Tuesday, February 14, 2023

ప్రారబ్ధం

 ప్రారబ్ధం

ప్రారబ్ధం అనే పదం-
చెడుకర్మలకూ వర్తిస్తుంది, మంచికర్మలకూ వర్తిస్తుంది.

చెరశాలలో ఉన్నవాడు "ఇది నా ప్రారబ్ధం" అంటాడు.
భగవానులు కూడా  "ఇది నా ప్రారబ్ధం" అన్నారు.

పశుత్వం, ఋషిత్వం రెండూ ప్రారబ్ధాలే.
చెడ్డ ప్రారబ్ధాన్ని మాత్రమే ప్రారబ్ధం అంటున్నాం.
మంచి ప్రారబ్ధాన్ని "దైవానుగ్రహం" అంటున్నాం.
రెండూ ప్రారబ్ధాలే.

చెడుకర్మలు - రాళ్లమూట.
సత్కర్మలు - అన్నంమూట.

బాటసారికి ఒక మూట బరువును పెంచుతుంది.
మరొకమూట  ఆకలిని తీర్చి బరువును పోగొడుతుంది.

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు కదా!
అలానే కర్మను కర్మతోనే తొలగించాలి.
కర్మను నాశనం చేసే బీజాలు కర్మలోనే ఉన్నాయి...
అంటారు భగవాన్.

అలా కర్మను నాశనం చేసే కర్మలే సత్కర్మలు...

ప్రారబ్ధం అనేది ఒక పొట్టేలు,
పురుషప్రయత్నం అనేది ఒక పొట్టేలు.
ఈ రెంటి పోరాటంలో బలమైనది గెలుస్తుంది.

ప్రారబ్ధమనే పొట్టేలును జయించాలంటే,
పురుషప్రయత్నం అనే పొట్టేలు బలం పుంజుకోవాలి.

సాధనల ద్వారా సంచితమనే సంచిలో ఉన్న కర్మలను ఖాళీ చేయాలి.

అనేక జన్మల నుండి చేసిన పురుషప్రయత్నమే
సంచితంగా ఏర్పడుతుంది.

"సంచితం" అనే సంచిలో నుంచి కొద్దిగా కర్మలు తీసుకొని...
దానిని ప్రారబ్ధం అనే పేరుతో అనుభవించడానికి
మళ్లీ fresh గా జగత్తుతో సహా జన్మ తీసుకుంటాడు.

ఇదే పాతప్రపంచంలో అనేక జన్మలు ఎత్తడం కాదు,
క్రొత్తజన్మతో పాటు క్రొత్తప్రపంచాన్నే సృష్టించుకుంటాడు
తన ప్రారబ్ధమనే ముడి సరుకుతో.

వేలకు వేలు ఇలా క్రొత్త క్రొత్త ప్రపంచాలను, క్రొత్త క్రొత్త జన్మలను సృష్టించుకొని కొనసాగిస్తూ ఉండడం అనేది జీవుని స్వభావం. అంతే.

* * *

జ్ఞానయోగం ఏం చెబుతోందంటే-

జీవుని స్వభావం - సృష్టి చేయడం.
జీవుని స్వరూపం - కేవల"స్థితి"లో ఉండడం.

స్వభావం వైపు ఉన్న జీవునికి పార్వతి అని పేరు.
స్వరూపం వైపు ఉన్న జీవునికి శివుడు అని పేరు.

ఈ రెండూ ఏకకాలంలో ఉంటాయి.

ఇదే అర్థనారీశ్వరతత్త్వం.

అందువల్ల జీవునికి-
శాశ్వతమైన బంధమూ లేదు...
శాశ్వతమైన మోక్షమూ లేదు...
సృష్టి-స్థితి-లయాలు అనేవి నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది.
ఈ లీల అనంతం.
"ఎందుకు" అన్న ప్రశ్న అనవసరం.

అది అంతే.
ఇది ఇంతే.
అనేదే చిట్టచివరి సమాధానం.

* * *

No comments:

Post a Comment