నివృత్తి మార్గం
మనస్సు ఆత్మతత్వాన్ని తెలుసుకోవటమే ఒక యోగం. ఆ విధంగా ప్రయత్నం చేయటం వల్లనే మానవజీవితానికి సార్ధక్యం కలుగుతుంది, లేకపోతే కలగదు. ఆ విధమైన నివృత్తి మార్గాన్ని పొందకలగటానికి సద్గురువు యొక్క కటాక్షం కావాలి. మార్గదర్శనాన్ని పొందాలి. నివృత్తి మార్గంలోనే ఆత్మజ్ఞానం పొందటానికి సమర్థులవుతారు. ఒక సందర్భంలో శంకరులవారు చెప్పారు - నేను చేస్తున్నాను అనే భావన బంధానికి కారణమవుతుంది, నాది అనే భావనకూడా బంధహేతువే అవుతుంది. అంటే అహంకార మమకారాలు విసర్జించిన వాడే సరైన మార్గంలో ఉన్నాడని అర్ధం.
అవిద్య అంటే అజ్ఞానం, మాయ. దీనివల్లనే మానవుడు తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. దేహమే తాను అనే భావనలో ఉన్నాడు. దేహానికి ఏదైనా కష్టం కలిగితే నాకు కష్టాలు కష్టాలు కలుగుతున్నాయని బాధపడుతున్నాడు. తనది అంటే నాది అనుకున్న వస్తువుకు ఏదైనా నష్టం కలిగితే నా ఆస్థి నష్టమైనదని బాధపడుతున్నాడు. ఈ అనర్ధములన్నిటికీ అవిద్యతో ఏర్పడిన అహంకార మమకారములే కారణం. ఈ విధంగా దుఃఖం ప్రారంభమవుతుంది. అవతలివాడికి ఉన్నదనే దుఃఖం, తనకు లేదనే మరొక దుఃఖం. ఈ దుఃఖాలకు అవిద్యే కారణం. మనల్ని ఏమైనా అంటే చట్టున కోపం వస్తుంది, ప్రశంసిస్తే సంతోషం కలుగుతుంది. నిజమైన జ్ఞానికి ఏ స్పందన ఉండదూ.
ఏమయ్యా ! నీకు మానవమానాలు లేవా ? అంటే నాకు అంతా సమానమే అంటాడు. పైపెచ్చు నన్ను నిందిస్తే నాకు సంతోషమంటాడు. ఎందుచేతనంటే తనకు ఉన్న పాపం పోతుందట. జ్ఞానులు అటువంటివారు. వారి స్వభావంలో మార్పు ఉండదు. ఆ విధంగా మానవుడు సమదర్శనుడై ఎప్పుడు ఉంటాడో అప్పుడు అతడు సరైన మార్గంలో ఉన్నాడని అర్ధం.
ఒకరిని ద్వేషించటం వ్యర్ధమైన విషయం. అందరిలోనూ వ్యాపించిఉన్న ఆత్మతత్వం, చైతన్యం ఒకటేనని గ్రహించగలగాలి. ఇది స్వయంగా శంకరులు గ్రహించి, ఆ విషయాన్ని గ్రహించగలిగే అవకాశాన్ని మనకు కలుగచేసారు. ఒకనాడు వారి శిష్యులతోబాటు గంగ స్నానానికి వెళుతూవుండగా చండాలుని రూపంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆచార్యులు అతడిని దూరంగా ఉండు అన్నారు. దానికతడు అయ్యా ! తమరు దూరంగా ఉండమన్నది ఈ దేహాన్నా లేక సర్వవ్యాపకమైన ఈ ఆత్మనా ? అని అడిగాడు. అప్పుడు శంకరులు అతని జ్ఞానమునకు ఆశ్చర్యము చెంది ఈ రూపంలో దర్శనమిచ్చింది సాక్షాత్తు విశ్వనాధుడే అని గ్రహించి నమస్కరించాడు. అందుచేత శంకరులు తనకు అందరూ సమానమే, వ్యత్యాసము లేదు అన్నారు. కాబట్టి సర్వమానవులలోయున్న చైతన్యమొక్కటేనని గ్రహించి ఆ విధంగా ఆచరణచేయాలి.
ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నేను కర్తను అనే భావన ఉండకూడదు. ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు నేను త్యాగబుద్ధితో చేస్తున్నాననే భావన కూడా ఉండకూడదు. త్యాగం సాత్వికంగా ఉండాలి. పరమేశ్వరార్పణమస్తు అనే భావనతో చేయాలి. ఆ విధంగా చేస్తే ఏ భయమూ ఉండదు. అంతా భగవంతునికే చెందుతుంది. ఆ విధంగా కర్మలను ఆచరించేవారి జన్మ ధన్యమవుతుంది.
వేదాంత శ్రవణం చేసినా సరైన భావన రాకపోతే వాని జన్మ నిష్ఫలం. ఆత్మోద్ధరణ అనేది అందరికీ కావాలి. మంచి జరుగవలెనని తలచినప్పుడు ప్రవృతి మార్గంలో పోతే జరగదు. అందువలనే శంకరులు లోకోపకారం కొరకై అందరిని నివృత్తి మార్గంలో సత్కార్యాలు చేయాలనీ జన్మ సాఫల్యం పొందాలని ఆపేక్షించారు. శంకరులు రచించిన ఏదైనా ఒక స్తోత్రాన్ని శ్రద్ధతో పఠించి మననం చేసి ఆ పాఠాన్ని ఆచరిస్తే ధన్యులవుతారు. కాబట్టి సర్వులూ శంకరులు నిర్దేశించిన నివృత్తి మార్గం అనుసరించి శ్రేయోవంతులు అవ్వుగాక.
--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామివారు.
No comments:
Post a Comment