*శివుడు ఎక్కడ ఉన్నాడు!?*
✍️ పూజ్యగురువులు శ్రీ చాగంటి కోటీశ్వరరావు గారు
⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️
⚜️ *ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తాలుగా పది వాయువుల రూపంలో లోపల ఉండి, సమస్తం నిర్వహణ చేస్తున్నాడు. ఆయన శివుడు.*
🔱 *ఆకలిలో, ఆవులింతలో, తేనుపులో, దాహంలో, నిద్రలో, అన్నిటిలో శివుడు ఉన్నాడు. శివుడు ఎక్కడున్నాడు అని అడగవద్దు. లేనిది ఏది? అని అడగాలి. అంతటా శివుడు ఉన్నాడు. చూడాలనిపిస్తే...*
*బ్రహ్మాండ మావి స్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగ మౌలి విలసత్ పూర్ణేందు వాన్తామృతైః-*
⚜️ శివలింగరూపంలో ఉన్నాడు. ఇన్ని మనకు ఇచ్చినవాడి మీద నీళ్ళు పోస్తే పొంగిపోతాడు. *మన చల్లదనం, లోకం చల్లదనం, శివలింగపు చల్లదనంలో ఉన్నాయి.* ఆయన ఇచ్చిన నీళ్ళే పొయ్యడానికి నీకు సమయం లేదంటే పైన పాత్రలోపోసి వెళ్ళిపో. అందులో నుంచి చుక్కచుక్క పడుతుంటే ఇక్కడ చల్లగా ఉండి నిన్ను చల్లగా ఉంచుతాను అంటాడు. అంతటి ఉదారుడు. *ఆయన అరూపరూపి.*
🔱 ఎందులోనుంచి వస్తున్నదో, ఎందులోకి వెడుతున్నదో చూపించమంటే చూపించలేం. కోపంతో చేసే పని కనబడుతుంది. కోపాన్ని చూపించగలమా? దేని నుండి వచ్చి, దేనిలో ఉండి, దేనిలోకి వెడుతున్నదో చూపించలేం. కనక ఆ మూడిటి గుర్తే లింగం. ఎందులోనుంచి బయటికి వచ్చి ఎందులోకి లయమైపోతున్నదో అదే శివలింగం ఉన్నదీ, వెళ్లిందీ, లయమైపోయిందీ ఆయనయందే అయితే ఆయనే స్థితికారుడు. ఆయనకూ, విష్ణువుకీ తేడా లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. వాళ్లిద్దరూ ఒకటై ఉన్నారు. ఇది శివలింగ స్వరూపమన్న భావన కలిగి పొంగు కలగగానే ఆయన చల్లబరిచేస్తాడు. *ఎక్కడెక్కడ వేడెక్కిపోతుంటుందో అక్కడ శివలింగానికి అభిషేకం చెయ్యమన్నారు. ఏ కోరిక తీరాలన్నా, ఏ సమస్య ఉన్నా అభిషేకం చేసుకోవాలి.*
⚜️ కస్తూరి నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం, మారేడు దళాలతో అభిషేకం చేస్తే సమస్తమైన భోగభాగ్యాలు. ఆవుపాలతో చేస్తే జ్ఞానం. పంచదారతో చేస్తే అహంకారం పోతుంది. నేతితో చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఒక్కొక్క ప్రత్యేకపరిస్థితిలో ఒక్కొక్క రకంగా అభిషేకం చేసి తీర్థమిస్తారు. శివాభిషేక తీర్థంతో వ్యాధులు నయంచేసిన మహాపురుషులున్నారు. అంత శక్తి కలిగినది శివలింగం. అటువంటి శివలింగం ఏది ఉందో ఆ మహానుభావుడే *మృడః.*
🔱 *అపవర్గ ప్రదో*- *అపవర్గ ప్రదో* అనగా ఆయనే మన దుఃఖాన్ని తీసేస్తాడు. దుఃఖం ఎప్పుడు పోతుంది? జ్ఞానం కలిగి ఇది నేను కాదని తెలుసుకోగానే దుఃఖం పోతుంది. జ్ఞానం, మోక్షం ఆయన ఇచ్చేస్తాడు. *అనంతః* - శివలింగభావనకి అంతమూ, అంతూ ఉండవు. ఏది చేస్తున్నా శివసంబంధంగా చెయ్యకుండా ఉండలేం. ఆర్తి కలగాలి గానీ అన్నీ చేసేవాడు ఎక్కడైనా కనపడతాడు.
🙏 *కాళహస్తీశ్వర శతకంలో...*
*నిన్నే రూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ*
*చన్నో కుంచమొ, మేక పెంటికయొ యీ సందేహముల్ మాన్చి నా*
*కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా జూపవే*
*చిన్నీరేజ విహారమత్తమధుపా శ్రీకాళహస్తీశ్వరా!*
*నీ రూపంబు దలంపగా దుదమొదల్ నేఁ గాన నీవైనచో*
*రారా రమ్మని యంచు బిల్వవు వృథారం భంబు లింకేటికిన్!*
*నీర న్ముంపుము మిఁక ని పాలమికనిన్నే నమ్మినాడం జుమీ*
*శ్రీరామార్చితపాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!*
⚜️ నీ ఆద్యంతాలు తెలియటం లేదు. రామచంద్రమూర్తి చేత అర్చన చేయబడిన శివా, నీవే చెప్పాలి. ఆర్తి కలిగితే శివుడు వచ్చేస్తాడు.
⚜️ *నీరూపు మోకాలొ..* -
అర్జునుడు శివాభిషేకం చెయ్యాలని శిబిరంనుండి తొందరగా వెళ్ళిపోతుంటే, శ్రీకృష్ణుడు ఎక్కడకి వెళుతున్నావని అడిగాడు. ఈ రోజు శివరాత్రి కదా! అందుకొరకు అభిషేకం చేసుకోవడానికి వెళుతున్నానని చెప్పాడు. శివుని కొరకు ఎక్కడికో వెళ్ళడమేమిటి? ఆయన అంతటా ఉన్నాడని తన మోకాలు చూపాడు. అక్కడ అర్జునునికి శివలింగదర్శనమైంది.
🔱 *స్త్రీ చన్నో...* -
ఒక మహారాజు తెల్లవారితే మహాశివరాత్రి అనగా ఆ రాత్రి ఒక నర్తకి ఇంటికి వెళ్ళి, ఆమెతో భోగమనుభవించి పడుకున్నాడు. చీకటి విచ్చుకోకముందు వెళ్ళిపోదామనుకున్నాడు. బాగా నిద్ర పట్టింది. ఆయన నిద్రలో ఉండగా గంటలు వినపడుతున్నాయి. పూజలు చేసేస్తున్నారు. గవాక్షంలోకి వెళ్ళి చూస్తే అభిషేకం కొరకు ప్రజలు గుంపులుగా వెళుతున్నారు. అప్పుడు బయటికి వెళితే అందరూ గుర్తిస్తారు. రాజు నర్తకి ఇంట్లో ఉన్నాడని అంటారు. శివుని ఎలా ఆరాధన చెయ్యాలా అని బెంగపెట్టుకుని అటూ ఇటూ చూస్తే, *నిద్రిస్తున్న రాజనర్తకి స్తనం, ఆమె వెల్లకిలా పడుకోవడంలో శివలింగంలా దర్శనమైంది.* ఆర్తితో ఆమె స్తనంలో శివలింగాన్ని చూసాడు.
*నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్ర్యంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః*
అంటూ అభిషేమంత్రం చెప్పి నీళ్ళుపోసాడు. ఆయన భక్తికి శివుడు లొంగిపోయాడు. అక్కడే ఉన్న నీటిపాత్ర తీసుకుని ఆమె స్తంభించిపోయింది. *స్త్రీ చన్నులోనుండి వచ్చి ఆచంటేశ్వరుడు అయ్యాడు.*
*భక్తికి లొంగిపోయే నిన్ను ఏమని, ఎక్కడున్నావని చెప్పాలి?*
⚜️ *కుంచమో...* -
ఒక వైశ్యునికి శివుడంటే మహాప్రీతి. కాని వ్యాపారకారణానికి ఎప్పుడూ బోర్లించని కుంచం బోర్లించి వచ్చినవారితో మాట్లాడుతూ తెల్లని బియ్యాన్ని తీసుకుని తడిపి పక్కన ఉంచుకుని, వాటితో కుంచాన్ని శివలింగంగా భావించి,
*ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః*
*ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః*
*ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః*
*ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః*
*ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః*
*ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః*
*ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః*
*ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః*
*ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః*
*ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః*
*ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః*
అంటూ శివనామాలతో పూజ చేస్తుండేవాడు. కొన్నాళ్ళకు అది శివలింగమైపోయింది.
🔱 *మేక పెంటికయొ..*
మేకలు కాచుకునే ఒక భక్తుడికి, ఒకసారి శివాలయంలో వేదమంత్రాలతో అర్చకులు అభిషేకం చేస్తుంటే, తాను కూడా శివలింగానికి అలా అభిషేకం చెయ్యాలని కోరిక కలిగింది. మేకల పాలుతీసి శివలింగమెలా? అని ఆలోచిస్తూ వెళుతుంటే, ఒక మేక, పెంటికలు గుత్తిగా విడిచి పెడుతున్నది. అందులోనుండి దొర్లి దొర్లి ఒక పెంటిక నిలబడి ఉంది. అతనికి అది శివలింగం వలె కనపడి, అతను మేక పాలను ఆవుపాలవలె భక్తితో *శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ* అంటూ దాని మీద పోసేసాడు. అతని భక్తికి ఆ మేక పెంటిక శివలింగమైంది. *కాటం అంటే మేక పెంటిక. కాటంలో నుండి పుట్టాడు కనక కాటేశ్వరుడయ్యాడు. క్రమంగా మోటుగా ఉందని కోటేశ్వరుడు అయ్యాడు.*
⚜️ *సందేహముల్ మాన్పినా కన్నారన్ భవదీయ మూర్తి సగుణాకారంబుగా జూపవే!-*
భక్తికి ఇంత లొంగిపోయావు కదా ఈశ్వరా! నిన్నెక్కడ ఉన్నావని చెప్పను? ఎలా అభిషేకం చెయ్యను? నిన్ను చూడాలని ఉంది, కనపడవా? అని ధూర్జటి గుండెలు బాదుకుని ఏడ్చాడు. శివుడు మోక్షమిచ్చి, సమస్తమైన కోర్కెలు తీర్చగలిగినవాడు. శివుడు శివుడే, శివలింగం శివలింగమే. అటువంటి మహానుభావుడు అనంతః అపవర్గప్రదః - ఆయన మోక్షం ఇవ్వగలవాడు. మృడః - సమస్తమైన కోరికలూ తీర్చకలిగినవాడు.
*ఎక్కడ లేడు...*
*అన్నింటా ఉన్నాడు...*
*దర్శించగలిగితే.....*
( శ్రీ చాగంటి వారి.. *మహేశ్వర వైభవం* నుండి...)
*సేకరణ:*
🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱
No comments:
Post a Comment