#పడక్కుర్చీ_మేధావుల #మాయలో_పడకండి
✍️ Psy Vishesh
కుమార్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. యూట్యూబ్ వీడియోలు ఎక్కువగా చూస్తుంటాడు. అందులో లక్షల వ్యూస్ ఉన్న ఒక వీడియో అతన్ని బాగా ప్రభావితం చేసింది. తన డయాబెటిస్ కు మందులు మానేసి యూట్యూబ్ లో చెప్పిన వైద్యం మొదలుపెట్టాడు. ఏడాది తిరిగేసరికి కిడ్నీలు దెబ్బతిన్నాయి.
♦️♦️♦️♦️♦️
అనంతపురానికి చెందిన కవిత కాస్త లావుగా ఉంటుంది. దాంతో ఆత్మన్యూనతతో బాధపడుతుండేది. వాట్సప్ లో వచ్చిన మెసేజెస్ కు ప్రభావితమై తన బరువు తగ్గించుకునేందుకు స్వంత వైద్యం మొదలుపెట్టింది. ఆరునెలల్లో అనారోగ్యం పాలై హాస్పిటల్ ను ఆశ్రయించాల్సి వచ్చింది.
కుమార్, అనితలాంటి వారు మన చుట్టూ అనేకమంది కనిపిస్తూ ఉంటారు.
♦️♦️♦️♦️♦️
ఇంటర్నెట్, సోషల్ మీడియా రాకతో ఎలాంటి సమాచారమైనా ఎవరికైనా సులువుగా లభిస్తుంది. అలాంటి సమాచారాన్ని చదివి, తమను తాము నిపుణులుగా భావించుకుని సోషల్ మీడియాలో పోస్టులు రాసేవారు, వీడియోలు చేసేవారి సంఖ్య బాగా పెరిగింది.
వీటిపై నియంత్రణ తక్కువగా ఉండటంతో వీరి చేష్టలకు అడ్డేలేకుండా పోయింది. ఇలా ఏదైనా రంగంలో ఎలాంటి ప్రత్యక్ష అనుభవం లేదా నైపుణ్యం లేకుండా సూచనలు, సలహాలు ఇచ్చే వ్యక్తిని Arm Chair Expert లేదా పడక్కుర్చీ మేధావులు అంటారు.
ఏ రంగంలోనైనా సరే నైపుణ్యం రావాలంటే ఏళ్ల తరబడి అధ్యయనంతో పాటు క్షేత్రస్థాయి అనుభవం అవసరం. కానీ పడక్కుర్చీ మేధావులకు ఆయా రంగాల్లో ఎలాంటి శిక్షణ, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండవు. తమకు ఆసక్తి ఉన్న అంశంపై నాలుగుచోట్ల చదివి పోస్టులు రాస్తుంటారు, వీడియోలు చేస్తుంటారు.
♦️♦️♦️♦️♦️
#ఎందుకిలా_చేస్తుంటారు?
అతి శక్తివంతమైన మానవ మెదడుకు కూడా కొన్ని పరిమితులుంటాయి. దానికి అందే సమాచారం మొత్తాన్నీ అది ప్రాసెస్ చేయలేదు. ప్రాసెసింగ్ ను సులభతరం చేయడానికి మెదడు చేసే ప్రయత్నంలో భాగంగా ఆలోచనల్లో తప్పులు లేదా లోపాలు లేదా పక్షపాతాలు ఏర్పడతాయి. వాటినే కాగ్నిటివ్ బయాసెస్ అంటారు. అలాంటి కొన్ని కాగ్నిటివ్ బయాసెస్ వల్లనే పడక్కుర్చీ మేధావులు తయారవుతుంటారు.
♦️♦️♦️♦️♦️
#అవేంటంటే...
Dunning-Kruger Effect: తమకు ఏమాత్రం నైపుణ్యం లేని రంగంలో తమ నైపుణ్యాన్ని ఎక్కువ అంచనా వేసుకోవడాన్నే డన్నింగ్-క్రూగర్ ఎఫెక్ట్ అంటారు. ఈ బయాస్ ఉన్నవారు తమను తాము ఎక్కువగా అంచనా వేసుకోవడం వల్ల తమకు సంబంధంలేని రంగాల్లో కూడా అనుచిత సలహాలు ఇస్తుంటారు.
Confirmation bias: తన నమ్మకాలను నిర్ధారించే సమాచారాన్ని మాత్రమే వెతకడం, వాటికి విరుద్ధంగా ఉన్న సమాచారాన్ని విస్మరించే ధోరణినే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు.
Illusory superiority: ఇతరులతో పోలిస్తే తమ స్వంత సామర్థ్యాలను లేదా పనితీరును ఎక్కువగా అంచనా వేసుకోవడం. ఈ బయాస్ వల్లనే పడక్కుర్చీ మేధావులు ఆయా రంగాల్లోని నిపుణుల అనుభవం, అభిప్రాయాలకంటే తన అభిప్రాయాలే గొప్పవని నమ్ముతుంటారు.
Social proof: తమకు ఎక్కువమంది ఫాలోయర్స్ ఉన్నారు కాబట్టి, తాను చెప్పింది వారు నమ్ముతున్నారు కాబట్టి... తమకు సంబంధంలేని రంగంలోనైనా సరే తాను చెప్పేదంతా నిజమేనని నమ్మడం.
ఇలాంటి కాగ్నిటివ్ బయాసెస్ వల్లనే పడక్కుర్చీ మేధావులు తమకు కనీస పరిచయం లేని రంగాల్లో కూడా తమకు చాలా నైపుణ్యం ఉందనే గుడ్డి నమ్మకంతో సలహాలిస్తూ ఉంటారు. తన ఫాలోయర్స్ ను ఆకట్టుకోవడం కోసం ఎమోషనల్ పోస్టులు రాస్తుంటారు.
♦️♦️♦️♦️♦️
#ఏం_చెయ్యాలి?
నిజమైన ఎక్స్ పర్ట్ లు తమ వృత్తుల్లో బిజీగా ఉండటంవల్ల అందరికీ అందుబాటులో ఉండరు. అందువల్ల విశ్వసనీయమైన, సమగ్రమైన సమాచారం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండదు.
దాంతో శాస్త్రీయ ఆధారాలు వెతికే కష్టమైన పని వదిలిపెట్టి సోషల్ మీడియాలో సులువుగా దొరికే సమాచారంపై ఆధారపడుతుంటారు. దీన్నే Availability heuristic అంటారు.
ఇదో రకమైన కాగ్నిటివ్ బయాస్. ఈ మాయలో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలున్నాయి.
1️⃣ సలహాలిస్తున్న వ్యక్తికి ఆ రంగంలో కనీస పరిచయమైనా ఉందా? ఆ రంగంలో అధ్యయనం చేశారా? ప్రాక్టికల్ ఎక్స్ పోజర్, ఎక్సీపిరియన్స్ ఉన్నాయా? అనే విషయం తెలుసుకోవాలి.
2️⃣ విభిన్న దృక్కోణాలను పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అలాగని శాస్త్రీయ ఆధారాల్లేని సలహాలకు తలూపకండి.
3️⃣ ఒక నిర్దిష్ట విషయంపై అవగాహన పెంచుకునేందుకు సమయం వెచ్చించండి. సంబంధిత అంశంపై ఉన్న సిద్ధాంతాలు, జరుగుతున్న పరిశోధనల గురించి తెలుసుకోండి.
4️⃣ పడక్కుర్చీ మేధావులతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదించవద్దు. మీ అటెన్షన్ తాము ఆ రంగంలో నిష్టాతుడననే వారి నమ్మకాలను మరింత బలపరుస్తుంది.
5️⃣ శారీరక, మానసిక ఆరోగ్యాల విషయంలో పడక్కుర్చీ మేధావుల మాటలు నమ్మి ప్రయోగాలకు పోకుండా ఆయా రంగాల్లో అర్హత కలిగిన నిష్ణాతులను సంప్రదించండి. మీ శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోండి.
#PsyVishesh
www.geniusgym.in
05.03.2023
No comments:
Post a Comment