శాంతము లేకుంటే...సౌఖ్యము లేదు...
🪴🦚🪴🦚🪴🦚🪴🦚🪴
అక్రోధేన జయేత్ క్రోధ మసాధుం సాధునా జయేత్ |
జయేత్కదర్యం దానేన జయేత్సత్యేన చా నృతం ||
శాంత స్వభావంతో కోపావేశాలని, మంచితనంతో దుర్మార్గాన్ని, దానంచేయడం ద్వారా పిసినారి మనస్తత్వాన్ని నిజం చెప్పడం ద్వారా అబద్ధాలు చెప్పే గుణాన్ని జయించాలి.
🪴కష్టాలు పరీక్షిస్తుంటే ఓర్పుతో ఎదురీదేవారు, చిన్న కష్టానికే ఆవేశంతో ఊగిపోయేవారు జీవిస్తున్న లోకమిది.
🪴మానవుల్లోని శాంతం, క్రోధ స్వభావాలే ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి.
🪴కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలన్నీ వినాశ కారకాలే. ప్రవర్తనా తీరును దిగజార్చి పతనం అంచుకు చేర్చేవే.
‘🪴విషయాసక్తి ఉన్నవారే కోరికలు పెంచుకుంటారని, కోరికలు తీరక క్రోధము కలుగుతుందన్న’ గీతాకారుడి భాష్యాలను మరచి, జీవితంపై వ్యామోహంతో ఆశలు పెంచుకుని అరిషడ్వార్గాల గూడులో చిక్కుకుని విలవిల లాడుతున్నారు మానవులు.
🪴అగ్ని అంటిన గృహం దహించుకు పోయినట్టే క్రోధం ఉన్న శరీరం దహించబడుతుందని గుర్తించలేక కష్టాలు అనుభవిస్తున్నారు.
🪴క్రోధానికి ఋషులు, పురాణ పురుషులూ బానిసలయ్యారని, తపస్సంపన్నులైన దుర్వాసుడు, విశ్వామిత్రుడూ క్రోధంలో మునిగి శాపమిచ్చిన వృత్తాంతాలను పురాణాలు తెలిపాయి.
🪴 క్రోధాన్ని నిగ్రహించుకుంటే ధీమంతులు కాగలరని, లేనివారు గురుహత్య, సాధుహింస లాంటి అఘాయిత్యానికైనా పూనుకుంటారన్న పెద్దల మాటలకు నిదర్శనాలు కనిపిస్తాయి పురాణాల్లో.
తోకకు నిప్పు పెట్టించారన్న కోపంతో లంకా దహనం చేసిన హనుమంతుడు, అశోకవనంలో సీతాదేవికి హాని జరిగిందేమోనని వ్యాకులపడినట్టు సుందరకాండ వివరించింది.
🪴వృత్రాసురుడు దాగాడన్న కోపంతో సముద్రాన్ని అగస్త్యుడు త్రాగేసినట్టు స్కాంద పురాణం, కోపించిన భృగువు సాక్షాత్తూ విష్ణు వక్షస్థలాన్ని పాదంతో తాకినట్టు వేంకటాచల మహత్యం తెలిపాయి.
🪴మనుషుల్లోని ఆలోచన, విచక్షణలను నశింపజేసి రాక్షసుల్లా మార్చే శక్తి క్రోధానికి ఉందన్న స్పృహతోనే కోపిష్టులను పక్షుల్లో కాకితో, జంతువుల్లో కుక్కతో పోల్చాడు చాణక్యుడు. క్రోధంలో ప్రవర్తనా నియమాలు, ఉచితానుచితాలు గాలికి వదిలే అవకాశమివ్వకుండా ధీమంతులు ‘పాము కుబుసం విడిచినట్టు కోపాన్ని విడనాడాలని’ గ్రంథాలు బోధించాయి.
🪴‘క్రోధమే మృత్యువని, పేరాశయే వైతరణీ నదియని, తృప్తితో, సంతోషంతో జీవించడంలో సుఖముందన్న చాణక్య నీతిని ఆచరిస్తూ శాంత చిత్తులై దయర్ద్రహృదయంతో ప్రవర్తించాలి మానవులు. కోపమనే గుణానికి దహించబడని హృదయం గలవారే ధీరులన్నది భర్తృహరి సుభాషితం ..
🪴కాగా ‘తన కోపమే తన శత్రువని, తన శాంతమే తనకు రక్షయన్న’ సుమతీకారుడి మాటలు మననం చేసుకుంటూ ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని ప్రవర్తిస్తే అనర్ధాలు దూరమౌతాయి.
🪴“కోపం పట్టుపురుగు లాంటిదని, పట్టిన వారిని ఆకులా తినేసి, ఆవేశమనే దారాన్ని బయటకు కక్కుతుందన్న” కవి వాక్యం ఆలోచనాత్మకం.
🪴కోపంలో జారిన మాట శాపంగా మారి శత్రువులను పెంచుతుందన్న వివేకం కలిగితే సాధనతో క్రోధాన్ని దూరం చేసుకోగలరు.
🪴శాంతం, పరోపకార తత్వంతో వ్యవహరిస్తే మిత్రులు పెరగడమే కాదు మనశ్శాంతి దక్కుతుంది.
🪴🦚🪴🦚🪴🦚🪴🦚🪴
No comments:
Post a Comment