Friday, March 31, 2023

నిర్మలచిత్తం కావాలి

 🥀 *నిర్మలచిత్తం కావాలి* 🥀
✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.
🙏🌺🌺🌺🌺🔯🌺🌺🌺🌺🙏

రావణాసురుడు సామాన్యుడు కాడు. అతని వంశం బ్రహ్మదేవుని వంశం. అతని అన్న కుబేరుడు. కాబట్టి అతనికి డబ్బుకు ఏ లోటూ లేదు. తమ్ముడు కుంభకర్ణుడు మహాబలశాలి. కావున ఇక శత్రుభయం లేదు. కుమారుడు ఇంద్రజిత్తు, ఇంద్రుడినే జయించిన సాహసోపేతుడు. ఈ ప్రకారంగా అతని వంశం, అతని పరిసరం చాలా గొప్పవిగానే యున్నాయి.

ఇక అతని ఆకారం చూతమా... ఎవరికీ లేని ఆశ్చర్యకరమైన రూపం అతనికి ఉంది. అందరికీ ఒక తల ఉంటే అతనికి 10 తలలు ఉన్నాయి. అందరికీ రెండు చేతులుంటే అతనికి 20 చేతులున్నాయి. కాబట్టి శారీరక బలానికి ఏ లోటూ లేదు.ఈ విధంగా వంశం గొప్పదైనా, బలం గొప్పదైనా, పరిసరం గొప్పదైనా, అతడు ఎన్నో సిద్ధులు కలిగియున్నా ఇష్టం వచ్చిన రూపం పొందటానికి తగిన శక్తి కలిగియున్నా, ఆకాశంలో సంచరించటానికి తగిన స్తోమత కలిగి యున్నా, చిత్తశుద్ధి లేనందువల్ల అవన్నీ నిష్ఫలములైపోయాయి. కామక్రోధాదులకు తన హృదయంలో చోటిచ్చినందువల్ల అతని జీవితం నిరుపయోగమై పోయింది. తుదకు దుర్గతిని పొంది జీవితాన్ని వృథా చేసుకొన్నాడు.

మనుజుడు ఎంత బలవంతుడైనా, ధనవంతుడైనా, శక్తివంతుడైనా, అధికారవంతుడైనా అతని చిత్తము నిర్మలముగా లేకున్నచో శాంతికి నోచుకోలేడు. నిర్మలచిత్తమే శాంతికి, పరమానందానికి ఏకైక ఉపాయం.

కాబట్టి విజ్ఞుడైనవాడు ఇతర శక్తులున్నా లేక పోయినా తన మనస్సు యొక్క పవిత్రతను ముఖ్యంగా కాపాడుకోవాలి.

హృదయాన్ని కామక్రోధాది దుర్గుణ రహితంగా ఒనర్చుకోవాలి. నిర్మల చిత్తంలో అధిష్ఠానమైన ఆత్మ - తుడిచిన అద్దంలో ముఖం బాగా కనుపించునట్లు - చక్కగా గోచరించును.

విశుద్ధ సత్త్వగుణోపేతమైన మనస్సు అధిష్ఠానమైన ఆత్మ యందు లయించిపోవును. అపుడు జీవునకు కలుగు ఆనందం వర్ణనాతీతం. అట్టి ఆనందాన్ని అనుభవించటమే జీవుని పరమలక్ష్యం. 

కావున మానవుడా! అన్నిటి కన్నా ప్రధానమైన చిత్తనైర్మల్యాన్ని కాపాడుకో. మనస్సులో ఏ ఒక్క అవగుణమైనా లేకుండా చూచుకో. బియ్యంలో రాళ్ళను ఏరివేయునట్లు, పొలంలో కలుపు మొక్కలను తీసివేయునట్లు, ఇంటిలో మురికినీటిని సాగనంపునట్లు, నీ హృదయాన్ని బాగా పరీక్షించుకొని ఏవైనా చెడ్డగుణాలుంటే బైటకు గెంటివెయ్. పవిత్ర జీవితాన్ని గడుపు. అపుడే నీ జీవితం ఆనందమయమౌతుంది. భగవదనుగ్రహాన్ని పొందగల్గుతావు. మహా ధైర్యంతో జీవితాన్ని గడపగల్గుతావు. 

కాబట్టి ప్రయత్నపూర్వకంగా పవిత్రతను కాపాడుకో. దుర్గుణరూప శత్రువులకు ఏ మాత్రం తావీయవద్దు. హృదయ పవిత్రతనే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకో. తత్ఫలితంగా బ్రహ్మానందాన్ని అనుభవించు. 

*జాతో బ్రహ్మకులే౬గ్రజో ధనపతిర్య: కుంభకర్ణానుజః* 
*పుత్రః శక్రజితస్స్వయం దశశిరా పూర్ణాభుజా వింశతిః* 
*స్వేచ్ఛః కామచరో రథాశ్వ విజయీ మధ్యే సముద్రం గృహం*
*సర్వం నిష్ఫలితం తథైవ విధినా దైవేబలే దుర్బలే*


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:*

No comments:

Post a Comment