Friday, January 6, 2023

మనసు ఘర్షణకు లోనుకాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి ? చేస్తున్న పనికి, సంబంధంలేని ఆలోచనలు వచ్చి చికాకు కలిగిస్తుంటే ఎలా ?

 *"శ్రీరమణీయం"* 
 

*"మనసు ఘర్షణకు లోనుకాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి ?"*

*"అవసరంలేని ఆలోచనలతోనే మనకు అశాంతి వస్తుంది. మన నిత్యజీవితం అంతా అనేక పనులతో ముడిపడి ఉంది. ఎవరు ఏ పని చేయాలన్నా అందుకు ఆలోచన అవసరం అవుతుంది. మనం ప్రస్తుతం చేయాల్సిన పనికి అవసరంలేని ఆలోచనలు మనసును కమ్ముకొని అశాంతికి కారణం అవుతుంటాయి. జరుగవలసిన పనికి అవసరమైన ఆలోచన మాత్రమే ఉంటే మనసు ఒత్తిడి లేకుండా ఉంటుంది. అప్పుడు ఏ ఘర్షణలేని ప్రశాంత స్థితిలో మనసు ఉంటుంది. ఒకే ఆలోచనలో ఉన్న మనసు ఏ ఘర్షణ లేకుండా ఉంటుంది. కనుక అలాంటి మానసిక స్థితిని ప్రసాదించే ఆధ్యాత్మిక చింతనను మనం ఇష్టపడుతున్నాం. ఇతర ఆలోచనలు లేకుండా భగవంతునిపై ఉంచిన మనసు ప్రశాంతతను పొందుతుంది. అలాగే కర్తవ్య నిర్వహణలో ఇతర ఆలోచనలు లేకపోయినా మనసుకు అదే ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంత స్థితిని ఎల్లప్పుడూ కొనసాగించటమే దివ్యజీవనం !"*

*"చేస్తున్న పనికి, సంబంధంలేని ఆలోచనలు వచ్చి చికాకు కలిగిస్తుంటే ఎలా ?"*

*"మనం ఏ పనిలో ఉంటే మనసు కూడా ఆ పనిలోనే నిలిపి ఉంచటం ధ్యానంతో సమానం అవుతుంది. కానీ మన ప్రస్తుత మానసిక స్థితి అలా లేదు. అందువల్ల ఎంతో ఒత్తిడి, ఆందోళన, అశాంతి మనసును ఆవరిస్తున్నాయి. అప్పటి పనులకు అవసరంలేని ప్రతి ఆలోచన మనసుకు భారమవుతుంది. ఒక గంట సమయం కేటాయించి మనకు వచ్చే ఆలోచనలన్నీ ఒక కాగితంపై వ్రాయగలిగితే రోజులో మనం ఎన్ని పనికిరాని (అప్పటికి అవసరంలేని) ఆలోచనలు చేస్తున్నామో తెలుస్తుంది. రెండు ఆలోచనల మధ్య అడకత్తెరలో పోకచెక్క చందాన మనసు కూడా నలుగుతోంది. ఒక పని జరుగుతూ ఉండగా అప్పటికే మనసు ఆ పనికి సంబంధించిన ఆలోచనతో ఉంటుంది. అప్పుడే మనసుకు మరో ఆలోచన గుర్తుకు రావటం వలన ఘర్షణ మొదలై శాంతి దూరమవుతుంది. అవగాహనతో అనవసర ఆలోచనలను విరమించుకుంటేనే పురోగతి ఉంటుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

No comments:

Post a Comment