Thursday, March 30, 2023

శ్రీ రమణీయం -3 🌹 👌ఆత్మను ఆత్మగుణంతోనే సాధిద్దాం👌

 [3/24, 18:10] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం -3 🌹
👌ఆత్మను ఆత్మగుణంతోనే సాధిద్దాం👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 3. ఆత్మను ఆత్మగుణంతోనే సాధిద్దాం 🌈

✳️ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉన్నప్పటికీ అది తెలుసుకునే గుణం మాత్రం మనిషికే ఉంది. ఒక్కసారి దాన్ని తెలుసుకోగలిగితే భగవంతుడు మనతోనే ఎలా ఉంటున్నాడో అర్థం అవుతుంది. నేను ఆత్మ స్వరూపుడనన్న సత్యం నిరంతర ఆనందాన్ని మనకి ప్రసాదిస్తుంది. మనలో వ్యక్తం అయ్యే ఎరుక ఈ ఆత్మ లక్షణమే. అన్ని విషయాలను ఆ ఎరుకతోనే గ్రహించే మనం అందుకు కారణం అయిన ఎరుకను మాత్రం గ్రహించ లేక పోతున్నాం. అందుకు తొలి కారణం మనకు ఆ గమనింపు లేకపోవడమే. 

✳️ మన మనస్సు మూడు స్థితుల్లో ఉంటుంది. ఒకటి హెచ్చు తగ్గులు లేని సమతౌల్యస్థితి. అదే శాంతి. దాన్నే సత్వగుణం అనిపిలుస్తాం. ఇదే ఆత్మ గుణంకూడా. రెండవది నిద్రావస్థ. ఎరుకగానీ, ఆలోచనలుగానీ లేని స్థితి. ఇదే తమోగుణం. మూడవది మనసు, అతివేగంగా ఉండే రజోగుణం. ఈ స్థితిలో ఎరుక కలిగి ఆలోచనలతో సతమతమయ్యే మనసు అనేక వికారాలను పొందుతుంది. *ఎరుక కలిగి ఆలోచనలు లేని ప్రశాంత స్థితే సత్వగుణం.*

✳️ ఇక్కడ మనం చేయాల్సిన సాధనల్లా మనస్సుని శాంతిగా ఉంచుకోవాలి. అది ఆత్మ సహజ లక్షణం. అశాంతి వల్ల మనం ఈ స్థితికి దూరం అవుతున్నా, సత్వగుణం వల్లనే మనస్సు శాంతిని పొంది ఆత్మానుభూతిని పొందగలుగుతుంది. ఆత్మ విచారం అంటే మొదట మన మనస్సు పోకడలు గమనించటమే. అప్పుడు దానితత్వం సత్వంగా ఉందా లేక అతివేగంగానో, అతి నెమ్మదిగానో ఉందా అన్నది తెలుస్తుంది. ఈ పరిశీలన వల్ల క్రమేణా మనస్సు తన స్వస్థితి అయిన సత్వాన్ని పొందుతుంది. ఆ సత్వ గుణంతో చేసే జపం, తపం మాత్రమే పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. అతి వేగం ఫలితాన్ని, సిద్ధిని కల్గించవు. సత్యదర్శనానికి ఆవశ్యకమైన ఈ సత్వగుణం కోసం మనం విధిగా ఆహార నియమాలు, వ్యవహార నియమాలు పాటించాల్సిందే. మనం చేసే పూజలు, దీక్షలు ఇందుకు సహకరించాలే గాని ఏదో దాటేశామన్న అహంకారాన్ని పెంచటానికి కాదు.

✳️ ఇలా, నిదానంగా సాధన చేస్తూ పోతే ఆత్మ ఒకనాటికి మనకే వ్యక్తం అవుతుంది. అంతే తప్ప ఆత్మదర్శనం ఒకరు చేయించేది కాదు. ప్రతి పనిలోను మనస్సు నెమ్మదిగా ఉంచటం మన సాధన కావాలి. అందుకు విరుద్ధంగా ఉంటే ఆలోచనలు పెరిగి వికారాలు చేరుతాయి. సదా మనలో ఆత్మకిరణంగా ఉన్న మనసు నుండి ఆలోచనలు, వికారాలు తొలగించటమే మన సాధన అని శ్రీరమణ భగవాన్ అంటున్నారు. 

✳️ సత్వంతో చేసే సాధనలో 'తాపత్రయం' ఉండదు. అదే మనకి గుర్తు. ఆత్మ దర్శనానికి మరొక సాధన ఏకాంతవాసం. నిజానికి ఏకాంతవాసం అంటే ఆలోచనలు లేకుండా ఉండటమే. అయినా సామాన్యులం కనుక వీలైనంత మనసుని ఏకాంతంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఉండటం కాదు ఏకాంతంగా ఉండాలి. *ఒంటరితనం శరీరభావన, ఏకాంతం అనేది ఆత్మభావన.* ఒక్కళ్ళమే ఉన్నా ఆలోచనలు కదిలితే అది ఏకాంతం కాదు. పదిమందిలో ఉన్నా మనస్సు ఒకే విషయంపై ఉంచితే అదే ఏకాంతం. అది నిరంతర సాధన ద్వారానే సాధ్యం. సత్వగుణంతో మాత్రమే మనసు ఏకాంతాన్ని అంగీకరిస్తుంది. మన మనస్సు ఏకాంతాన్ని అంగీకరించటం లేదంటే, ఆహార వ్యవహారాల ద్వారా 'సత్వగుణం' కోసం సాధనచేయాలని అర్ధం. రజోగుణంతో ఉన్నమనస్సు వేగందాని స్వస్వరూపాన్ని, దాని మూలమైన ఆత్మని తెలుసుకోలేదు. అందుకే ఆత్మాన్వేషణ కన్నా సత్వగుణ సాధనే మన ప్రథమ కర్తవ్యం. విచార మార్గం అంటే మన స్మృతిలో ఉన్న ఈ తేడాలు గుర్తించటమే. గుర్తించటం మొదలైన తర్వాత అవి తప్పక వీగిపోతాయి. మనలో వ్యక్తం అయ్యే సత్వగుణం, ప్రేమ, శాంతి, ఎరుక, ఆనందం ఇవన్ని ఆత్మ గుణాలే. అయితే వాటిని గుర్తించేంత సత్వగుణం, నిమ్మళం మనకి రావాలి.  ఆత్మానుభవం అయిన తర్వాత ఆ నిమ్మళం ఎలానూ శాశ్వత లక్షణం అయిఉంటుంది. అప్పటి వరకు మనం దానినే సాధనారూపంలో కాపాడుకోవాలి. మన తొందరే సత్యానికి, సాధనకి మనని దూరం చేస్తుంది. 

✳️ దేవుని ముందు కూర్చోని చదివే స్తోత్రాలు, నామాలు కూడా తొందరగా చదివేలా చేసి ఫలాన్ని దూరం చేస్తాయి. నెమ్మదించిన మనసులో ఒక్కనామం చదివినా ఫలమే, మనతోనే ఉండి మనకి అనుభవంలోకి రాని ఆత్మను మన మనసు ద్వారానే పట్టుకోవాలి. ముందు “ నేను” అని భావించే మనసు ఈ శరీరంలోనే ఉందన్న భావన ఏర్పడి మనోదేహాలు విడవాలి. ఎటు వెళ్ళినా శరీరం కదులుతుంది తప్ప శరీరంలోని 'నేను' (మనసు) కదలటంలేదని గుర్తించాలి. బస్సు ఎంత వేగంగా వెళ్తున్నా అందులో ఉన్న మనం ఆ సీటులోనుంచి కదలనట్లే ఇది కూడా. ఈ గమనింపు వల్ల మనసుకి నిమ్మళం వస్తుంది. 

✳️ సహజంగా ఎక్కువమంది పూజలు, పునఃస్కారాలు, అష్టోత్తరాలు, శతనామాలు ఇవన్ని భయంతో చేస్తూ ఉంటారు. అది పోయి దానిస్థానే భక్తి రావాలి. ఎక్కువ స్తోత్రాలు చేయటం కోసం తొందరగా చదువుతూ ఉంటాం. కాని వాటి అర్థాలు, భావాలు తెలుసుకొనే ప్రయత్నం చేయము. *నామస్మరణతో పాటు భావస్మరణ కూడా చేస్తేనే అధిక ఫలం.* ఏ పూజ అయినా ఆ అనంతశక్తిని గుర్తించేందుకే కదా! మన పూర్వ సంస్కారాల వల్ల ఏ దైవం పైన ఇష్టం ఏర్పడినా అది పరమతత్వానికి, ఆత్మదర్శనానికి, పరమ శాంతికి చేరుస్తుందని గుర్తించాలి.
[3/24, 18:10] +91 73963 92086: ప్రతి దేవుడి వేయి నామాలలోనూ వారంతా ఒకే పరమతత్వం తాలుకూ ప్రతిరూపాలేనని విశదమౌతుంది. *పరమేశ్వర శరణాగతి వల్ల మన కర్మలో ఉన్నది వచ్చి తీరుతుందనే విశ్వాసం ఏర్పడి వెంపర్లాట తగ్గుతుంది. సత్యం నుండి దూరం చేసే వెంపర్లాట తగ్గితే ఆత్మానుభవానికి అడ్డంగా ఉన్న అహం తగ్గుతుంది.* మనసుని గమనించటం ద్వారా వెంపర్లాటను గుర్తించి అధిగమించగలం. ఆత్మను తెలుసుకోవాలన్న శుభేచ్చ నిరంతర ధ్యాసగా మారే వరకు దానిని సాధన చేయాలి.

🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment