🌷 అంతరాలోచన🌷
✳️ నేను లేనే లేను... అని భావన చేయి, లేదా
✳️ ఉన్న సమస్తము నేనే... అని భావన చేయి
ఆత్మనిష్ఠకు ఈ రెండే ఉత్తమ ఉపాయాలు.
జరిగేది జరుగుతుంది; జరుగనిది జరుగదు.
అని స్థిమిత పడినవానికి దేవునితో కూడా పని లేదు.
బావిలో పడిన వస్తువును తేవడానికై ఈతగాడు ముక్కును (శ్వాసను), నోటిని (మాటను) బంధించి, నీట మునిగి ఆ వస్తువును గ్రహిస్తాడు.
అలాగే ముముక్షువు తన హృదయంలో నెలకొని ఉన్న ఆత్మ కై శ్వాసను, వాక్కును బంధించి ఆత్మను సంగ్రహిస్తాడు.
ఏది ఉందో, ఏది లేదో చెప్పేది - సత్యం.
ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెప్పేది - ధర్మం.
ఒకరు:- అందరూ సమానం ఎలా?
సద్గురు:- భౌతికపరంగా అందరమూ మరణిస్తాము.
ఆత్మపరంగా అందరమూ శాశ్వతులము.
జీవితం..
అభినయంగా ఉంటే స్వర్గం;
అనుభవంగా ఉంటే నరకం.
దేవుడు ఏకమా? అనేకమా?
'రూపాయి నాణెం'గా ఏకం;
'రూపాయి చిల్లర'గా అనేకం.
దేవుని తలంపే జీవుని జన్మగా ప్రకటితమవుతుంది.,
కలకనే వాని తలంపే స్వప్నంగా ప్రకటనమయినట్టు.
మన జీవన సంగీతానికి 'అనాసక్తి'యే ఆధారశృతిగా ఉండాలి. అప్పుడే అది నిజమైన ఆధ్యాత్మిక జీవితం అవుతుంది.
సృష్టి ఎందుకంటే, సృష్టికర్తను తెలిపేందుకే.
దేనిని త్యజించవలసిన అవసరం లేదు.
'నాది' అన్న ఒక భావనను వదిలిపెడితే చాలు. అన్ని త్యజించినట్టే.
'ఎందుకు' అనేది ప్రశ్న కాదు - అది పరమాత్మ సంకల్పం.
అమనస్క స్థితి అంటే మనస్సు అనేది అస్సలు లేకపోవడం కాదు. మనసు లేని శరీరం శవంతో సమానం. స్వ-పర భేదం లేకపోవడమే అమనస్క స్థితి.
జ్ఞాని -
అనుభూతిలో శూన్యం; అనుభవంలో పూర్ణం.
ఈ మెలకువ కూడా కల లాంటిదే.,
అని Example చూపడానికే కల వచ్చేది.
కొంత భ్రమ, కొంత సత్యం అంటేనే సమస్య.
➡️ భ్రమ అంటే మొత్తం భ్రమ అను.
➡️ సత్యం అంటే మొత్తం సత్యం అను.
సమస్య తీరిపోతుంది.
ఆభరణం లో ఉన్న బంగారాన్ని కనుగొనడానికి --
➡️ ఆభరణాన్ని చెరపి బంగారాన్ని చూడాలని ప్రయత్నించేవాడు - సాధకుడు.
➡️ ఆభరణంగా కనిపిస్తున్నప్పటికీ నీవు చూస్తున్నది బంగారాన్నే అని స్థిమితంగా ఉండేవాడు - సిద్ధ పురుషుడు.
తనను తనలో చూసుకుంటే - ఆత్మ దర్శనం.
తనను ఇతరంలో చూసుకుంటే- విశ్వరూప దర్శనం.
బాహ్యంలో కర్మాచరణ ఉండాలి;
అంతరంలో భగవదిచ్ఛ అని ఉండాలి.
ఏది 'లలాట లిఖితం' కాదు.,
మన స్వీయ కర్మలే తిరిగి 'కర్మఫలాలు' గా మారి మనల్ని వరిస్తూ ఉంటాయి లేదా శపిస్తూ ఉంటాయి.
'ఎందుకు' అన్న ప్రశ్నకు సమాధానం లేదు.
మన మెదడుతో, ఆ మెదడును తయారు చేసినవాణ్ణి కనుగొనాలని ప్రయత్నిస్తున్నాము. ఇది అసాధ్యం.
నిశ్శబ్దం అంటే వెలుపల అలజడి లేకపోవడం.
మౌనం అంటే లోపల అలజడి లేకపోవడం.
ఒకరు:- ఊరికే ఉండడం అంటే?
సద్గురు:- 'నేను కర్తను' అనే భావన లేకుండా ఉండడం.
గురువంటే బరువు.
టేబుల్ మీద ఉన్న కాగితాలు చెల్లాచెదురు కాకుండా వాటిపై ఉంచబడిన 'బరువు రాయి', గురువు.
శిష్యుని సంస్కారాలు లౌకిక విషయాల పై పోనీయకుండా ఆత్మ వైపుకు ఏకీకృతం చేసే 'బరువు రాయి' గురువు.
జగన్నాటకం అని తెలిసాక ధర్మసంకటం ఎందుకు కలుగుతుంది?
సంకటం కలిగిందంటే ఇదంతా 'నాటకం' అని నీకు తెలియనట్లే.
ఇంత వేదాంతం కూడా అవసరం లేదు. మెలకువ వచ్చిన దగ్గర నుండి మళ్లీ నిద్రపోయే వరకు ఉన్నది అంతా 'వట్టిదే' (మాయే) అని ఉంటే చాలు. అంతకన్నా వేదాంతం మరొకటి ఉండదు.
నేను అనేది పుట్టినిల్లు.
ప్రపంచం అనేది మెట్టినిల్లు.
ఏ కర్మ, మరో కర్మ కు దారి తీస్తుందో ఆ కర్మ ప్రయాణానికే 'పునర్జన్మ' అని పేరు.
ఏ కర్మ, కర్మరాహిత్యానికి దోహద పడుతుందో ఆ కర్మ శూన్యానికే 'మోక్షం' అని పేరు.
మనం నిద్ర నుండి మేలుకోగానే 'నేను' అనే తొలి ఆలోచన కలిగాకే మిగతా ఆలోచనలు, వ్యవహారాలు కలుగుతాయి.
అలాగే భగవంతుని 'తొలి ఆలోచన' అయిన 'నేను' నుండే సర్వసృష్టి జరిగింది.
దృశ్యం ఆగితే తెర తెలియబడినట్లు, దృశ్యం ఆగితే ఆత్మ తెలియబడుతుంది.
➡️ దృశ్యాన్ని తొలగించి తెరను తెలుసుకునే టెక్నిక్ - ధ్యానం.
➡️ ఏకకాలంలో దృశ్యాన్ని, తెరను చూడగలిగే టెక్నిక్ - జ్ఞానం.
ఏ ఏ సరుకులు వేస్తే ఏ ఏ రుచులు వస్తాయో పాకశాస్త్రం తెలుపుతుంది.
అలాగే 'మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన వాస్తవాలు అలా రూపుదిద్దుకుంటాయి' అని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుపుతోంది.
ధ్యాన స్థితిలో --
మన మనస్సు గతము, భవిష్యత్తు గురించిన గందరగోళాన్ని దాటి 'శుద్ధ చైతన్య నిశ్చల స్థితి'ని చేరుతుంది.
👉 కృతయుగంలో ఉన్నవాడు 'నేను' అన్నాడు.
👉 త్రేతాయుగంలో ఉన్నవాడు 'నేను' అన్నాడు.
👉 ద్వాపరయుగంలో ఉన్నవాడు 'నేను' అన్నాడు.
👉 కలియుగంలో ఉన్నవాడు 'నేను' అన్నాడు.
ఆ "నేను" అన్నదొక్కటే సార్వకాలికం.
దుఃఖంలో క్షణాలు యుగాలవుతాయి;
సుఖంలో యుగాలు క్షణాలవుతాయి;
సుఖదుఃఖాలకు సాక్షివైతే క్షణాలు, యుగాలు మాయమవుతాయి.
దేనివలన నీకు చూచే శక్తి కలిగిందో, ఆ చూపుతో దానిని నీవు చూడలేవు.
దేని వలన నీకు తలచే శక్తి కలిగిందో, దానిని నీవు తలవలేవు.
No comments:
Post a Comment