🪔🪔 గృహస్థుడు🪔🪔
🌹మన సనాతన ధర్మం మానవ జీవితాన్ని నాలుగు దశలుగా విభజించింది. ఏ దశలో ఏ విధి నిర్వహించాలో నిర్దేశించింది. ప్రతివ్యక్తీ తన జీవితాన్ని తాను చక్కగా అనుభవిస్తూనే సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడేలా ఒక మంచి వ్యవస్థను ఊహించింది. దాని ప్రకారం మనిషి జీవితాన్ని వయోధర్మాన్ని బట్టి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలనే నాలుగు దశలుగా విభజించింది. ప్రతిదశలోనూ వ్యక్తి తన వ్యక్తిగత, సామాజిక బాధ్యతల్ని నిర్వహిస్తూనే జీవిత ధ్యేయాన్ని సాధించుకోవడానికి కృషిచేసే అవకాశం ఉంది.
🌹సన్యాసాశ్రమం అందరికీ సాధ్యం కాదు. బ్రహ్మచర్యం తరవాత సన్యాసాశ్రమం తీసుకున్నవారూ అరుదుగా ఉన్నారు. ఆధునిక కాలంలో వానప్రస్థాశ్రమం ఉనికిని కోల్పోయింది. పూర్వకాలంలో రుషులు, రాజర్షులు ఉండేవారు. కొన్ని మతాలు, భావనలు సన్యాస జీవితాన్ని ప్రోత్సహిస్తాయి. సంసార జీవితాన్ని అంతగా అంగీకరించవు. భార్యాబిడ్డలు ఆధ్యాత్మిక జీవితానికి అడ్డంకి అని భావించేవారు అన్ని కాలాల్లోనూ ఉంటారని చరిత్ర గతిని చూసినప్పుడు బోధపడుతుంది.
🌹వివాహం చేసుకున్నవారు యోగసాధనకు పనికిరారని భావించేవారూ ఉన్నారు. గృహస్థ జీవితానికి, ఆధ్యాత్మిక సాధనకు పొంతన కుదరదనేవారు ఉన్నారు. కానీ, సనాతన సంప్రదాయాన్ని పరిశీలించినప్పుడు ఈ అభిప్రాయం ఆధారం లేనిదని తెలుస్తుంది.
🌹వేదమార్గాన్ని దర్శించిన రుషుల్లో పవిత్రమైన గృహస్థ జీవితాన్ని గడిపిన వారెందరో ఉన్నారు. వేద ధర్మాన్ని అనుసరించిన రుషులు చాలా మంది నాలుగు ఆశ్రమాల నిర్వహణలో జీవితం పరిపూర్ణత చెందాలని దర్శించి నిర్దేశించినవారే. కొందరు మాత్రం తమ స్వభావాలను బట్టి గృహస్థాశ్రమాన్ని స్వీకరించక ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండేవారు. అయితే వారు తమ ప్రణాళికకు తగిన మార్గాన్ని అనుసరించారుగాని, గృహస్థాశ్రమ స్వీకరణ దోషమని చెప్పలేదు.
🌹 గృహస్థాశ్రమం మనిషి జీవితంలో కీలకదశ. సమాజ జీవితానికి కేంద్రం గృహస్థాశ్రమం. దాని ఆధారంగానే మిగిలిన జీవన శాఖలు పెరిగి వృద్ధి చెందుతాయి. అందరూ ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయించి బతుకును కొనసాగిస్తారు. గృహస్థ ధర్మానికి మూలం కుటుంబం. కుటుంబ ధర్మానికి మూలాధారం దాంపత్య ధర్మం. కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురవుతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది.
🌹బ్రహ్మచారులకు, భిక్షువులకు, సాధు సన్యాసులకు, అంగవికలురకు పోషణ స్థానం గృహస్థుడే. | గృహస్థుడి వల్లనే మిగిలిన ఆశ్రమాలవారికి సుఖజీవనం సాధ్యమవుతోంది. గృహస్థుడు తన ధర్మాన్ని ఏమాత్రం అలక్ష్యం చేసినా సమాజ జీవనం అస్తవ్యస్తమవుతుంది. వైదిక సంస్కృతి గృహస్థుడికి అగ్ని ఉపాసన నిత్యవిధిగా పేర్కొంది. అతడు పంచయజ్ఞాలు నిర్వహించవలసి ఉంది. తన ఉనికికి, మనుగడకు కారణమవుతూ దృశ్యంగా, అదృశ్యంగా ఉన్నవాటన్నింటికీ మనిషి కృతజ్ఞత ప్రకటించడమే ఈ యజ్ఞాల లక్ష్యం.
🌹అవి దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ యజ్ఞాలు. దేవతల పట్ల కృతజ్ఞత ప్రకటించడం దేవయజ్ఞం. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా ప్రకటనం పితృయజ్ఞం. ఇది తర్పణ శ్రాద్ధాదుల ద్వారా జరుగుతుంది. తల్లిదండ్రుల స్థానం దేవతలతో | సమానమైనదిగా ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతిలో మనతోపాటు పెరుగుతున్న ప్రాణులు మన జీవనానికి సహకరిస్తున్నాయి. ఆ జీవకోటికి ఆహారం అందించడాన్ని 'బలిహరణం' అంటారు. మనుష్య యజ్ఞమంటే అతిథి సత్కారం. బ్రహ్మయజ్ఞం అంటే వేదాధ్యయనం.
🌹కాలంతోపాటు ఎన్నో వికృతులు ప్రవేశించి కుటుంబ జీవితం పూర్వపు ఉన్నతిని కోల్పోతోంది. ధర్మశాస్త్రానుసారం గృహస్థాశ్రమం నిర్వహించగలిగినప్పుడు సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
🌹అదే భారతీయ చింతన.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment