Thursday, January 26, 2023

శ్రీ మహాభారతంలో చిన్ని కథలు: #అర్జునుడిమీద కర్ణుడు నాగాస్త్రమును ప్రయోగించుట: #సర్పముఖాస్త్రము నుండి అర్జునుని రక్షించిన కృష్ణుడు…

 230123c1745.      240123-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀249.

                శ్రీ మహాభారతం
                 ➖➖➖✍️
                 249 వ భాగం
   శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:


 #అర్జునుడిమీద కర్ణుడు నాగాస్త్రమును ప్రయోగించుట:

#సర్పముఖాస్త్రము నుండి అర్జునుని రక్షించిన కృష్ణుడు…

కర్ణుడు తన వద్ద ఉన్న సర్పముఖాస్త్రాన్ని బయటకు తీసాడు. ఆ అస్త్రానికి అధిపతి తక్షకుని కొడుకైన అశ్వసేనుడు. దానిని అర్జునుడిని చంపడానికే దాచి ఉంచాడు. ఇప్పుడు దానిని తీసి సంధించాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు. కాని గురి కొంచెం కిందకు ఉండటం గమనించిన శల్యుడు “కర్ణా ! నీ గురి తప్పుతుంది. అర్జునుడి కంఠానికి సూటిగా గురిపెట్టు” అన్నాడు. 
తన గురిని అక్షేపించిన శల్యుని మీద ఆగ్రహించిన కర్ణుడు “శల్యా! నా గురిని ఆక్షేపించే అర్హత నీకు లేదు. చూస్తూ ఉండు ఈ అస్త్రధాటికి అర్జునుడి తల తెగి నేల మీద పడుతుంది” అంటూ సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించాడు. 

తమ వంక నిప్పులు కక్కుతూ వస్తున్న అస్త్రాన్ని చూసి కృష్ణుడు తన బలమంతా ఉపయోగించి రధమును భూమిలోకి అయిదు అంగుళాలు కూరుకుపోయేలా తొక్కాడు. 

అర్జునుడి కంఠానికి గురిపెట్టిన అస్త్రము గురి తప్పి అర్జునుడి తల మీదగా దూసుకుపోతూ కిరీటాన్ని ఎగురగొట్టింది. 

ఆ కిరీటాన్ని బ్రహ్మ దేవుడు దేవేంద్రునికి బహూకరించాడు. దేవేంద్రుడు నివాత కవచులను సంహరించిన సమయంలో అర్జునుడికి బహూకరించాడు. 
ఆకిరీటమే అర్జునుడికి కిరీటి అనే నామాన్ని ఇచ్చింది. ఇప్పుడది నాగాస్త్ర ప్రభావానికి ధ్వంసం అయింది. 

అర్జునుడు వెంటనే తెల్లని పాగాను కిరీటంలా చుట్టుకున్నాడు. అర్జునుడి కిరీటమును నేలపడేసిన అస్త్రము తిరిగి అర్జునుడి వైపు దూసుకు వస్తుంది. అది చూసిన అర్జునుడు “ఈ నాగాస్త్రం ఎవరు ఇది నన్ను ఎందుకు తరుముతోంది” అన్నాడు. 

కృష్ణుడు “అర్జునా ! అప్పుడే మరిచావా ! ఖాండవ వన దహన సమయంలో నీవు అశ్వసేన అనే నాగ కన్య   తన తల్లిని రక్షించుకు పోతున్న సమయంలో నీవు ఆ నాగకన్యను చంపావు.   ఆమె తరువాత తక్షకుడి కుమారుడు అశ్వసేనుడిగా జన్మించి నిన్ను చంపడానికి కర్ణుని వద్ద నాగముఖాస్త్రంగా పూజలందుకుంటూ ఉంది. ఇప్పుడు నీవు నీ దివ్యాస్త్రాలతో ఆ నాగ కన్యను సంహరించు” అన్నాడు. 

వెంటనే అర్జునుడు అశ్వసేనుడిని సంహరించి నాగాస్త్రాన్ని ముక్కలు చేసి కర్ణుడి శరీరం మీద పన్నెండు బాణాలు వేసాడు. 

తాను ప్రయోగించిన నాగాస్త్రం కృష్ణుడి కారణాన గురి తప్పిందని తెలుసుకుని కర్ణుడు పదమూడు బాణాలను కృష్ణుడి మీద, నూరు బాణాలను అర్జునుడి మీద ప్రయోగించాడు. 

అర్జునుడు ఒకే బాణంతో కర్ణుడి కుండలములు కొట్టాడు. కర్ణుడు బెదరక అర్జునుడిమీద శరవర్షం కురిపించసాగాడు. 

కర్ణుడి శరములు మధ్యలోనే తుంచి వేస్తున్నాడు అర్జునుడు. కర్ణుడి శరీరం రక్తసిక్తం అయింది. సూర్యుడు అస్తమించే సమయమూ ఆసన్న మైంది. అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి అదృశ్యరూపంలో ఉండి ఆకాశం నుండి… “ఇప్పుడు కర్ణుడి రథం భూమిలోకి కుంగి పోతుంది. కర్ణుడికి అవసాన సమయం ఆసన్నమైంది” అన్నాడు. 

అది విన్నా కర్ణుడు ధైర్యమును వీడక భార్గవాస్త్రాన్ని స్మరించాడు. కాని అతడికి అప్పుడది గుర్తుకు రాలేదు. పరశురామ శాపం పనిచేయడం మొదలైంది అని తెలుసుకున్నాడు. కర్ణుడు మనసులో నేను ధర్మపరుడిని ధర్మం నన్ను రక్షిస్తుంది అనుకున్నాను కాని అది అసత్యం అయింది అనుకున్నాడు. 

అర్జునుడు కర్ణుని మీద శరములు గుప్పిస్తున్నాడు. కర్ణుడు తన బాహుబలాన్ని నమ్ముకున్నాడు. అర్జునుడు కర్ణుడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. కర్ణుడు ఇంద్రాస్త్రంతో దానిని అడ్డుకున్నాడు. 

కృష్ణుడు అర్జునుడితో “అర్జునా ! నీ బ్రహ్మాస్త్రం ఎందుకు వృధా అయిందో తెలుసా ! నీవు ఉపాయంతో యుద్ధం చేయడం లేదు. నీవు ఉపాయంతో యుద్ధం చేస్తే కర్ణుడు నీ ముందు నిలబడకలిగిన వాడు కాదు. కనుక శ్రమపడక ఉపాయంతో కర్ణుడిని సంహరించు” అన్నాడు. 

ఇంతలో కర్ణుడు రుద్ర అనే అస్త్రం జపించ సాగాడు. అతడి రధచక్రం భూమిలోకి కుంగి పోయింది. అందు వలన కర్ణుడు రుద్రాస్త్ర ప్రయోగం చేయలేక పోయాడు.

"భూమిలోకి దిగిన చక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడు ఫోటో ఉంది చూడండి."

#కర్ణుడు చేసిన నేరములు కృష్ణుడు గుర్తు చేయుట:

తన రథచక్రం భూమిలో దిగబడిపోయిందని అర్జునిని అడుగుతున్న కర్ణుడు…

కర్ణుడు రథం దిగి “అర్జునా ! ప్రస్తుతం నేను విరధుడను. నా రధ చక్రం భూమిలోకి కుంగి పోయింది. నేను దానిని ఎత్తుకొనవలెను. భూమి మీద ఉన్న నా మీద రథం మీద నుండి నీవు బాణప్రయోగం చేయడం ధర్మము కాదు. కనుక రధచక్రం తీసేదాకా నా మీద బాణ ప్రయోగం చేయకుము. ఇది కేవలం నీకు యుద్ధ ధర్మం తెలియ జేయడానికి చెప్తున్నాను కాని నీకు, కృష్ణుడికి భయపడి కాదు” అన్నాడు. 

కృష్ణుడికి సమయం చిక్కింది. కర్ణుడిని చూసి నవ్వుతూ “అదేమిటి కర్ణా! నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేయడం ఎప్పటి నుండి ? నీకు ఆపద కలిగింది కనుక ధర్మం గుర్తుకు వచ్చిందా! అహంకారంతో విర్రవీగు సమయాన ధర్మం గుర్తుకు రాలేదా ! ధర్మమార్గాన పయనించే పాండవులకు జయం తధ్యం. అధర్మమార్గాన చరించే కౌరవులకు అపజయం అనివార్యం. నీవు నీ అనుంగు మిత్రునితో కలిసి చేసిన అకృత్యములు మరచినట్లు ఉంది.

పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చిన సమయాన అతడిని ప్రేరేపించింది నీవు కాదా ! అప్పుడది నీకు అధర్మం అనిపించ లేదా! నీకు ఇప్పుడు మాత్రం ధర్మం గుర్తుకు వచ్చిందా! కపటజూదం ఆడించి నప్పుడు, ద్రౌపదిని అవమానాల పాలు చేసి అనరాని మాటలు అన్నప్పుడూ, పాండవులను కించపరచినప్పుడూ గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ! పాండవులను అడవులలో ప్రంశాంతంగా బ్రతకనీయక ఘోషయాత్రకు సుయోధనుడిని పురికొల్పినప్పుడు గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ! అభిమన్యకుమారుని ఒంటరిని చేసి చుట్టుముట్టి పలువురు దాడి చేసి చంపినప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా ! ఇవి అన్నీ   ప్రత్యక్షంగా చేసింది సుయోధనుడే అయినా పరోక్షంగా కారణం నీవు కాదా!” అన్నాడు. 

కృష్ణుడి ఒక్కొక్క మాట అర్జునుడికి ఆగ్రహం తెప్పించింది. దయాదాక్షిణ్యం లేక కర్ణుడి మీద శరములు గుప్పించాడు. 

కర్ణుడు కూడా నేల మీద ఉండే అర్జునుడు వేసే బాణములు ఎదుర్కొంటూ అర్జునుడి మీద బాణములు వేస్తున్నాడు. అర్జునుడు కర్ణుని పతాకం విరుగకొట్టాడు. కర్ణుడు మహా కోపంతో అర్జునుడి మీద, కృష్ణుడి మీద పదునైన బాణములు వేస్తూ మధ్యమధ్యలో రధచక్రం తీయ ప్రయత్నించినా అది విఫలం అయింది. 

కృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని సంహరించమని చెప్పాడు. 

అర్జునుడు అత్యంత శక్తివంతమైన మహాస్త్రాన్ని ఎక్కుపెట్టి మనసులో “నేనే కనుక తపస్సు చేయడంలో, దానధర్మాలు చేయడంలో గురువులను సేవించడంలో లోపం లేక చరించిన వాడనై బ్రాహ్మణులను గురువులను తృప్తిపరచిన వాడినై అను నిత్యం పుణ్య కర్మలు ఆచరించే వాడినై ఉంటే ఈ అస్త్రం కర్ణుడిని సంహరించుగాక!” అని సంకల్పించి గాండీవాన్ని ఆకర్ణాంతం లాగి అస్త్రప్రయోగం చేసాడు. 

ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ వచ్చి కర్ణుడి శిరస్సు ఖండించింది. కర్ణుడి శరీరం నుండి అందరూ చూస్తుండగా ఒక తేజం బయటకు వెడలి సూర్యునిలో కలిసి పోయింది. కర్ణుడి మరణంతో బ్రాహ్మణ శాపం అంతమై అప్పటి వరకు భూమిలో కూరుకు పోయి ఉన్న రధచక్రము భూమిలో నుండి పైకి లేచి భూమి మీద నిలబడింది. 

సూర్యుడు అస్తమించాడు.


#శల్యుడు కర్ణుని మరణం సుయోధనుడికి వివరించుట:

కర్ణుడి మరణం పాండవ సేనలో ఆనందోత్సాహాలు నింపాయి. జయజయ ధ్వానాలు మిన్నంటాయి. కర్ణుడు లేని రధమును తోలుకుని శల్యుడు వెళ్ళి పోయాడు. 

భీముడు కర్ణుడి మరణానికి ఆనందించి పెద్దగా అరుస్తూ కేకలు వేసాడు. 

శల్యుడు సుయోధనుడిని చేరి “సుయోధనా ! ఎన్నో యుద్ధాలు చూసాను కాని ఈ రోజు జరిగిన కర్ణార్జునుల యుద్ధం లాంటిది చూడ లేదు. ఒక దశలో కృష్ణార్జునులు సైతం కర్ణుడి పరాక్రమానికి భయపడ్డారు. కాని విధి బలీయం కనుక అంతటి బలశాలి కర్ణుడిని బలి తీసుకుంది. కృష్ణార్జునుల శంఖధ్వానాలు వింటున్నావు కదా! సూర్యాస్థమయం అయింది ఈ రోజుకు యుద్ధం చాలించడం మంచిది” అన్నాడు. 

కర్ణుడి మరణ వార్త సుయోధనుడిని నిశ్చేష్టుడిని చేసింది. అంతలో కర్ణుడి మరణ వార్త తెలుసుకుని అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, శకుని, సుశర్మ విషణ్ణ వదనాలతో అక్కడకు చేరారు. సుయోధనుడి దుఃఖానికి అవధులు లేవు. “కర్ణా ! కర్ణా !” అని అరుస్తూ శిబిరానికి చేరుకున్నాడు.


#కృష్ణార్జునులు ధర్మజునుకి కర్ణుని మరణ వార్త ఎరిగించుట:

కృష్ణార్జునులు కూడా యుద్ధంచాలించమని తమ సేనలకు చెప్పారు. 

అందరూ తమతమ శిబిరములకు చేరారు. అందరూ తమ ధర్మరాజు శిబిరానికి వెళ్ళి అన్న మాట నిలబెట్టు కున్నందుకు ధర్మరాజును అభినందించారు. 

కృష్ణుడు ధర్మరాజుతో “ధర్మజా! కర్ణుడు ఈరోజు మహా పరాక్రం ప్రదర్శించాడు. నీ ఆగ్రహజ్వాలలే కర్ణుడిని దహించాయి. కర్ణుడి చావుతో నీకు కౌరవుల బాధ తీరింది. నీవు ఇక నిశ్చింతగా ఉండు” అన్నాడు. 

ధర్మరాజు … “అది సత్యము కాదు. నీ అనుగ్రహమే మాకు విజయాన్ని చేకూర్చింది. కాని మరేది కాదు” అన్నాడు. 

కృష్ణుడు “ధర్మజా! నేను కేవలం నిమిత్త మాతృడను. నీ తమ్ములు , బావలు అత్యంత పరాక్రమ వంతులు. అందరి సమిష్టి కృషి వలనే మీకు విజయం చేకూరింది” అని అన్నాడు.


#ధర్మజుడు కర్ణుడిని రణభూమిలో చూచుట:

ధర్మరాజు కర్ణుడి మరణానికి ఆనందించి “ఒకసారి రణ భూమికి వెళ్ళి కర్ణుడిని చూడవలెనని కోరికగా ఉంది” అన్నాడు. 

ధర్మరాజు బంధు మిత్రులు తోడురాగా సపరివార సమేతంగా రణ భూమికి వెళ్ళి కర్ణుడు మరణించడం చూడడానికి వెళ్ళాడు. 

రణభూమిలో తలతెగి పడి ఉన్న కర్ణుడిని అతడి పుత్రులను చూసి ఇక తనకు పునర్జన్మ కలిగినంతగా సంతోషించాడు ధర్మరాజు “ అన్నాడు సంజయుడు. ✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment