0902. 2-4. 010223-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*బ్రహ్మశ్రీసామవేదం షణ్ముఖశర్మ గారు రచించిన వ్యాసం..*
*ఆచార్యుడు భీష్ముడు*
➖➖➖✍️
*ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉంది. దైవీ శక్తులను జాగృతపరచుకొనే మహదవకాశం ఈ కాలంలో ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం...*
*ఈ మూడింటినీ 'కాంతి' మార్గాలు అని భగవద్గీత చెబుతోంది. జ్యోతిర్మండలంలో జరిగే మార్పులు, భూమి సౌరశక్తిని గ్రహించే పద్ధతులు... వీటిని ఆధారం చేసుకొని సూక్ష్మదృష్టిగల మహర్షులు కాలంలో వివిధ పర్వాలను ఏర్పాటు చేశారు.*
*'దేవతలు' అంటే కాంతిశరీరులని అర్థం. సూర్యకాంతి కిరణాల్లో ఉండే చైతన్య విశేషాలను వివిధ దేవతాశక్తులుగా వేదవాఙ్మయం వర్ణించింది. పృథ్విపై వాటి ప్రభావం అమోఘం. వాటిని స్పందింపజేసి సత్ఫలితాలు పొందడమే ఆరాధనగా వ్యాప్తి చెందింది.*
*మాఘమాసంలో సౌరశక్తి నుంచి ప్రసరించే దివ్యత్వం అమోఘం. అందుచేతనే ఈ నెలలో పర్వదినాలన్నీ అత్యంత పవిత్రంగా అనుశాసించారు. ‘రథసప్తమి, భీష్మఏకాదశి, మాఘపూర్ణిమ, మహాశివరాత్రి ఇవన్నీ మాఘ మాసంలోని పుణ్యదినాలు.*
*ప్రతి నెలా ఏకాదశిని వ్రతదినంగా భావించడం మన సంప్రదాయం. అందులో 'మాఘ ఏకాదశి' అత్యంత పవిత్రం. అయితే ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి' అనడంలో ఒక విశేషం ఉంది.*
*'మహాభాగవత శిఖామణి' అయిన భీష్మాచార్యుడు ముక్తినొందిన రోజు మాఘ శుద్ధ అష్టమి. అటుతరువాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మఏకాదశిగా వ్యవహరించడం సంప్రదాయ మయ్యింది.*
*భీష్మచరిత్ర భారతంలో ఒక సమున్నత శిఖరం. అరి భయంకరుడైన భీష్ముడు - భీషణత్వానికి ప్రతీక. ఈ భీషణత్వం ఇంద్రియ నిగ్రహంలోను, అంతఃశ్శత్రువులను జయించడంలోను ప్రదర్శించి పరిశుద్ధతను సాధించాడు.*
*దేవవ్రతుడనే పేరు కలిగిన ఈ మహాత్ముడు, పితృభక్తిపరుడుగా తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు.*
*'భీష్మప్రతిజ్ఞ' జగత్ ప్రసిద్ధం. సత్యనిష్ఠకు పేరుపడిన భీష్ముడు కొన్ని సందర్భాల్లో ధర్మాధర్మ నిర్ణయంలో తటస్థంగా ఉన్నా (ఉదా॥ ద్రౌపదిని నిండుసభలో అవమానించిన సందర్భంగా మౌనం వహించడం) వాటి వెనుక దైవ సంకల్ప జ్ఞానం, ధర్మసూక్ష్మాలు హేతువులుగా ఉన్నాయి. ఆ కొద్ది సందర్భాల ఉపేక్షకు కూడా 'అంపశయ్య'లో తనను తాను శిక్షించుకున్న నిర్మలుడు, భీష్ముడు.*
*ఇంద్రియ నిగ్రహానికీ, సత్యనిష్ఠకీ మారుపేరుగా నిలిచిన ఈ పవిత్ర చరిత్రుడు అర్జునునితో సాగించిన యుద్ధంలో తగిలిన బాణాలతో అలాగే నేల కొరిగాడు. ఆ బాణాలే శయ్యగా కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో మహర్షులంతా ఆయనను పరివేష్ఠించి ఉన్నారు.*
*లోకరక్షణకు విష్ణు సంకల్ప ప్రణాళికలో భాగంగా భూమికి దిగిన ఈ వసు స్వరూపుడు సర్వ ధర్మాలనిధి, త్రికాలజ్ఞుడు. ఈ 'త్రికాలజ్ఞ' లక్షణంతోనే దైవ సంకల్పానికి అనుగుణంగా వ్యవహరించాడు.*
*ఈయన అంపశయ్యపై ఉన్న సమయంలో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ యోగంలో ఉన్నాడు. ఒక ధర్మవేత్త లోకాన్ని వదిలి వెళుతున్న వేళ ఆయన నుంచి తరవాతి తరాలకు విజ్ఞాన సంపద అందాలని నిర్ణయించుకున్న కృష్ణుడు, ధర్మరాజాదులతో శరతల్పగతుడైన భీష్ముని చేరుకున్నాడు. ఒక మహాకాలంలో ఎంతో లోకాన్ని దర్శించిన అనుభవం, శాస్త్రాలను ఆపోశనపట్టిన ధార్మిక విజ్ఞానం ఆయనతోనే అంతరించిపోకూడదని కృష్ణ సంకల్పం.*
*పాలించే బాధ్యతను చేపట్టిన యుధిష్ఠిరునకు ఆయన ఆ ధర్మ సంపదనంతా అందించాలని ఆదేశించాడు పరమాత్మ. యుద్ధంతో అలసి, క్షతగాత్రుడై ఉన్న తాను బుద్ధిని ఏకాగ్రం చేసి సూక్ష్మాంశాలతో విషయాలను వివరించే శక్తిలేని వాడనని, కనుక ఆ ధర్మాలను శ్రీకృష్ణునే వివరించమని వేడుకుంటాడు భీష్ముడు.*
*కానీ ముకుందుడు, "తాతా! నీకు అమోఘమైన శారీరక, బుద్ధి శక్తులను అనుగ్రహిస్తున్నాను. వాటితో నీవు నీ అనుభవసారాన్ని, ధర్మసూక్ష్మాలను నీ మనుమనికి అందించు" అని బోధించాడు.*
*ఒక తరం తన తరువాతి తరానికి అందించవలసినది ధర్మాన్నీ, జ్ఞానాన్నీ, అనుభవసారాన్నీ.; అంతేగానీ ఆస్తి పాస్తులను మాత్రమే కాదు. ఈ సందేశమే భీష్ముని ద్వారా ధర్మజునికి ధర్మోపదేశం చేయించడంలోని పరమార్థం.*
*అప్పుడు భీష్ముడు ఉపదేశించిన సూక్ష్మధర్మాలు, మోక్ష ధర్మాలు మహాభారతంలో శాంతి, అనుశాసనిక పర్వాలుగా అతివిస్తారంగా విరాజిల్లాయి. మహాభారతం వేదాల సారమైతే, ఈ రెండు పర్వాలు (భీష్మబోధ) భారతానికి సారం.*
*ఇందులో …పాలనధర్మాలు,రాజధర్మాలు, వ్యక్తి ధర్మాలు, లోకరీతులు, ఉపాసన రహస్యాలు, తత్త్వచింతన.... అన్నీ కలబోసుకుని కనబడతాయి. అంటే, భీష్ముడు ఒక సమగ్ర మానవుడిగా ఈ బోధ ద్వారా మరోమారు నిరూపించు కున్నాడు. తాత్విక చింతన, ధార్మికానుష్ఠానం, దృఢభక్తి, ఇంద్రియ నిగ్రహం - ఇన్ని సులక్షణాలు రాశిపోసుకున్న కారణంగా భీష్ముడు భగవానునికి అత్యంత ప్రీతి పాత్రుడయ్యాడు. ఆచరించి, ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఆయన పేరున ఒక మహాపర్వమే ఏర్పడింది. ఆ పర్వం లోనిదే భగవద్గీత.*
*యావద్భారతజాతీ సంస్మరించదగిన భీష్మాచార్యునికి వందనం!*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment