*భావోద్వేగాలు*
ప్రతి మనిషినీ ఏదో సమస్య బాధిస్తూనే ఉంటుంది. ఆకలి బాధ, తిన్నది అరక్క బాధ, చదువురాని బాధ, చదివినా ఉద్యోగం దొరకని బాధ... పెళ్ళి కాలేదని బాధ, తరవాత సంతానం కలగలేదని బాధ, రోగం వస్తే బాధ, ఆర్జన ఎక్కువైతే ఎలా? దాచుకోవాలన్న బాద... పదవి రాలేదని బాధ, వచ్చాక ఎలా నిలుపుకోవాలన్న బాధ, కీర్తి రాకపోతే బాధ, వచ్చాక భజనపరులు చుట్టూ లేదన్న బాధ, శ్రమకు తగ్గ ఆదాయం, విశ్రాంతి లేవన్న బాద... మనసులోని స్వచ్ఛమైన ఆలోచనలను ఈ బాదలు, వ్యధలు ఆక్రమించి ఒత్తిడిని పెంచేస్తాయి. ఈ ఒత్తిడిని భరించలేనివాళ్లు ఒంటరిగా ఆత్మన్యూనతా భావంతో తమలో తామే కుంగిపోతుంటారు. కుమిలిపోతుంటారు. కొందరు మత్తు పదార్థాలకు బానిసలైపోతారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడతారు.
లౌకిక వాంఛలు పెరిగి అవి తీరకపోతే, కామక్రోధాలు పెచ్చరిల్లి మనిషిని పశువుగా మార్చేస్తాయి. మెదడులోని బుద్ధి... బుద్ధిచెబుతున్నప్పుడు మనసు వినాలి. పట్టించుకోవాలి. లేకపోతే విశృంఖలత్వానికి దాసోహమై ప్రవర్తన పెడదారి పడుతుంది. అవసరాన్ని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అర్ధంలేని ఆలోచనలతో
మనసును నింపుకొన్నప్పుడు ఒత్తిడి తీవ్రమవుతుంది. చిన్న చిన్న విషయాలను గురించి ఆలోచించి, ప్రాధాన్యాంశాలను మనసులో పక్కకు పెట్టేస్తే మనిషి విచక్షణ కోల్పోతాడు. తాను చెయ్యగలదాన్ని గురించే ఆలోచించాలి. తన అధీనంలో లేని దాని గురించి ఆశించడం వల్ల మనిషి భావోద్వేగానికి గురవుతాడు.
ఒక చెంబును నీటితో నింపారు ఇంకాఇంకా పోస్తుంటే పార్లి కింద పడిపోతుంది. బిందెలో ఎంత చోటు ఉంటే అంతే నీరు పడుతుంది అదే. విధంగా, ఏ వస్తువు లేదా విషయం. గురించి ఎంత ఆలోచించవలసిన అవసరం ఉంటుందో, ఎంత కాలం ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. హద్దు మీరితే ఒత్తిడి పెరిగిపోతుంది.
అవరోధం ఏర్పడినప్పుడు నిరాశకు గురికావడం సహజం, సాఫల్యం కోసం ప్రత్యామ్నాయం ఆలోచించడం ధీరుడి లక్షణం. ఎన్ని ఉలిదెబ్బలు తింటే శిల శిల్పమవుతుంది.. పెరుగు నెంత సేపు చిలికితే వెన్న వస్తుంది? ఎన్ని తుపానులను తట్టుకుంటే చెట్టు ఫలాలిస్తోంది. నాగలితో నేలను చీలిస్తేగాని నవధాన్యాలివ్వదు. గునపంతో తవ్వితే గాని ఖనిజాలివ్వదు. వీటినుంచి సహనం నేర్చుకోవాలి. ఎంత నీరు పోసినా, ఎరువు వేసినా రుతువు రానిదే మొక్క పుష్పించదు, ఫలించదు. ధ్యానం, మౌనం, యోగా, వ్యాయామం, ఆధ్యాత్మిక చింతన, సద్ధంగ పఠనం, సత్సాంగత్యం... మనిషిని ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉంచగలిగే ఉత్తమ సాధనాలు,
లంకలో సీతాన్వేషణ చేసిన హనుమ నిరాశా నిస్పృహలకు లోనై, ఒక్క క్షణం బలహీనుడై ఆత్మహత్యకు సంకల్పించాడు. స్థితప్రజ్ఞుడు కనుక మళ్ళీ తేరుకుని, ముందుకు సాగి విజయం సాధించాడు. వరదకు తలవంచిన గరిక, ఆది తగ్గాక తల ఎత్తడంలేదూ! ఒత్తిడి అనేది నీటిమీది నాచులాంటిది ఓర్పుతో నాచును తొలగిస్తే శాంతి అనే శుద్ధజలం చూడగలం. సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన' అన్న సినారె పలుకులు గుర్తుంచుకుంటే మనసు ఏ భావోద్వేగాలకు బలి కాదు.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment