Thursday, March 30, 2023

శౌచం

 శౌచం

శౌచం అనేది రెండు విధాలుగా వుంటుంది. బాహ్యశౌచం, అంతఃశౌచం అని. బాహ్యశౌచం అంటే భగవంతునిచే అనుగ్రహింపబడిన మానవ దేహం పురషార్ధ సాధనకు కాబట్టి దేహాన్ని పరిశుభ్రంగా వుంచుకోవాలి. మన పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలి. మన ధర్మానుష్ణానుమునకు ఏర్పడిన విధులను నిర్వహించుట, వాటికి అనుగుణమైన విధంగా మన దేహాలంకరణకూడా ఉండాలి. ఇవన్నీ మన నిత్యకర్మాచరణకు అనువుగా నిర్ణయింపబడినాయి.

అంతఃశౌచము మన లక్ష్యసాధనకు ముఖ్యమైనది. మనకు ప్రమాణములైన వేదములపై పూర్తి విశ్వాసం వుండాలి. శృతులలో నిర్దేశించిన ధర్మములను విశ్వాసంతో ఆచరించాలి. ఉదాహరణకి వేదోక్తంగా పిల్లవానికి ఉపనయన సంస్కారం జరపాలి. ఎంతో శ్రమ, ఖర్చుతో వైభవంగా ఉపనయనం జరుగుతుంది. తరువాత పిల్లవాడు కర్మానుష్టానం చేయడు. తండ్రియే కర్మానుష్టానం చేయకపోతే పిల్లవాని చేత ఎట్లా చేయించగలడు? కాబట్టి  కార్యాచరణలో చిత్తశుద్ధి ఉండాలి. వైదిక ధర్మములను శిష్టాచారంగా పాటించవలెననే విశ్వసనీయమైన భావన ఉండటమే అంతఃశౌచం. కాబట్టి మన ఆచరణలన్నీ మార్గదర్శకంగా ఉండాలి. మనము ఎంతో ఇంద్రియ నిగ్రహము అలవరచుకోవాలి.

కామక్రోధములు నరకద్వారముల వంటివి. కోరికలే అన్ని అనర్ధములకు కారణమవుతున్నాయి. ఈనాడు సాంఘిక పరిణామాలన్నిటికీ అత్యాశ, విషయవాంఛలే కారణం. కాబట్టి శంకర భగవత్పాదులు మనకు ఉపదేశించిన విధంగా రాగద్వేషాలను విసర్జించి ఇంద్రియ నిగ్రహమును పాటించి శుద్దమైన అంతఃకరణము కలవారమై ధర్మాచరణమును పాటించి జీవిత పరమార్ధమును పొందగలగాలి.

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

No comments:

Post a Comment