Sunday, March 12, 2023

అజ్ఞానం నశిస్తే అంతా అమృతమయం* ✍️ కామిడి సతీష్‌ రెడ్డి

 *అజ్ఞానం నశిస్తే అంతా అమృతమయం*
                ✍️ కామిడి సతీష్‌ రెడ్డి
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

✳️ మనలో ఉన్న చెడు భావాలు, హింసా ప్రవృత్తి మొదలైనవి లోపలి జ్ఞానాన్ని కప్పేసి అజ్ఞానం అనే చీకటిని ఏర్పరుస్తాయి. వాటిని తొలగించుకొంటే, చీకటిపోయి వెలుగు ప్రవేశించి జ్ఞానోదయమై జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. అందరూ కలిసి ఆలోచిస్తే, కలిసి పనిచేస్తే అసాధ్యమైన కార్యం కూడా సుసాధ్యమౌతుంది. కలసి ఉంటే కలదు సుఖం అన్నారు. 

✳️ మనం ఉన్న సమాజానికి మేలుచేసే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. మనసు మాలిన్యరహతంగా ఉంచుకొంటేనే, ఇహపరాలకు మార్గం సుగమం అవుతుంది. నిర్మలమైన మనసులో నిశ్చయ జ్ఞానం కలిగి, దివ్యజ్యోతి వెలుగుతుంది. మానవ జీవిత గమ్యం ఆ దివ్యజ్యోతి సందర్శనమే. చిత్తశుద్ధి లేకపోతే, శివుని అనుగ్రహం కలుగదు. అజ్ఞానపు పొరలు తొలగితే జ్ఞాన ప్రకాశం కలిగి దివ్యానుభూతి లభిస్తుంది. ఇదే చిరంతనమైనది, శాశ్వతమైనది. దీనికి మించిందిలేదు. ఈ విషయాన్ని గుర్తించి మనం ఋజుమార్గంలో ప్రయాణించి మానవ జన్మ సార్ధకతను రుజువు చేసుకోవాలి. కఠిన మనస్కుల తోనూ కలివిడిగా ఉంటే, మనలోని మృదుత్వానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. మంటలమాటున మంచు ఉంటుందని, కఠిన శిలల్లోనూ నీరు ఉంటుందని తెలుసుకోవటమే వివేకం. వివేకం వికసిస్తే మానవతకు సార్ధక్యం. దీన్ని తెలియజెప్పే చిన్నకథ తెలుసుకొందాం.

✳️ ఒక ఊళ్ళో ఊరికి అంతటికీ పనికొచ్చే ఒకే ఒక మంచినీటి బావి ఉంది. దాని నీరు అమృత తుల్యం. అందుకని గ్రామ ప్రజలు ఇక్కడికే వచ్చి నీళ్ళు తోడుకొని ఇళ్ళకు తీసుకువెడతారు. అందరూ దాని లోని నీటిని వాడుకోవటమే కాని, దాని చుట్టూ గోడకాని, గిలక కాని ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోలేదు. ముసలి, ముతక, పిల్లా జెల్లా అందరూ ఆ బావి ఒడ్డున ఒంగి బిందెలతో, కడవలతో నీళ్ళు చేదుకోనేవారు.

✳️ ఒకరోజు అర్ధరాత్రి ఒక కుక్క అక్కడ తిరుగుతూ నేలబారుగా ఉన్న ఆ బావిలో పడి,, బయటకు వచ్చే ప్రయత్నాలన్నీ చేసి, విఫలమై ఆ నీటిలో మునిగి చనిపోయింది. ఈ విషయం గ్రామంలోని వారికి తెలియదు. మర్నాడు ఉదయం గ్రామస్తులు యథాప్రకారం నీటికోసం బావి దగ్గరకు వచ్చారు. నీళ్ళు తోడుతుంటే విపరీతమైన దుర్వాసన వచ్చింది. ఆ నీటిని తాగితే జబ్బులు వచ్చి ప్రాణహాని జరుగుతుందని ఆలోచించి, ఇంటికి ఒకరు వంతున, బావి నీరు తోడే కార్యక్రమం మొదలుపెట్టారు. ఎన్ని నీళ్ళు తోడినా, దుర్వాసన పెరిగిందే కాని తగ్గలేదు.
బావిలో చచ్చిన కుక్క ఉన్నదన్న సంగతి తెలియదు కనుక, నిరంతరం నీరు తోడుతూనే ఉన్నారు. 

✳️ కిం కర్తవ్యమ్‌ అని ఆలోచించారు. బావి లోపల ఏదో జంతువు చచ్చి పడి ఉంటుందని గ్రహంచి, నూతి పూడిక తీసేవాడిని పిలిపించి బావిలోకి దింపారు. వాడు బాగా మునిగి తేలుతూ, కుక్క శరీరాన్ని గుర్తించి, అందరి సాయంతో బయట లాగి పడేశాడు. అందరూ కలిసి బావికి చాలాదూరంలో దాన్ని పాతిపెట్టారు. మళ్ళీ నీళ్ళు తోడి పారబొయ్యటం ప్రారంభించారు. కొంతసేపటికి అతి స్వచ్చమైన, దుర్వాసన లేని మంచినీరు వచ్చింది. హమ్మయ్య అనుకొన్నారు. తమ తప్పు తెలుసుకొని బావి చుట్టూ, పిట్టగోడ కట్టి, గిలకలు ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యత కూడా చేబట్టారు. 

✳️ బావిలో చచ్చిన కుక్క కళేబరం ఉన్నంత దాకా, నీరు ఎంత తోడినా వాసన పోనట్లే, మనలోని అజ్ఞానం అనే వాసనపోయే వరకు మనసు నిర్మలం కాదు. జ్ఞానజ్యోతి వెలగదు అని మనం గ్రహంచాలి. తన గురించి తనకే తెలియకపోవటం అజ్ఞానం. అది తెలుసుకొంటే జ్ఞానం. జ్ఞానాన్ని అన్వయించుకోవటం విజ్ఞానం. అనుభవానికి కారణమైన దాన్ని తెలుసుకోవటం సుజ్ఞానం. అలా జ్ఞానవంతులయి నిరంతరం జ్ఞానం కలిగి ఉండి నిర్మలమైన మనసుతో ప్రశాంత జీవితాన్ని గడిపేవారి జీవిత కాలమంతా ఆనందాన్ని ఆనందలహరిని అనుభవిస్తారు.
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

No comments:

Post a Comment