🪔🪔 ఉద్వేగాలు🪔🪔
🌹మోదంలోనూ భేదంలోనూ మనిషి నీడలా వెన్నంటి ఉండేదే ఉద్వేగం ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలు, రాగద్వేషాలు ఉంటాయి. సందర్భోచితంగా కలిగే ఆలోచనల స్వరూపాలే ఉద్వేగాలు. ఇవి వయసుతోపాటు బలపడి భావోద్వేగాలుగా, రాగద్వేషాలుగా మారతాయి.
🌹మానవ సంబంధాలు బలపడటానికి, బలహీనపడటానికి కారణం ఉద్వేగాలే. ఆలోచనలు సానుకూల లేదా ప్రతికూల ఉద్వేగాలను కలిగిస్తాయి. సానుకూల ఉద్వేగాలు మనుషులను దగ్గర చేస్తాయి. ప్రతికూల ఉద్వేగాలు మనసులను దూరం చేస్తాయి. 🌹ప్రాణాలు పోసేవి, తీసేవి ఉద్వేగాలే.
🌹పక్షికి బాణం తగిలి గాయపడి పడిపోతే గౌతముడు తనకు గాయమైనట్టు బాధపడ్డాడు. పక్షి బాధను చూసి చలించిపోయాడు. బుద్ధుడిగా మారి ప్రపంచాన్ని తన హృదయంతో కదిలించాడు. ఉద్వేగాలకు ఆలోచన వివేచన తోడు చేయడం అవసరం. అలా చేయలేనివారు ఉచితానుచితాల గురించి ఆలోచించరు. వివేకం కోల్పోయి
విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు.
🌹భృగు మహర్షి వైకుంఠం వెళ్ళినప్పుడు శ్రీహరి తనను గమనించలేదని కోపోద్రిక్తుడయ్యాడు. తన స్థాయిని మరిచి శ్రీహరి వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. ఫలితం తెలిసిందే.
🌹మనసులో మార్దవం లేనిదే కళ్ళు చెమ్మగిల్లవు. సుఖంలో, దుఃఖంలో హృదయం లోని తడిని తెలియజేసేవి ఆశ్రువులే. కన్నీటి పరిమళం పన్నీటి పరిమళం కంటే గొప్పది. పన్నీరు రసాయనభరితం. అది బాహ్య దుర్గం ధాన్నే తొలగిస్తుంది. కానీ కన్నీరు ప్రాణా ధారితం. లోపలి దుఃఖాన్ని పారదోలి మనసును తేలిక బరుస్తుంది. కొన్ని ఉద్వేగాలు ఆనందం, ప్రేమ, జాలి, కరుణను కలిగిస్తాయి. మరికొన్ని ఉద్వేగాలు దుఃఖాన్ని కదిలిస్తాయి. కన్నీటి తడికి చలించే హృదయానికే లిపి లేని కన్నీటి భాష
అర్థమవుతుంది.
🌹కుష్ఠు వ్యాధి పీడితుల కన్నీళ్లు చూసి చలించిన థెరెసా తన మానవత్వాన్ని సేవా రూపంలో చూపించింది. పేదల పాలిట అమ్మగా మారి మదర్ థెరెసాగా ప్రపంచ ఖ్యాతి గడించింది.
🌹కష్ట సమయంలో దైవాన్ని కన్నీటితో శరణు కోరాలి. కరుణాంతరంగుడైన పరమాత్మను కచ్చితంగా అవి కదిలిస్తాయి. మూగ జీవి అయిన గజరాజు మొసలి నోట చిక్కింది. ఆ కష్ట సమయంలో నీవే దిక్కంటూ కార్చిన కన్నీరు వైకుంఠవాసుణ్ని భువికి దిగి వచ్చేలా చేసింది.
🌹ఎంచుకున్న భక్తి మార్గంలో భగవంతుణ్ని శరణు కోరి ఆరాధించినప్పుడు తెలియని తాదాత్మ్యత కలుగుతుంది. అది మనకు తెలియకుండానే అశ్రు రూపంలో మనల్ని ఆనంద స్థితికి తీసుకెళ్తుంది. భవబంధాల నుంచి మానసిక ఉద్వేగాల నుంచి శాశ్వత విముక్తులు కావడమే ఆనందస్థితి.
🌹భగవంతుణ్ని ఆర్తితో ఆరాధించాలి.
🌹అది తెలియని తన్మయత్వాన్ని కలిగిస్తుంది.
🌹అప్పుడు వర్షించే ఆనంద బాష్పాలు మనిషిని తాను ఎవరో తెలుసుకునే ఆధ్యాత్మిక బాటలో నడిపిస్తుంది.
🌹అత్యంత విధ్వంసకరమైన ఉద్వేగం విద్వేషం.
🌹మనిషిలోని స్వార్థమే దీనికి మూలం.
🌹విద్వేషం మానవత్వాన్ని రాక్షసత్వంగా మారుస్తుంది.
🌹 ఇది ఉన్నవాళ్లు ఎదుటివారి భావోద్వేగాలను భరించలేరు, గుర్తించలేరు.
🌹జపాన్ దేశంలో సామాజికవేత్తలు యువతలో ఉద్వేగాలు అదుపు తప్పకుండా వారికి మనసు కదిలించే చలనచిత్రాలు చూపుతుంటారు.
🌹విలువలతో కూడిన పుస్తకాలను చదివిస్తున్నారు. 🌹మనసును మైమరపించే సంగీతాన్ని వినిపిస్తున్నారు.
🌹అశ్రువులు మనిషిలోని కాఠిన్యాన్ని కడిగేస్తాయి.
🌹 కారుణ్యాన్ని మేల్కొలుపుతాయి.
🌹ఉద్వేగాలను తగ్గించే కన్నీళ్లు మానసిక, శారీరక స్వస్థతను చేకూరుస్తాయి.
🌹అందుకే ఎప్పటికప్పుడు ఉద్వేగాలను వదిలించుకోవాలి.
- ✍️ఎం. వెంకటేశ్వర రావు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment