Friday, March 24, 2023

 భగవాన్ యెవరినీ తన దగ్గరకు రమ్మనలేదు. వచ్చిన వారిని వెళ్లి పొమ్మనలేదు. వుండమని యెవరినీ బలవంతం చేయలేదు.
ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ తన ఏకైక పుత్రుణ్నో,
పుత్రికనో చూసుకునే దయకల తల్లి మాదిరిగా ప్రేమగా పలకరించి,
తీసుకునేవారు. అందరి యెడలా ఒకే విధమైన ప్రేమ, దయ,
మర్యాద, గౌరవం చూపేవారు. ఆశ్రమానికి వచ్చిన ప్రతి వారినీ
ముందుగా, 'భోజనం చేశారా?' అని అడిగేవారు.
భగవాన్ యెంతోసేపు శిలాప్రతిమలాగ కూర్చుండిపోయేవారు.
ఆయన కళ్ళల్లోంచి కాంతి వరదలుగా వచ్చి, పడుతున్నట్లు వుండేది.
ఆయన కళ్ళకాంతిని వర్ణించడం కష్టమంటారు.
ఒకసారి భరించరాని దుఖంతో వచ్చిన వాని విషాదగాధ విని,
అతని వంక ఎంతో దయగా చూశారు. అంతే! అతని హృదయం
శాంతితో నిండిపోయి సంతోషంతో వెళ్ళిపోయేవాడు.
భగవాన్ ఒక్కోసారి యేదోరాస్తో దీర్ఘాలోచనల్లో పడేవారు.
అటువంటప్పుడు ఆయన కళ్ళు పెద్దవయ్యేవి.
మనసులో ఆలోచనలు మాదిరిగా, ఆయన కళ్ళు అటూ, ఇటూ
చురుకుగా కదిలేవి. కొందరితో కలిసి నవ్వేవారు.
కొందరితో కలిసి విచారించేవారు. కొన్నిసార్లు కన్నీరు కార్చిన సంధర్భాలూ లేకపోలేదు.
పిల్లలతో,కోతులతో, ఆడేవారు. ఒక్కోసారి పాడేవారు.
కాని, రోజులో యెక్కువభాగం మౌనంగా వుండేవారు.
ఒకసారి కొందరు రమణ భక్తులు భగవాన్ సన్నిధిలో
'రమణ సద్గురు - రమణ సద్గురు ...' అని పాడుతూవుంటే,
భగవాన్ వారితో కలిసి కొంతసేపు పాడి, పాట అయిపోయిన తర్వాత
తన దేహాన్ని చూపుతూ 'దీన్నేనా మీరు రమణ అంటున్నారు?' అని,
'విశ్వమంతా యే దివ్య తేజస్సుతో వెలుగుతోందో, ఆ విశ్వ చైతన్యమే, అది.
అదే రమణ. అంతా అదే! రమణ-అరుణాచలం-ఆత్మ, అన్నీ అదే.
మీరూ అదే. దానియందు సంపూర్ణ ప్రేమ కలిగివుంటే,
దాన్ని మీరు మీ అంతరాంతరాళాల్లో ప్రియతమునిగా దర్శిస్తారు.
ఆ శుద్ధచైతన్యాన్ని నిర్మల, పవిత్ర జ్ఞాన నేత్రంతో దర్శించగలరు ' అనేవారు భగవాన్.
భగవాన్ యెక్కువగా తమిళంలో మాట్లాడేవారు.
అప్పుడప్పుడూ తెలుగు, మళయాళం, కొంచెం కొంచెం ఇంగ్లీషులో మాట్లాడేవారు.
యెవరైనా మామూలు విషయాలు మాట్లాడినా, తాత్విక విషయాలు మాట్లాడినా,
యోగం-సాధన యే సంతతి చర్చించినా భగవాన్ చివరివరకు
శ్రద్ధగా, జాగ్రత్తగా, ఓపికగా, ఓర్పుతో, ప్రేమతో వినేవారు.
భగవాన్ ప్రతీదీ స్వయంగా చేసి, చూసి అనుభవం పొందే తత్వం కలవారు.
ఆయనకు దేంట్లోనూ హెచ్చుతగ్గులు లేవు.
ఆయన అంగీకారం, అనంగీకారం, చాలా స్పష్టం.
ప్రతివిషయంలో భవాను ఖరారుగా, ఖచ్చితంగా వుండేవారు.
ప్రతిదాన్ని నిశితంగా, నిర్ధిష్టంగా, సన్నిహితంగా పరిశీలించేవారు.
ఆయన చేసే ప్రతి పనీ చాలా విలువైనదిగా వుండేది.
ఆశ్రమంలో రోజూ కేలండర్ తిప్పాలి. రేడియో ప్రకారం గడియారాలు సరిచేయాలి.
ఆశ్రమ ఆవరణ పరిశుభ్రంగా వుండాలి.
ప్రతి వస్తువూ వాటి వాటి స్థానంలో అందంగా, శుభ్రంగా వుండాలి.
యేదీ వృధాకానిచ్చేవారు కాదు.
యెవరూ విస్తళ్ళలో మెతుకులు వదలకూడదు.
పులిస్తరాకులు పశువులకు వేయించేవారు.
యెన్ని జరిగినా భగవాన్ స్వేచ్చగా, శాంతంగా ఎప్పుడూ ఒకే విధంగా వుండేవారు. 

No comments:

Post a Comment