🌺 అరుణగిరి ప్రదక్షిణా మాహాత్మ్యం 🌺
కైలాసవాసుడైన పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణాచలం రూపంలో భూమిమీద వెలిసాడు. ఆ దివ్య పర్వతం చుట్టూ ఎంతో మంది దేవతలు పరివేష్ఠించి ఉన్నారు.
“యానికానిచపాపాని జన్మాంతకృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే” అన్న శ్లోకం ప్రకారం, జన్మాంతరాల్లో చేసిన పాపాలు కూడా ఆ అరుణగిరికి ప్రదక్షిణ చేస్తే తొలగిపోతాయి.
కోటి అశ్వమేధయాగాలు, కోటి వాజపేయ యాగాలు చేస్తే వచ్చే ఫలితం, సర్వతీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలితం, కేవలం ఒక్కసారి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కలుగుతుంది.
ఎంత నికృష్టజన్మ ఎత్తిన వారికైనా సరే, అరుణగిరి ప్రదక్షిణ ముక్తిని ప్రసాదిస్తుంది.
ఆ గిరికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసేవారు, సకల యజ్ఞాలు చేసిన ఫలం పొందుతారు.
అరుణాచల ప్రదక్షిణ కోసం వెళ్ళేవారు ఒక్క అడుగు వేసినంత మాత్రాన్నే భూలోకాన్ని, రెండో అడుగుతో అంతరిక్షాన్ని, మూడో అడుగుతో స్వర్గాన్ని పొందుతారు. అలాగే మొదటి అడుగుతో మానసికంగా చేసిన పాపం, రెండో అడుగుతో వాక్కుద్వారా చేసిన పాపం, మూడో అడుగుతో శరీరం ద్వారా చేసిన పాపం తొలగిపోతుంది.
ఒక్కడుగుతో సకల పాపాలూ నశిస్తాయి. రెండో అడుగు వేస్తే సర్వతపస్సుల ఫలితం వస్తుంది.
పరమపవిత్రమైన ఈ అరుణగిరి చుట్టూ ఎన్నో సిద్ధాశ్రమాలున్నాయి. ఈ శిఖరం మీదే సర్వేశ్వరుడు సిద్ధేశ్వర రూపంతో, దేవతలంరిచేతా పూజించబడుతుంటాడు.
"ఈ దివ్య పర్వతం అగ్ని మయమని, ఈ పర్వతం అంతర్భాగంలో సర్వభోగాలతో కూడిన ఒక గుహ ఉందని భావిస్తూ ధ్యానిస్తూ, ఈ గిరికి ప్రదక్షిణ చేయాలి. అలా చేసిన వారి పాపాల్ని దోషాల్ని తొలగిస్తానని పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు.
అలాగే ఈ గిరిని పరమేశ్వరుడి అష్టమూర్తిగా కూడా అందరూ గ్రహించి నమస్కరించాలి.
అరుణగిరికి నిత్యం ప్రదక్షిణ చేసేవారికి నిత్యత్వం లభిస్తుంది.
ఈ గిరి ప్రదక్షిణ చేసేవాడి పాదధూళితో భూమి పవిత్రమవుతుంది.
అరుణాచలశివ 🌹
No comments:
Post a Comment