Tuesday, February 7, 2023

శివుని తల మీద చంద్రుడు ఎందుకు?

 *>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*
 *శివుని తల మీద చంద్రుడు ఎందుకు?* 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శివుని తల్చుకోగానే తల మీద చంద్రవంకతో, మెడలో ఫణిహారంతో కూడిన రూపం మెదుల్తుంది. ఇంతకీ ఈ పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు? అంటే ఆసక్తికరమైన గాథలు వినిపిస్తాయి.

దత్తాత్రేయుని సోదరుడు

చంద్రుడు, పరమపతివ్రత అనసూయాదేవి సుతుడు. దత్తాత్రేయునికి సోదరుడు. స్వయంగా మహాశక్తిసంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనస్సుని శాసించేవాడిగా జ్యోతిషంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు, చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకీ సమానమైన ప్రేమని అందిచాలన్నదే ఆ మాట. ఆ మాటకు మారు మాటాడకుండా సరేనన్నాడు చంద్రుడు.

 మాట తప్పాడు

దక్షుని 27మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగవైభవంగా జరిగిపోయింది. ఒకో రోజు ఒకో భార్య వద్ద ఉండసాగాడు చంద్రడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచేకొద్దీ చంద్రునికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధికప్రేమ కలుగసాగింది. ఆ విషయం మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా, రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది. కొన్నాళ్లకి ఈ వ్యవహారాన్ని తండ్రి చెవిన వేశారు మిగతా భార్యలు. విషయాన్ని విన్న దక్షుడు, చంద్రుని మందలించాడు. కానీ కొద్దికాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది. మిగతా భార్యలకంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది. ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు.

దక్షుని శాపం!

కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవడం లేదంటూ దక్షుడు, చంద్రుని మీద కోపగించుకున్నాడు. ఏ వెలుగుని చూసుకుని నువ్విలా విర్రవీగుతున్నావో, ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు. బ్రహ్మ కుమారుడైన దక్షుని మాటకు తిరుగేముంది! ఆయన శపించినట్లుగానే ఒకో రోజు గడిచేకొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు. చంద్రుడే కనుక క్షీణించిపోతే ఔషధుల పరిస్థితి ఏంకాను? మనుషుల మనస్సులు ఏం కాను? అంటూ అంతా కలవరపడిపోసాగారు దేవతలు. చంద్రుడు కూడా తనకు శాపవిమోచనం ప్రసాదించమంటూ అటూఇటూ తిరిగాడు. కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు. చివరికి మరికాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరాడు.

నెలనెలా శాపం

చంద్రుని పరిస్థితిని గమనించిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. దక్షుని శాపం అకారణమైనది కాదు. కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు! అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండటమూ మంచిది కాదు. కాబట్టి మధ్యేమార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు. దక్షుని శాపం కారణంగా చంద్రుడు ఒక పక్షం పాటు క్షీణించక తప్పదనీ, అయితే లోకకళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగుని సంతరించుకుంటాడనీ తెలియచేశాడు. పరమేశ్వరుని వద్ద ఉంటే అలా దక్షుని శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉందని గ్రహించిన చంద్రుడు, అప్పటి నుంచి శివుని సిగలో ఉండిపోయాడు.

మోహం ఎంతటివారినైనా దిగజారుస్తుందనీ, తప్పు తెలుసుకొని పరమేశ్వరుని పాదాలని చేరుకున్న రోజున తిరిగి జీవితం వెలుగులమయం అవుతుందనీ.... ఈ వృత్తాంతం తెలియచేస్తోంది.

(చంద్రడు, శివుని శిరసు మీద ఉండటానికి మరో కథని కూడా చెప్పుకుంటారు. దేవగురువైన బృహస్పతి భార్య తార చంద్రుని మోహంలో పడి ఆయన వద్ద ఉండిపోయిందట. తారను చంద్రుని నుంచి తీసుకువచ్చేందుకు శివుడు చేసిన యుద్ధంలో చంద్రుడు ఓడిపోయాడనీ, ఆ సమయంలో చంద్రుని తునకను విజయచిహ్నంగా పరమేశ్వరుడు ధరించాడనీ అంటారు.)

🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸 

No comments:

Post a Comment