కర్మసిద్ధాంతం- 11
సూక్ష్మ శరీరంలో ఇంకో రెండు కరణాలు (instruments) కూడా ఉన్నాయి. అందులో ఒకటి మనస్సు, రెండవది బుద్ధి. వీటిని అంతఃకరణాలు అంటారు. ఇవి లోపల కనిపించకుండా ఉంటూ, జీవుడు ఆలోచించనకు, సంకల్ప, వికల్పాలకు కారణమవుతాయి.
నిజానికి జీవుడు విషయప్రపంచంలో చరించడానికి వీటిని వాడుకుంటాడు. మనస్సు, బుద్ధి అనేవి రెండూ ఒకటే ఉపకరణం, కానీ అవి చేసే పనిని బట్టి విభజించారు. సందేహం, అనుమానం, అస్థిరత, చాంచల్యం అనేవి కలిగినది మనస్సు, అందుకే దాన్ని 'సంకల్ప-వికల్పాత్మకం మనః' అన్నారు శంకరులు.
అదే ఉపకరణం అస్థిరతకు లోనుకాకుండా నిశ్చితంగా ఉంటే, అదే బుద్ధి. 'నిశ్చయాత్మకా బుద్ధిః' అన్నారు ఆదిశంకరులు. అంటే ఒక పని చేయమని నిశ్చయంగా చెప్పే శక్తి బుద్ధికి ఉంది.
మనస్సుకు అధిదేవత చంద్రుడు, బుద్ధికి బ్రహ్మ. ఇవే కాకుండా అహంకారం, చిత్తం అని కూడా రెండు ఉన్నాయి. అవి కూడా అంతఃకరణం యొక్క భాగాలు.
అహంకారం - తానే కర్త అనే భావన, నేను, నాది అనే భావన కలిగించేది అహంకారం. అహంకారానికి అధిష్ఠాన దేవత రుద్రుడు.
చిత్తం - గత జన్మల్లో ఏర్పడిన అనుభవాలు, కోట్ల వృత్తులు ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. ఇది శరీరంలోని అన్ని ఇంద్రియాలను చంలిపజేస్తుంది. మహావిష్ణువు దీని అధిష్ఠాన దేవత.
ఈ నాలుగింటికి పంచభూతాలకు సంబంధం ఉంది. అంతఃకరణం అనేది ఆకాశతత్త్వం. ఇందులో ఉన్న మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది అగ్నితత్త్వం, చిత్తము అగ్ని తత్త్వము, అహంకారం పృధ్వీతత్త్వానికి చెందినది.
ఇక్కడకి వరకు పఞ్చజ్ఞానేంద్రియాలు, పఞ్చకర్మేంద్రియాలు, పఞ్చప్రాణాలు, పంచ తన్మాత్రలు, మనోబుద్ధి, అహంకార, చిత్తాల గురించి చెప్పుకున్నాము. ఇవన్నీ సూక్ష్మ శరీరానికి చెందినవి.
జీవునకు ఉన్న మూడవ శరీరం కారణ శరీరం.
తత్త్వబోధలో శంకరులు ఇలా అంటారు.
ఏది కారణ శరీరం?
అనిర్వచనీయమైనది, అనాది (ఆది లేనిది), అవిద్యా (అజ్ఞానం) రూపంగా ఉన్నది; స్థూల, సూక్ష్మ శరీరాలకు కారణమైనది; అజ్ఞానమే తన స్వతస్వరూపంగా కలిగినది; నిర్వికల్ప రూపం కలిగినది కారణ శరీరం.
మిగితా రెండు శరీరాలు కార్యం అయితే ఇది వాటికి కారణం. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. విత్తనం కారణమైతే, చెట్టు కార్యము. విత్తనం అవ్యక్త/నిద్రాణ రూపమైతే, కార్యం వ్యక్తరూపం. కాబట్టి కారణం మరియు కార్యం రెండూ ఒకటే అయినా వాటి పరిస్థితులు వేరు. ఆలాగే కారణ శరీరమే స్థూల, సూక్ష్మ శరీరం, కాని నిద్రాణంగా ఉన్న రూపం. అయితే ఏది నిద్రాణంగా ఉన్నది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక విత్తనంలో, ఎన్నో రకాల కొమ్మలుం ఆకులు మొదలైనవి వేర్వేరుగా ఉండవు, మరియు ఇంద్రియాలకు కనిపించదు. ఎందుకంటే ఒక మామిడి విత్తనం నుంచి మామిడి చెట్టు మాత్రమే వచ్చినట్లు, నిమ్మ చెట్టు రానట్లు, బేధాలు కనిపించకున్నా, అవి ఉంటాయని భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కారణంలో కార్యం ఉంటుంది. కార్యంలో బేధాలు గమనించగలము కనుక దాన్ని సవికల్పం అంటారు మరియు కారణంలో, బేధాలు అనేవి ఇంద్రియాలకు అగోచరం కనుక, దాన్ని నిర్వికల్పం అన్నారు. కనుక కారణ శరీరం అనేది నిర్వికల్పం రూపం. గాఢ నిద్రను కారణశరీరానికి చెందినదిగా చెప్తారు, ఎందుకంటే ఆ స్థితిలో స్థూల, సూక్ష్మ శరీరాల ద్వార ఏర్పడిన బేధభావాలు జీవునకు తెలియవు. కారణ శరీరం గురించి చెబుతున్నప్పుడు, అజ్ఞానం అంటే మిథ్యా అని అర్ధం చేసుకోవాలి. ఆత్మ ఒక్కటే సత్యము. మిగితాది మిథ్య అంటుంది వేదాంతము. మిథ్యా వస్తువును గురించి చెప్పడం అసాధ్యం కనుక కారణ శరీరాన్ని అనిర్వాచ్యం అన్నారు. దాని ఆదిని (ప్రారంభాన్ని) అర్ధం చేసుకోలేరు కనుక అనాది అన్నారు కానీ అది ఆది నుంచి ఉన్నదని కాదు. కాలం అనే భావన సూక్ష్మ శరీరంలో భాగమైన బుద్ధి నుంచి తెలుసుకునేది. అదే కారణ శరీరం స్థాయిలో కాలం అనే భావన పనిచేయదు, ఎందుకంటే అక్కడ బుద్ధి నిద్రాణమై ఉంటుంది. బుద్ధి నిద్రాణంగా ఉండటమంటే, అది అజ్ఞానం అని అర్ధం. ఇది కారణ శరీరం. ఇక్కడితో శరీరత్రయం గురించి వివరణ ముగిసింది.
ఇంకా ఉంది ..
No comments:
Post a Comment