*హింసను విడనాడండి*
ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటం చాలా గొప్ప విషయం, అలాగే ఒకమనిషి ప్రాణాన్ని తీయటం చాలా హింసతో, పాపకరముతో కూడిన విషయం. ఈ సంగతిని గ్రహించకుండ చాలా మంది హింసాత్మక చర్యలకు పాల్పడుతూ, ఎందరి జీవితాలకో నష్టం కలిగించటం చూస్తే బాధ కలుగుతుంది. వాళ్ళు పండితులైనా, ధనవంతులైనా, వాళ్ళ చర్యలు ఖండించవలసిందే.
మన సంస్కృతిలో మనం నేర్చుకునే మొదటిపాఠం ఎవరినీ గాయపరచకూడదని, లేదా ఎవరికీ దుఃఖాన్ని కలిగించకూడదని. తమ ఆశ్రమ పరిధిలోని జింకలను దుష్యంతుడు చంపబోతే, అచటి బ్రహ్మచారులు అతనిని నివారించారు. దుష్యంతుడు వెంటనే తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఒక జింకను చంపటమే తప్పు అని భావించినప్పుడు, మనిషి ప్రాణాన్ని తీయటం తప్పని వేరే చెప్పవలసిన పనిలేదు. ఇతరులకు మనం కష్టాలలో ఏవిధంగానూ సహాయం చేయకపోవచ్చు, కానీ ఇతరులకు హాని కలిగించకుండా ఉండవచ్చుకదా. మన నీతి శాస్త్రాలలో దానిని ప్రాణాఘాతాన్నివృత్తి: అన్నారు.
కోపం కారణంగానే మనం ఇతరులకు హాని కలిగిస్తాం. అందుకనే కోపమే మనిషి యొక్క ఘోరమైన శత్రువని శాస్త్రాలు చెప్తున్నాయి. కోపాన్ని కనుక అధిగమించగలిగితే తద్వారా సంప్రాప్తించే పాపాన్ని తప్పించుకోగలం. అందువలన మనిషి కోపానికి తావు ఇవ్వకపోతే, కోపం కారణంగా చేసే పాపాలనుండి తప్పించుకోగలడు. అందరిపట్ల ప్రేమాభిమానాలతో జీవితాన్ని గడిపితే, జీవితం పుణ్యమయమవుతుంది. భగవంతుని కృపద్వారా అందరకీ కోపరహితమైన జీవితం కొనసాగించే శక్తి అందరికీ లభించుగాక.
--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు.
No comments:
Post a Comment