Saturday, March 4, 2023

అహంకార రాహిత్యం

 *అహంకార రాహిత్యం*

జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు ఈ దేశంలో జన్మించినటువంటి మహోత్కృష్టమైన దార్శనికులు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతార స్వరూపం - शंकर शंकरः साक्षात् | శంకరుల అవతార కాలంలో ధర్మం క్షీణించి దేవతల ప్రార్థన మేరకు ఆ పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల రూపంలో అవతారం చేయడం జరిగింది.
వారు కేరళ దేశంలో కాలడి అనే గ్రామంలో అవతరించారు. కేవలం చిరు వయస్సులోనే వేదవేదాంగాది శాస్త్రములను ఔపోసన పట్టారు.
ఎనిమిది సంవత్సరముల పిన్న వయస్సులోనే సన్యాసం స్వీకరించారు. పదహారు సంవత్సరముల లోపల అనేక భాష్య గ్రంధాలు, ప్రకరణ గ్రంధాల రచన చేశారు. 32 ఏళ్ళ వయస్సులోపలే యావద్భారతంలోనూ మూడుమార్లు సంచరించి జనులకు ధర్మ ప్రబోధం చేసి అపారమైన లోకోపకారం చేశారు. అటువంటి వ్యక్తిత్వమును అన్యత్ర ఎక్కడా మనం చూడలేము. అందువలననే ఆయనను మనం పరమ ఆరాధ్యుడిగా, పరమ పూజ్యుడిగా సేవించుకుంటున్నాము. ఆయనయొక్క పవిత్ర నామాన్ని అత్యంత భక్తితో ఉచ్చరిస్తున్నాము. అందరినీ భగవంతుడి యొక్క కృపా పాత్రులను చేయడానికి శంకరులు విశేషమైన కృషి చేశారు.
భగవత్పాదులవారు జనులను ఉద్దేశించి ఒక చోట ఇలా చెప్పారు-

 मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषात्कालः सर्वं। 

మొట్టమొదట మీయొక్క అహంకారాన్ని దూరం చేసుకోండి, మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది. కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుడను అని, కొంతమందికి తాను పండితుడను అని, కొంతమందికి తాను మహాబలశాలి అని అహంకారం వస్తుంది. ఈ అహంకారం వచ్చిన వాడు రావణాసురునివలె తప్పుడు పనులు చేసి పతనమవుతాడు. ఎంతోమంది రావణాసురుడికి బుద్ధి చెప్పారు. మాతామహులు మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. మంచిమాటలను పెడచెవిని పెట్టాడు. చివరికి సర్వనాశనం అయ్యాడు. ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు విని ఆపని చేయకుండా ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. వీటన్నిటికీ మూల కారణం అహంకారం. అహంకారం మనిషి పతనానికి కారణం. దానిని దూరం చేసుకోవాలి.
భగవంతునికి ఇష్టమైన వాడు ఎవరు అంటే అహంకారం లేనివాడు. 

तृणादपि सुनीचेना तरोरपि सहिष्णुना |
अमानिना मानदेन कीर्तनेयः सदा हरिः ||

ఎవరైతే లవణేశం అంత అహంకారం లేకుండా ఉంటాడో, ఎవరైతే సదా ఓర్పుతో ఉంటాడో, వాడు భగవంతునికి ఇష్టమైన వాడు. అందుకే భగవత్పాదులు మనకు చెప్పిన మొట్టమొదటి మాట मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषात्कालः सर्वं | నువ్వు వేటిని చూసి అయితే అహంకార పడుతున్నావో అవేవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది భగవదనుగ్రహం ఒక్కటి మాత్రమే. భగవదనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి జీవనం ఉత్తమంగా, పవిత్రంగా ఉంటుంది. కేవలం మనయొక్క ఐశ్వర్యం, పాండిత్యం, బలాన్ని నమ్ముకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మనయొక్క పతనానికి కారణం అవుతుంది.

हर नमः पार्वती पतये हरहर महादेव 

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

https://www.facebook.com/SringeriSankaraMathamNarasaraopet/

No comments:

Post a Comment