*ఈ జన్మలోనే పునాది వేద్దాం!*
✍ కిషన్‌యోగి
🙏🌹🪷🌹🪷🔯🪷🌹🪷🌹🙏
🪷 ఈ జీవితంలో కోరుకున్న కోరికలు తీరకపోవటం. కోరని (మంచి/చెడు) కోర్కెలు మనం అనుభవించడం ఎందుకు జరుగుతుంది? దీనికి కారణం మనం చేసుకున్న కర్మలు అనే చెప్తారు మన పెద్దలు. ఈ కర్మలు మంచి కర్మలుగా మారి మనిషి ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి? దీనికి పెద్దలు చెప్పింది మనకు తెలిసో తెలియకో పూర్వ జన్మలలో చేసిన మంచి, చెడుపనుల ఫలితాలు మన వెంట కొన్ని జన్మలుగా వస్తుంటాయి. ఈ కర్మల ఫలితాలు మంచివైతే మంచిగా, చెడు అయితే చెడుగా జీవితంలో అనుభవించాల్సిందే. ఈ జీవితం, ఇప్పుడు అనుభవిస్తున్న స్థితి అంతా గతజన్మల కర్మ ఫలితమే! వచ్చే జన్మలోనూ ఇలాగే ఉంటుందా అంటే పూర్వజన్మలో చేసిన మంచి-చెడు కర్మల ఫలం కొంత, ఈ జన్మలో చేసిన కర్మఫలం ఇంకొంత కలిసి వచ్చేదే ‘మరో జన్మ’.
🪷 మనసుకు సంతోషంగా, శరీరానికి సుఖంగా ఉంటేనే ఆనందం. ఈ జీవితంలో ఆనందంగా, వచ్చే జన్మలోనూ సంతోషంగా జీవిద్దామనుకుంటే, అందుకు విశాల హృదయంతో అందరినీ సమదృష్టితో చూడాలి. ఏమీ ఆశించకుండా మనకున్న దాంట్లో వీలైనంత పరోపకారం చేయాలి. ఇతరులకు సేవ చేయాలి. భగవంతుడిని సదా ధ్యానించాలి. ఈ యుగంలో ఇవే మోక్ష మార్గానికి సోపానాలు.
🪷 ఒక్కొక్క యుగంలో ఆ యుగధర్మాలుంటాయి. ఏ యుగంలో ఆ ధర్మాన్ని పాటించాలి. అలా కాదని మన మనసుకు నచ్చిందని, అనుకూలంగా ఉన్నదని గడిచిన యుగధర్మాలు ఈ యుగంలో పాటిస్తానంటే ప్రయోజనం ఉండదేమో! ఈ కలియుగంలో కలియుగ ధర్మమే పాటించాలి.
🪷 కలియుగంలో నరుడే నారాయణుడు. ప్రతి మనిషిలో భగవంతుని అంశ ఉంటుంది. కాకపోతే, కొందరు మాయ ఆవరించి, కర్మలు అంటించుకొని రకరకాలుగా జీవిస్తున్నారు. కాబట్టి, కలియుగ ధర్మాన్ని అనుసరించి కర్మలు ఆచరిస్తే, సత్ఫలితాలు పొందుతారు. ఉదాహరణకు మనం మామిడి విత్తు విత్తితే అనేక రెట్లు మామిడి ఫలాలు పొందుతాం. నేరేడు విత్తు విత్తితే అనేక రెట్లు నేరేడు ఫలాలు పొందుతాం. అలాగే, మనం చేసే మంచి-చెడు కర్మల ఫలితం మనకు అనేక రెట్లు లభిస్తుంది. కాబట్టి, మనం ప్రకృతి సిద్ధంగా జీవిస్తూ, ఖచ్చితంగా తిరిగి కొంత ప్రకృతికి ఇవ్వాల్సిందే!
🪷 ఈ యుగంలో పరోపకారం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం ఉంటేనే ప్రకృతి మనకు అన్నీ సమకూరుస్తుంది. ప్రకృతి సిద్ధంగా జీవించటమంటే ఆకలి వేసే సమయానికి ఆహారం దొరకాలి, ఆ ఆహారం మన చేతులతో నోటి వరకు వెళ్లాలి, అలా వెళ్లిన ఆహారం గొంతు నుంచి పొట్టలోకి వెళ్లాలి, ఆపై జీర్ణం కావాలి, అలా జీర్ణమైనదాన్ని శరీరం శక్తిగా గ్రహించగా, మిగిలిన వ్యర్థాలను బయటికి విసర్జించాలి. దీంతోపాటు మనచుట్టూ పరిస్థితులు ఆందోళన, అలజడి లేకుండా ఉండాలి. కుటుంబంలో వ్యక్తులు, వారి ఆరోగ్యం, వారి పరిస్థితి అన్నీ సజావుగా ఉన్నప్పుడే ప్రకృతి సిద్ధంగా జీవిస్తున్నట్టు. అలా జీవించగలిగినవాడే ఐశ్వర్యవంతుడు. వీటిలో ఏ లోపం ఉన్నా, అతను ఎంత ధనవంతుడైనా, ఐశ్వర్యవంతుడు మాత్రం కాలేడు.
🪷 ఈ కలియుగంలో ఆ విధంగా ఏ లోపాల్లేకుండా జీవించాలంటే చేయాల్సినవి భగవత్ ధ్యానం, సేవా కార్యక్రమాలు, దానం. కుచేలుడు శ్రీ కృష్ణుడికి ఉన్న దానిలో ఉత్తమంగా చేసినట్లు దానం చేయాలి. మనిషి జీవనం సజావుగా సాగాలంటే భగవత్ అనుగ్రహం ఉండాలి. ధ్యానంతో దేవుడి అనుగ్రహం లభిస్తుంది. మానవసేవను మాధవసేవగా భావించి చేయాలి. అప్పుడు దేవుడి కరుణ తప్పక వర్షిస్తుంది.
🪷 అయితే, పరులకు ఉపకారం చేయడం అంటే, ఏదో ఒకరోజు చాలా చేశామని ఊరుకోవడం కాదు. ఈ ప్రకృతిలో జీవించినంత కాలం, మన మనుగడకు అండగా నిలిచే ప్రకృతికి యథాశక్తి తిరిగి ఇస్తూనే ఉండాలి. ప్రకృతి సిద్ధంగా జీవిస్తూ, పరోపకారం చేస్తూ మరు జన్మ మహోన్నతంగా ఉండేలా ఈ జన్మలోనే పునాది వేద్దాం.
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*
*సేకరణ:*
No comments:
Post a Comment