Tuesday, January 24, 2023

****అంతరాలోచన

 🌷అంతరాలోచన🌷

✳ అన్ని లోకాలలో కూడా జీవం ఉంటుందా?
 ఉంటుంది.,  కానీ మనలా ఉండదు. మన మానవ కంటితో చూడలేము. ఎందుకంటే అక్కడి వాతావరణం భిన్నంగా ఉంటుంది. ప్రతి లోకాన్ని సృష్టికర్త, ఆయనకు నచ్చిన విధంగా సృష్టిస్తారు. ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. అక్కడ పరిస్థితులకనుగుణంగా శరీరాన్ని తీసుకుంటే., అక్కడి జీవాన్ని చూడవచ్చు.

విశ్వాంతరాళంలోని మనకు తెలిసిన లేక తెలియని సమస్త చరాచర జీవుల సుఖానుభవం లేక దుఃఖానుభవం ప్రతి జీవి, ప్రతి ఒక్కరూ "సరాసరి"  లెక్కన అనుభవించటం జరుగుతుంది.
 అందువల్ల నీ సుఖం, నీ శాంతి నీ ఒక్కని స్థితిపై ఆధారపడి లేదు.  జగత్తు యొక్క మొత్తపు సుఖం మీద ఆధారపడి ఉంది.

ఆధ్యాత్మికం దుఃఖాన్ని లేకుండా చేయదు.

నీవు సుఖాన్ని ఎంజాయ్ చేసినట్టు, దుఃఖాన్ని కూడా అలా ఎంజాయ్ చేయగలిగే శక్తిని ఇస్తుంది.

నేను - చిత్;   నాది - జడము.
 ఈ రెండూ కలిస్తేనే వ్యవహారం ఉండేది.  ఇదే చిజ్జడ గ్రంథి.

ఈ గ్రంథి (ముడి) వీడిన వానికి కర్తవ్యము ఉండదు, వ్యవహారం ఉండదు.

నీవు ఫలితాన్ని అనుభవిస్తున్నావంటే నీవు 'కర్త' గా ఉండి కర్మను చేసినట్టే.

✳️ నేను లేనే లేను... అని భావన చేయి, లేదా
✳️ ఉన్న సమస్తము నేనే... అని భావన చేయి

 ఆత్మనిష్ఠకు ఈ రెండే ఉత్తమ ఉపాయాలు.

జరిగేది జరుగుతుంది; జరుగనిది జరుగదు.
అని స్థిమిత పడినవానికి దేవునితో కూడా పని లేదు.

బావిలో పడిన వస్తువును తేవడానికై ఈతగాడు ముక్కును (శ్వాసను), నోటిని (మాటను) బంధించి,  నీట మునిగి ఆ వస్తువును గ్రహిస్తాడు.

 అలాగే ముముక్షువు తన హృదయంలో నెలకొని ఉన్న ఆత్మ కై శ్వాసను, వాక్కును బంధించి ఆత్మను సంగ్రహిస్తాడు.

ఏది ఉందో, ఏది లేదో చెప్పేది - సత్యం.

ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెప్పేది - ధర్మం.

ఒకరు:- అందరూ సమానం ఎలా?
సద్గురు:- భౌతికపరంగా అందరమూ మరణిస్తాము.
ఆత్మపరంగా అందరమూ శాశ్వతులము.

జీవితం..
అభినయంగా ఉంటే స్వర్గం;
అనుభవంగా ఉంటే నరకం.

దేవుడు ఏకమా?  అనేకమా?

'రూపాయి నాణెం'గా ఏకం;
'రూపాయి చిల్లర'గా అనేకం.

దేవుని తలంపే జీవుని జన్మగా ప్రకటితమవుతుంది.,

కలకనే వాని తలంపే స్వప్నంగా ప్రకటనమయినట్టు.

మన జీవన సంగీతానికి 'అనాసక్తి'యే ఆధారశృతిగా ఉండాలి.  అప్పుడే అది నిజమైన ఆధ్యాత్మిక జీవితం అవుతుంది.

సృష్టి ఎందుకంటే,  సృష్టికర్తను తెలిపేందుకే.

దేనిని త్యజించవలసిన అవసరం లేదు.
'నాది' అన్న ఒక భావనను వదిలిపెడితే చాలు.  అన్ని త్యజించినట్టే.

'ఎందుకు' అనేది ప్రశ్న కాదు - అది పరమాత్మ సంకల్పం.

అమనస్క స్థితి అంటే మనస్సు అనేది అస్సలు లేకపోవడం కాదు.  మనసు లేని శరీరం శవంతో సమానం.  స్వ-పర భేదం లేకపోవడమే అమనస్క స్థితి.

జ్ఞాని -
అనుభూతిలో శూన్యం; అనుభవంలో పూర్ణం.

ఈ మెలకువ కూడా కల లాంటిదే.,  
అని Example చూపడానికే కల వచ్చేది.

కొంత భ్రమ, కొంత సత్యం అంటేనే సమస్య.
➡️ భ్రమ అంటే మొత్తం భ్రమ అను.
➡️ సత్యం అంటే మొత్తం సత్యం అను.
 సమస్య తీరిపోతుంది.

ఆభరణం లో ఉన్న బంగారాన్ని కనుగొనడానికి --

➡️ ఆభరణాన్ని చెరపి బంగారాన్ని చూడాలని ప్రయత్నించేవాడు - సాధకుడు.
➡️ ఆభరణంగా కనిపిస్తున్నప్పటికీ నీవు చూస్తున్నది బంగారాన్నే అని స్థిమితంగా ఉండేవాడు - సిద్ధ పురుషుడు.

తనను తనలో చూసుకుంటే - ఆత్మ దర్శనం.

తనను ఇతరంలో చూసుకుంటే- విశ్వరూప దర్శనం.

బాహ్యంలో కర్మాచరణ ఉండాలి;
అంతరంలో భగవదిచ్ఛ అని ఉండాలి.

No comments:

Post a Comment