Thursday, March 23, 2023

పంచభూతాలు మినహా ఇచట మరొకటి లేదు* 🥀 ✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.

 🥀 *పంచభూతాలు మినహా ఇచట మరొకటి లేదు* 🥀
✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.
🙏🌺🌺🌺🌺🔯🌺🌺🌺🌺🙏

ఈ జగత్తంతా పంచభూతాలతో ఏర్పడింది. 

*పంచభూతాలు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము.* ఈ ఐదింటి చేతనే విశ్వమంతా నిర్మింపబడింది. 

కుమ్మరివాని వద్ద కుండలు, ముంతలు, చట్లు, బానలు మొదలైనవి ఎన్నో ఉన్నప్పటికీ అవన్నీ మట్టియొక్క రూపాంతరాలే అగును కదా!

అట్లే, బ్రహ్మదేవుడు ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణికోట్ల యొక్క భౌతిక స్వరూపాలను పంచ భూతాలతోనే నిర్మించియున్నాడు.

కనుకనే,  ప్రపంచంలోని ఏ వస్తువును విడదీసినా పంచభూతాలే కనబడతాయి. ప్రతి వస్తువు, ప్రతి శరీరము పృథివి జలాదులనే పంచభూతాలతోనే ఏర్పడుటను బట్టి వాటిలో ఆసక్తిని రేకెత్తించే విషయమేమున్నది? ఈ సత్యం తెలిస్తే ఇక మానవుడు విషయభోగాల పైకి పరుగెత్తడు.

దృష్టాంతానికి మానవ శరీరం పెక్కు అందచందాలతో కూడియున్నప్పటికి అది మట్టి, నిప్పు, నీళ్ళు మున్నగువానితో ఏర్పడింది కాబట్టి ఇక అట్టి శరీరంపై వ్యామోహం ఎందుకు కలుగుతుంది? అజ్ఞానమే మోహానికి కారణం. జ్ఞానం కలవాడికి ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకంగానే కనిపిస్తుంది. కనుకనే, అతనికి విషయాదులపై ఆసక్తి యుండదు. సత్యాన్ని గుర్తించడంబట్టి దృశ్యవిషయాలపైకి అతడు పరుగిడడు.

ప్రపంచంలో ఎక్కడ వెతికినా, ఏ లోకానికి వెళ్ళినా నిప్పు, నీళ్ళు, మట్టి, గాలి, ఆకాశం తప్ప ఆరవ వస్తువు ఏదీ లేదని అతనికి తెలుసు. జగత్తులో ఎక్కడ చూచినా, వెతికినా పంచభూతాలు తప్ప ఆరవ మహాభూతం లేదని అతనికి తెలుసు. కనుకనే జ్ఞాని విషయాసక్తరహితుడై, దృశ్య భోగాలవైపు పరుగిడక, దృష్టిని ఆత్మవైపుకు మరల్చి అదియే సారభూతమైందని గ్రహించి, దాన్నే సేవిస్తూంటాడు, ధ్యానిస్తూంటాడు, అనుభూత మొనర్చుకుంటూ ఉంటాడు.

కావున జిజ్ఞాసువులు, ముముక్షువులు, జన్మను తరింపజేసుకొనువారు పంచభూతమయములగు విషయాదుల యెడల విరక్తి కలిగి, ఆత్మ యందు అనురక్తి కలిగి, స్వస్వరూప సాక్షాత్కారానికి తీవ్రతర కృషి సలపాలి.

ఒకదానియందు (దృశ్యమందు) విరక్తి, మరొక దానియందు (ఆత్మయందు) ఆసక్తి కలిగి వర్తించాలి. ఇదియే సంసార సముద్రతరణమునకు చక్కని ఉపాయం, సులభోపాయము.

*సర్వత్ర పంచభూతాని షష్ఠం కించిన్న విద్యతే!* 
*పాతాలే భూతలే స్వర్గే రతిమేతు క్వధీరధీః!!*


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:*

No comments:

Post a Comment