Sunday, February 5, 2023

ధర్మం

 *ధర్మం*

ఇహలోకంలోను, పరలోకంలోను మానవుణ్ణి రక్షించేది ధర్మం. ధర్మం మాత్రమే శాంతి, సుఖాలను ఇస్తుంది. ధర్మం అంటే ఏమిటో, ధర్మాచరణం అనగా ఏమో చాలా మందికి తెలియదు. శాశ్వతమైన శాంతి సుఖాలను ఇచ్చేది ధర్మం. ఆ ధర్మానికి అనుగుణమైన అన్ని పనులూ కూడ ధర్మమే.
ఏది ధర్మం, ఏది కాదు అనే విషయాన్ని వేదం నిర్ణయించింది. ధర్మస్వరూపాన్ని నిర్ణయించే పరమప్రమాణం వేదం. సూర్యుని వెలుతురు ఉంటే ఏదైనా వస్తువును చూడడానికి ఇతర దీపాదుల అవసరం ఉండదు. వేదానికున్న ప్రామాణ్యం అలాంటిది. ప్రతి వ్యక్తీ తన ఇష్టం వచ్చినట్లు ధర్మాన్ని బోధించడం ప్రారంభిస్తే అది వినాశానికే దారితీస్తుంది.
ఈ లోకంలో గొప్ప ధర్మం ఏది అని యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు.

को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः |
किं जपन्मुच्यते जंतुर्जन्मसंसार बंधनात् ||

అప్పుడు భీష్ముల వారు ఈ విధంగా సమాధానమిచ్చారు.

जगत्प्रभुं देवदेव मनंतं पुरुषोत्तमं |
स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोत्थितः ||

ఎవరైతే శ్రద్ధా భక్తులతో నిరంతరము పరమాత్మను ధ్యానించడం ధర్మాలన్నింటిలోకి గొప్పదైన ధర్మం అని సమాధానం చెప్పాడు. ఈ జగత్తుయొక్క క్షేమానికి మూలాధారం ధర్మం. అందుచేత కేవలం ధర్మ సమ్మతమైన కృత్యాలు చేస్తేనే మనం మంచి మానవులం అవుతాం. మన జీవితాలు సార్ధకమవుతాయి. ధర్మం విడచి మనం తప్పుదారిన పడితే మనం ఈ మానవ జన్మను వ్యర్ధం చేసుకొన్న వాళ్ళం అవుతాం. చివరికి వినాశం పొందుతాం. మనం ధర్మాన్ని గౌరవించి ఆచరిస్తే అది మనకు శ్రేయస్సు చేకూరుస్తుంది. "ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో ఆ ధర్మం తనను రక్షిస్తుంది" అని చెప్పబడింది.
ఈనాడు మనం అనుభవిస్తూన్న సుఖం పూర్వ జన్మలలో మనం చేసిన ధర్మము యొక్క ఫలం. అధర్మం వల్ల కేవలం శోకదుఃఖాలు కలుగుతాయి. ఇది నిత్య సత్యమైన నియమం. దీని విషయంలో ఎలాంటి సందేహమూ ఉండడానికి అవకాశం లేదు. అందుచేత ధర్మాన్ని ఆచరించడం, అధర్మాన్ని విడనాడడం అనేవి సార్ధక జీవిత లక్షణాలు. ఈ నియమాన్ని జాగరూకతతో అనుసరిస్తే దానివల్ల కీర్తి, శాంతి, సుఖమూ లభిస్తాయి. ఎట్టి పరిస్థితిలోనూ ధర్మాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ధర్మాన్ని ఆచరిస్తే మనకే మంచి కలుగుతుంది, మోక్షం లభిస్తుంది.

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

No comments:

Post a Comment