*ప్రవృత్తి నివృత్తి మార్గాలు*
మానవ జీవితం ప్రవృత్తి నివృత్తి మార్గాల సంగమం.
ప్రతి లౌకిక విషయానుభవాన్ని తాను, తనది, తనకొరకు అని అనుభవించడం ప్రవృత్తిమార్గం. దీనినే ప్రేయోమార్గం అంటారు.
అలాగాక, విషయాన్ని అనుభవించేవాడు తాను కాదని, అంతర్యామి అయిన భగవానుడే అనుభవించుచున్నాడని, తాననుభవించడం తన కొరకు కాదని, భగవానుని ప్రీతి కోసమే అని, వాడే వాని పనిని వాని ప్రీతి కొరకే చేయించుకొనుచున్నాడు గానీ, నేను నా పనిని నాకోసం చేస్తున్నవాడిని కానని గుర్తించి మెలగడం నివృత్తిమార్గం.
రెండుమార్గాల్లోను పనిచేయడం, అనుభవించడం వుంటుంది. ఇవి అన్నదమ్ముల వంటివి.
రామాయణంలో వాలి, సుగ్రీవుల వంటివి. ప్రవృత్తి మార్గానికి మనస్సు, నివృత్తి మార్గానికి ఆత్మజ్ఞానం మూలం, మనస్సు, ఇంద్రియాలకు అధిపతి అయిన ఇంద్రుడు వాలికి తండ్రి.
సూర్యుడు తనంత తాను ప్రకాశించే ఆత్మజ్ఞానానికి ప్రతీక. ఆత్మజ్ఞానం కలవాడు నివృత్తి మార్గంలో ప్రవర్తిస్తాడు. దీని ప్రతినిధి అయిన సుగ్రీవుడు సూర్యుని కుమారుడు. వాలికి, సుగ్రీవుడికీ అంటే ప్రవృత్తి నివృత్తి మార్గాలకు పడదు. ఇద్దరికి విరోధం.
నివృత్తి మార్గానికి వెనక దైవముంటాడని చెప్పడానికి సుగ్రీవునికి రాముడితో మైత్రి ఏర్పడింది. వీరిద్దరు జీవాత్మ, పరమాత్మలు. సుగ్రీవుడు చంపాడేమో అని భావించేటట్లు రాముడే వాలిని చంపుతాడు.
నివృత్తి మార్గంలో వున్న జీవుడికి వెనక దైవం వుండి కార్యం సఫలం చేయిస్తాడు. ప్రవృత్తి, నివృత్తి మార్గాల్లో అంతిమ విజయం నివృత్తి మార్గందే అని చెప్పడానికి వాలి చనిపోతాడు, సుగ్రీవుడు జీవించి సుఖిస్తాడు.
రామాయణం అంతా ఇలాంటి అంతరార్థాలు, వేదాంతార్థాలతో నిండి ఉంది.
============================
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment