ఒక అడవిలో ఒక కోతి వుండేది.ఆ కోతికి ఒక రోజు పాయసం తినాలని బుద్ధి పుట్టింది.
.కానీ పాయసం తయారుచెయ్యడానికి ముందు ఒక కుండ, పాలు, చక్కర యివన్నీ కావాలి.ఎలా?అనుకొని చెట్టుక్రింద కూచుని ఏడుస్తూ వుంది. ఆ దారే వెడుతున్న ఒక
కుండలు అమ్ముకునే వాడు,కోతీ కోతీ ఎందుకేడుస్తున్నావు?అని అడిగాడు.
అప్పుడు కోతి వెక్కుతూ నాకు పాయసం చేసుకోడానికి ఒక కుండ కావాలి అంది.
సరే ఏడవకు నేనిస్తాలే తీసుకో అని ఒక కుండ యిచ్చాడు.
కుండ దొరికింది మరి పాలు కావాలి కదా మరీ ఏడుస్తూ కూచుంది.ఆ దారిలో ఒక
పాలవాడు పోతూ ఎందుకేడుస్తున్నావు కోతీ అని అడిగాడు నాకు పాయసానికి పాలు
కావాలి అంది.వాడికి జాలి వేసి సరే అని ఆ కుండలో సేరు పాలు పోశాడు.యింకా
పంచదార ,జీడిపప్పు,సేమియా,ఏలకులపొడి కావాలికదా?మరీ ఏడుస్తూ
కూచుంది.ఆ దారి వెంట సరుకులు అమ్ముకుందుకు ఒక శెట్టి వెళుతున్నాడు.వాడు
కోతి ఏడుపు చూసి జాలిపడి సేమియా,చక్కర.ఏలకుల పొడి యిచ్చాడు.సరుకు
లన్నీ దొరికాయి యింక పాయసం చెయ్యడమే తరువాయి.కోతి మూడు రాళ్ళు
ఒకచోట పెట్టి పొయ్యి తయారు చేసింది.చితుకులు యేరుకొని వచ్చి మంట చేసింది దాని మీద కుండను పెట్టి పాలల్లో సేమియా పంచదార ,,ఏలకుల పొడి వేసింది.
పాయసం కుత కుత వుడుకుతూ వుంది. ఆ వాసనకు అది లొట్టలు వేస్తూ వుంది.దాన్ని కలపాలనుకుంది. ఒక కర్ర ముక్క తెచ్చుకోవచ్చు కదా అబ్బ మరీ కర్రముక్క కోసం వెళ్ళాలి కదా అని బద్దకించి కలపడానికి తన తోకని కుండలో పెట్టింది ఆ తెలివి తక్కువ కోతి. ఇంకేముంది ఆ వేడికి దాని తోక కాలింది.వెంటనే బయటికి తీసి వెధవ పాయసం నా తోక మాడి పోయింది అని ఆ కుండెడు పాయసాన్ని అక్కడే వుండే నీళ్ళ తొట్టి లో
పోసేసింది.ఆ నీళ్ళలోనే తన తోక ముంచి నాకింది. పాయసం నోటికి తియ్యగా
తగిలింది.అబ్బ పాయసం యెంత రుచిగా వుంది.అనవసరంగా నీటిపాలు చేశాను.
అని ఆ తొట్టి లోని నీళ్ళను ఆబగా తాగ సాగింది.నీళ్ళు కొంచెమే వుండడం తో
కొంచెం చప్పగా వున్నా కోతికి బాగానే వుంది అని పించింది.
దురాశతో ఆ నీళ్లన్నీ తాగి తాగి దాని పొట్ట పగిలి చనిపోయింది.
చిన్నప్పుడు మేము ఏదయినా పిండి వంట తినమని మారాం చేస్తే మా పెద్దమ్మఈ
కోతి,పాయసం కథ చెప్పి చూశారా ఆ కోతి ముందు పాయసం బాగా లేదని పారేసింది.మరీ కాస్త నాకి చూసి బాగుంది అనుకుంది. ఏదైనా ముందు తిని చూస్తేకదా రుచి తెలిసేది..అని ఈ కథ చెప్పి మాతో తినిపించేది. మరీ కోతిలాగా అత్యాశకు పోకుండా తినాలి అని చెప్పేది.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment