Thursday, March 23, 2023

🪔🪔 హృదయ సౌందర్యం🪔🪔

 🪔🪔 హృదయ సౌందర్యం🪔🪔

🌹అందరినీ ఆకర్షించే గొప్ప అందాన్ని సౌందర్యంగా వర్ణిస్తారు. రూప లావణ్యం, సుకుమారం కలగలిసి ఉండే ఆహ్లాదకరమైన లక్షణం సౌందర్యం. సహజంగా అందరూ అందమైన రూపాలకే ప్రాధాన్యం ఇస్తారు. కనిపించే ప్రకృతి సమస్తం భగవంతుడి సౌందర్యo సృష్టికి ప్రతిరూపం. మన మనసులోని ఉద్వేగాల తేడాతో అదీ, ఇదీ బాగాలేదు అనిపిస్తాయి కానీ... | సృష్టిలోని ప్రతిదీ అందమైనదే. మనసారా ఆహ్లాదంగా వీక్షించగలిగితే సర్వం భగవన్మయమే.

🌹ప్రతి తల్లీ అన్నం తినకుండా మారాం చేసే తన బిడ్డకు అందమైన చందమామను చూపిస్తుంది. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే అంటూ కొసరి కొసరి తినిపించే ప్రతి ముద్దా అన్నమయ్య కీర్తనా సౌందర్య రాశిలో భాగం. జో అచ్యుతానంద జోజో ముకుందా అనే లాలి పాట సౌందర్యానికి నిద్రాదేవి వశం కాకుండా ఉంటుందా!

🌹అందమైన యదు నందనుడికి గంధం పూయరుగా, తిలకం దిద్దరుగా అని త్యాగరాజు తన కృతినే ఒక సౌందర్య సాధనంగా మలచి రూప లావణ్యాన్ని తీర్చిదిద్దాడు. కవులు, వాగ్గేయకారులు, రచయితలు, శిల్ప, చిత్ర, కళాకారులు... అందరూ సౌందర్య ఆరాధకులే. సౌందర్యాన్ని దైవదత్తం గావించింది జగద్గురు ఆదిశంకరుల వారి సౌందర్యలహరి స్తోత్రం.

🌹 అమ్మవారి దివ్య సౌందర్యం ఆర్తి, భక్తి దాయకమై అలరించింది. బీజాక్షరాలతో నిండి ఉపాసనా విధానమైంది. శ్రీ లలితా సుందరి లాలిత్యం, మహా లావణ్య సౌందర్యం కలగలిసి భక్తి సామ్రాజ్యంలో సౌందర్య లహరి స్తోత్రం ఘనకీర్తి గాంచింది.

🌹బాహ్య సౌందర్యం కొందరినే ఆకర్షిస్తుంది కానీ అంతస్సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస... హృదయ సౌందర్యానికి పంచ రత్నాలు. పెదవులపై పూసే చిరునవ్వుల సౌందర్యం ఎదుటివారిని సమ్మోహన పరుస్తుంది. మాటకు ప్రాణం సత్యం అని సుమతీ శతక కారుడు, అనుద్వేగకరం వాక్యం అని
గీతాచార్యుడు పేర్కొన్నారు. పిలుపులో ఆత్మీయత అనురాగం ఉట్టిపడాలి. ప్రియ భాషణం ఎదుటివారిని సమ్మోహన పరుస్తుంది.

🌹మధురానగరిలో కంసుడి దగ్గరకు వెళ్తున్న శ్రీ కృష్ణ బలరాములకు పూల దండలతో ఎదురు వచ్చింది కుబ్జ. కోరగానే పూల దండలతో ఇద్దరినీ అలంకరించింది. ఆమె చాలా పొట్టి, అనాకారి, అష్టా వక్ర. ఆమె అంతః సౌందర్యానికి సంతోషించి సుందరీ అని పిలిచాడు. ఆమె పాదం మీద తన పాదం పెట్టి గడ్డం కింద చేతితో పట్టుకుని పైకి లేపాడు. ఆమె అద్భుతమైన సౌందర్యవతిగా మారింది. 

🌹భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు... అంతస్సౌందర్యాన్ని చూసి అనుగ్రహించే సర్వజ్ఞుడు, హృదయవాసి. కనిపించే రూప సోయగం కన్న లోపల వెలుగులు విరజిమ్మే హృదయ సౌందర్యం మిన్న.🙏 
- ✍️రావులపాటి వెంకట రామారావు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment