం. కలిసివచ్చేదేంటి? ఒకే కాలం.. ఎన్నో ప్రమాణాలు. అదే కాలం.. మరెన్నో ప్రయాణాలు. మహాకాలుడి కేశపాశాలే కాలజాలం అని వేదాలు పేర్కొన్నాయి. కాలచక్రంలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈ సమయంలో కాలం కథను పరికిద్దాం.
‘కాలం అనంతం’ అనే మాట సర్వత్రా వినిపిస్తూనే ఉంటుంది. అంతం లేనిది అనంతం. అంతం లేనిదైతే దానికి ఆది కూడా ఉండకూడదు. ఆద్యంతాలు లేనివాడు పరమాత్మ ఒక్కడే. పరమాత్మ కాలస్వరూపుడని రుషులు పేర్కొన్నారు. మృత్యువును శాసించే యమధర్మరాజును ‘కాలుడు’ అని పేర్కొన్నారు. సృష్టి, స్థితి, లయములను శాసించే పరమశివుడికి మహాకాలుడు అని పేరు. పరమాత్మ ఏకకాలంలో సర్వవ్యాపి, నిశ్చలుడు. మార్పులేనివాడు. మార్పులకు లోనుకాని వాడు. అవాఙ్మానస గోచరుడు. అంటే వాక్కుకు, మనసుకు అందనివాడు.
రాత్రింబవళ్ల వల్ల కాలం మనకు తెలుస్తున్నది. కాలంలోని మార్పులు రుతువుల కారణంగా అనుభవంలోకి వస్తున్నాయి. అహోరాత్రులకు ఆద్యంతమున్నది. ప్రకృతిలోని షడ్వికారాలు కాలగమన సూచికలే! కాలం గమిస్తున్నది. మార్పులకు లోనవుతున్నది. తత్కాల ఆద్యంతాలు స్పష్టమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాలం పరమాత్మ స్వరూపమని నమ్మడం ఎలా? కాల గమనం ఆభాస (పైకి కనబడుతూ లోపల లేకపోవడం). భూమిపై ఉన్న వారికి సూర్యోదయ, అస్తమయాలు ఉన్నాయి. రాత్రింబవళ్లు ఉన్నాయి. అంతరిక్షంలో కాలం నిశ్చలం. ఖగోళాలకు ఉన్న చలనాన్ని వెలుగునీడల ఆధారంతో లెక్కిస్తున్నాం. కాబట్టి కాలానికి చలనం ఉన్నట్లు భావిస్తున్నాం. చలనం అంతరిక్షంలో ఉన్న గోళాలది కానీ, కాలానిది కాదు. భూమిపైన నివసిస్తున్న మనం భూ గమనాన్ని అంతరిక్షంలోని జ్యోతిస్సులతో పోల్చి లెక్కగడుతున్నాం. మిక్కిలి వాడిగల సూదితో తామరాకు మీద బెజ్జాన్ని చేయడానికి పట్టే సమయాన్ని ‘త్రుటి’ అంటారు. వేయి మహాయుగాల కాలాన్ని కల్పం అంటారు.
ఈ రెండిటి మధ్య అనేక రకాలైన విభజనలతో కూడిన కాల ప్రమాణాలకు వివిధ పేర్లున్నాయి.
భారతీయుల కాలగణన సూత్రం వర్తులాకారంతో ఉంటుంది కాబట్టి, కాలానికి ఆద్యంతాలు లేవు. అహోరాత్రాలు ఒక వర్తులం. శుక్ల, కృష్ణ పక్షాలతో కూడిన మాసం మరో వర్తులం. ఆరు రుతువులతో లేదా పన్నెండు సంక్రాంతులతో కూడిన ద్వాదశాదిత్య చక్రం ఇంకొకటి. పన్నెండు రాశుల ‘భ చక్ర’ గమన వర్తులం మరొకటి. ఇలా కాలచక్రాలు అనంతాలు.
వ్యోమం అంటే ఆకాశమని, అంతరిక్షమని అర్థాలు. మహాకాలుడైన పరమశివుడికి వ్యోమకేశుడు అని పేరున్నది. అంతరిక్షాన్ని కేశాలుగా కలిగిన వాడని అర్థం. అంతరిక్షం శూన్యం కాదు. శిరోజాలను పోలిన సన్నని కణ సముదాయాల వరుసలు అనేకాలు అంతరిక్షం అంతటా పరచుకొని ఉన్నాయి. ఏ వెంట్రుకలోని సమాచార ప్రసారం ఆ వెంట్రుకకే పరిమితం, మరొక వెంట్రుకలోకి అది చొరబడలేదు. ఈ విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొనే కృత్రిమ ఉపగ్రహాల సాయంతో ఆధునిక సమాచార వ్యవస్థ ప్రకృతిని శాసించే స్థాయికి చేరుకోగలిగింది. ఇంతటి విజ్ఞాన ఖనిని వేదం ‘వ్యోమకేశ’ నామంతో సరిపెట్టిందన్న విషయాన్ని భారతీయులు గుర్తించవలసి ఉన్నది.
సేకరణ మీరామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment