ఒక సాధకుడు దైవత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు.
ఎలాగయినా సాధన చేసి మూడవకన్ను (జ్ఞాననేత్రం) తెరుచుకునేలా చేసుకోవాలని చాలా ఆశగా ఉన్నాడు.
ఒక గుహలో తపస్సు చేసుకుంటున్న గురువుగారి దగ్గరకు వెళ్ళేడు.
గుహలోకి వెళ్ళేటప్పుడు అతనికి చిన్నవెలుగు కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేకొద్దీ తగ్గిపోతూ చివరికి పుర్తిగా చీకటి అయిపోయింది.
ఆ కటిక చీకటిలో అతనికి చాలా భయంవేసి ఆర్తితో”ఓం నమశ్శివాయ” అని అరిచాడు.
ఆ పిలుపు విన్న గురువుగారు ఎవరది అని అడిగారు.
మీ అనుగ్రహం కోసం వచ్చాను అని సాధకుడు చెప్పేడు.
ఆ గురువుగారు ఆ గుహలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు.
ఈ సాధకుడిని పరీక్షించాలని అక్కడ ఉన్న దీపం వెలిగించమని చెప్పారు.
సాధకుడు ప్రయత్నించినా అది వెలగలేదు. అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు అన్నీ అయిపొయాయి, కాని దీపం వెలగడం లేదు అని సాధకుడు గురువుగారితో చెప్పాడు.
అప్పుడు ఆ గురువుగారు ఆ ప్రమిదలో ఉన్న నీటిని తీసివేసి, నూనెతో నింపి వెలిగించమని చెప్పారు.
సాధకుడు అలా ప్రయత్నించినా కూడాఅది వెలగలేదు.
అప్పుడు గురువుగారు ప్రమిదలో ఉన్న వత్తి నీటిలో నానిపోయి ఉంటుంది కాబట్టి దానిని బాగ ఆరబెట్టి అప్పుడు ప్రయత్నించమని చెప్పారు.
అలా చేసి సాధకుడు దీపం వెలిగించగలిగాడు.
ఈసారి తనని అనుగ్రహించమని గురువుగారిని అడిగాడు.
గురువుగారు ఆశ్చర్యతో ఇంతసేపూ నీకు అనుగ్రహం పొందే మార్గమే కదా బోధించాను అన్నారు.
అప్పుడు సాధకుడు తన అజ్ఞానాన్ని క్షమించమని అర్థమయ్యేలా చెప్పమని అడిగాడు.
గురువుగారు ఈ విధమగా వివరించారు.
నీ హృదయం అనే ప్రమిదలో వత్తి అనబడే ఆత్మ ఉంది.
అది ఇన్నాళ్ళూ కోరికలు, లోభం, అసూయ,అహంకారం మొదలైన దుర్గుణాలు అనే నీటిలో నానిపోయిఉంది.
అందువల్ల నువ్వు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించ లేకపోతున్నావు.
అవన్నీ తీసివేసి నీ హృదయాన్ని వెలిగించు.
No comments:
Post a Comment