Monday, February 27, 2023

అర్థలక్ష్మి-భోగలక్ష్మి

 *అర్థలక్ష్మి-భోగలక్ష్మి*
                
*పూర్వం కౌతుకపురమనే నగరాన్ని బహుసువర్ణుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనిని యశోవర్మ అనే క్షత్రియ యువకుడొకడు సేవిస్తున్నాడు. రాజాసేవకునకు ఒక సూర్యగ్రహసమయాన ధనమీయగా దానినాతడు పూర్తిగా ఖర్చు చేసికొన్నాడు. తదుపరి రాజేమాత్రం ధనమీయనందున దు:ఖితుడై  భార్యను పోగొట్టుకొని అభీష్టసిద్ధికై వింధ్యవాసినీ దేవిని ప్రార్థించాడు.*

*ఆమె ప్రత్యక్షమై నీకు అర్థలక్ష్మి కావాలా? భోగలక్ష్మి కావాలా? అని అడిగింది.*

*ఆతడు తనకీ రెండు లక్ష్ములభేదం తెలియదన్నాడు.*

*అపుడామె ఈ దేశం లోనే అర్థవర్మ, భోగవర్మ అనే ఇద్దరు వణిజులున్నారని-వారి వద్దకు పోతే ఈ భేదం నీకు స్పష్టంగా తెలుస్తుందని చెప్పింది.*

*దేవి చెప్పినట్లుగానే యశోవర్మ మొదటగా అర్థవర్మ వద్దకు పోయాడు.*

*అర్థవర్మ- యశోవర్మకు ఆతిథ్యమిచ్చి ఆనాటి మధ్యాహ్నం ఘృతమాంస వ్యంజనాలతో భోజనాన్ని పెట్టాడు. కాని ఆతడు మాత్రం అగ్నిమాంద్యంతో బాధపడే తనకింతకంటే ఎక్కువ తినరాదనే ఆంక్ష ఉందంటూ నేతితో కలిపిన పిండిని కొంచాన్నే తిన్నాడు. రాత్రి పూట కూడా యశోవర్మకు అన్నం పాలతో కలిపిన భోజనమిడగా ఆతడు తృప్తిగా తిన్నాడు. అర్థవవర్మ మాత్రం పలము మాత్రమే పాలు త్రాగాడు.*

*భోజనానంతరం ఇద్దరూ నిద్ర పోయారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దండధారులు కలలోన వచ్చినట్లుగా వచ్చి ఘృతపయో మాంసాలనధికంగా తిన్నావంటూ యశోవర్మ కాళ్లుపట్టుకొని లాగుతూ అర్థవర్మను లాఠీలతో చావమోదారు. అప్పుడాతడు ఇట్టి డబ్బెంత ఉన్నా కోరుకున్న పదార్థాలను తృప్తిగా తినలేని సంపద వ్యర్థమే అనుకొన్నాడు.* 

*అర్థలక్ష్మి స్వభావమాతనికి అర్థమైంది.   మరునాడు యశోవర్మ అర్థవర్మతో పాటు భోగవర్మ ఇంటికి బయలు దేరి వెళ్లాడు. భోగవర్మ యింట ధనసంపద జాడలేవీ కనిపించ లేదు. తనకు ధనం లేకపోయినా ఇతరులకు సాయం చేసి ధనాన్ని సంపాదించే భోగవర్మనాతడు చూచాడు. ఆడబ్బు ఎప్పటికప్పుడే వినియోగింపబడటం కూడా చూచాడు. తనింటికి వచ్చిన యశోవర్మ, అర్థవర్మలకు ఆతిథ్యమిచ్చాడు. మధ్యాహ్న సమయాన భోగవర్మ యశోవర్మలతో పాటు ఉత్తమమైన ఆహారాన్ని భుజించి పానీయాలను సేవించారు. రాత్రి అయ్యేసరికి భోగవర్మ తన పరిజనాన్ని పిలిచి ఈ పూటకు తగినంత పానమున్నదా అని అడిగాడు. వారు లేదని చెప్పగా అపరరాత్రియందు జలమెలా త్రాగగలమంటూ శయనించాడు. యశోవర్మకూడా భోగవర్మ చెంతనే పడుకున్నాడు. అర్థరాత్రి సమయంలో ముగ్గురు పురుషులు యశోవర్మ కలలోనికి వచ్చి నట్లుగానే వచ్చి-భోగవర్మ యింటిలోనికి ప్రవేశించారు. వారు అక్కడి పరివారాన్ని భోగవర్మకు సమయానికి తగిన పానీయాలనేలయందించలేదని అంటూ చావమోదసాగారు.*

*ఇంతలో యశోవర్మకు మెలుకువ వచ్చి ధనం లేకపోయినా భోగవర్మ భోగలక్ష్మియే ప్రశంసమైనదనుకున్నాడు.*

*అనుకొనకుండావచ్చే భోగవర్మ భోగలక్ష్మియే ప్రశంసనీయమైనదని-సమృద్ధమైనదైనా భోగహీనమైన అర్థలక్ష్మి నిరర్థకమని అనుకున్నాడు.*

*యశోవర్మ తిరిగి ఇంటికి వచ్చి విధ్యవాసినీ దేవిని ఆరాధించి ఆమె ప్రత్యక్షంకాగా భోగ లక్ష్మిని కోరుకొని తలంపక వచ్చే భోగసంపదలతో సుఖంగా ఉన్నాడు.*

*కాబట్టి భోగాసన్నమైన లక్ష్మి మిగుల కొంచెమైనా మంచిది. భోగరహితమైనది విస్తారమున్నా అది నిరర్థకమే అవుతుంది.* 

*“తదేవం భోగసంపన్నా శ్రీరపి అల్పతరావరమ్*
*న పునర్భోగ రహితా సువిస్తీర్ణాపి అపార్థకా”*

210. శ్లో- కథాసరిత్సాగరం.
అలంకారవతీలంబకం.
నాల్గవతరంగం.                      సే::𝓂𝒶𝒹𝒽𝒶𝓋𝒶 𝓀❁𝓁𝓁𝒾 🕊

No comments:

Post a Comment