Sunday, April 23, 2023

కర్మసిద్ధాంతం- 14

 కర్మసిద్ధాంతం- 14
మాయ చేత తాను కర్తననే భావమే జీవుడిని, ఈశ్వరుడి నుంచి వేరు చేస్తోంది. ఆ భావనే అహం. అహం నశిస్తే, సర్వం నశిస్తుంది, అప్పుడు మిగిలేది తానే అంటారు రమణులు.
జ్ఞానం అంటే మరేదో కాదు, అహం నాశనం అని కూడా అంటారు. జీవుడు ఎప్పుడైతే తాను కర్తను అనుకుంటాడో, ఆ క్షణం నుంచి అతనికి కర్తృత్వం ఏర్పడుతుంది. అప్పుడు అతనికి కర్మ అంటుకుంటుంది. కర్మ ఏర్పడినప్పుడు, దానికి కర్మఫలం కూడా ఉంటుంది. అది జీవుడు అనుభవించవలసి వస్తుంది. అది పుణ్యకర్మ అయినా సరే, పాప కర్మ అయినా సరే. అందుకే పాపం జీవుడిని బంధించడానికి ఇనుపసంకెళ్ళు అయితే, పుణ్యం బంగారు సంకెళ్ళు అంటారు జ్ఞానులు. ఏదైనా బంధిస్తుంది.

నిజానికి అంతా మనమే చేస్తున్నామనే భావనకు కారణం అన్నిటికి తానే కారణం అనుకోవడం, ఇది మాయ నుంచి వస్తుందని చెప్పుకున్నాము కదా. దీనికి రమణ మహర్షి ఒక చక్కని ఉపమానం చెబుతారు. రాత్రి ఒళ్ళు మరిచి నిద్రపోతాడు. అప్పుడు నేను అనే భావన ఉండదు. అసలు మనస్సులో ఏ ఆలోచన కలుగదు. నేను ఉన్నాను అన్న భావన కూడా ఉండదు. ఆ భావన లేనప్పటికి తాను లేడని అర్ధం కాదు. రాత్రి నిద్రలో మనస్సు హృదయంలో లయించి ఉంటుంది. ఉదయం లేస్తూనే, మనస్సు లేస్తుంది. మెల్లిగా అన్నీ గుర్తుకు వస్తాయి. నేను అన్న భావన కూడా పుడుతుంది. ఇలా పుట్టే నేను అన్న భావన మనస్సుకు చెందినది. అది నిద్రలో లేదు. ఆ భావన లేదు కాబట్టి తాను లేడని అనడం లేదు కదా. అనగా ఉదయం లేచింది, మనస్సు, అహంకారము. జ్ఞానోదయం అయినప్పుడు ఈ మనస్సు, అహంకారాలు రెండు ఉండవు. ఉన్నా, అవి హృదయం యొక్క ఆధీనంలో ఉంటాయి. కనుక అప్పుడు జీవునకు కర్మలు అంటవు.

జీవుడు చేసే కర్మలు కేవలం భౌతికమైన దేహానికే పరిమితం కావు. భౌతిక దేహంతో చేసిన కర్మలు, జీవుడు బయట నుంచి స్వీకరించే ఆలోచనలు, వినే మాటలు, చూసే విషయాలు, తిరిగే వాతావరణం సూక్ష్మదేహం మీద అనగా మనస్సు మీద చెరగని ముద్రలు వేస్తాయి. ఒక ప్రదేశానికి మొదటిసారి వెళ్ళినా, ఆ ప్రదేశం తనకు ఎప్పటి నుంచో తెలిసినట్టు అనిపిస్తుంది. కొందరిని చూసినప్పుడు, వారు ఎప్పటి నుంచో తెలిసినవారనిపిస్తుంది, లేదా బాగా దగ్గరివారని తోస్తుంది. మనస్సులో ఒక అలజడి లాంటిది కలుగుతుంది. దాన్నే వేదాంతశాస్త్రంలో 'వాసన' అంటారు. అనగా పూర్వజన్మ జ్ఞాపకం. చేతిలో కాసేపు కర్పూరం పట్టుకుంటే, చేయి అంతా కర్పూరం వాసనే వస్తుంది, అలానే మనస్సు దేన్ని పట్టుకుంటే, దానికి ఆ వాసన అలవడుతుంది. అది అంత తొందరగా వదలదు.

ఒకే పనిని పదే పదే చేస్తే, అది 'సంస్కారం'గా ఏర్పడిపోతుంది. అది తర్వాత జన్మలో కూడా ఆ జీవునిపై ప్రభావితమవుతుంది. మనకు గత జన్మలో ఉన్న మంచి సంస్కారాలు, చెడ్డ అలవాట్లు/ దుసంస్కారాలు మనస్సులో వాసనలుగా నిక్షిప్తమవుతాయి. మరణం స్థూల (భౌతిక) దేహానికి కానీ సూక్ష్మ, కారణ శరీరాలకు, ఆత్మకు కాదు. కనుక మరణించిన తర్వాత, ఒక జీవుడు తాను ఆ జన్మలో చేసిన కర్మల యొక్క జ్ఞాపకాలు, ఆలోచనలు, కోరికలు, అతడిని వాసనల రూపంలో వెంటాడుతాయి. మరణం తర్వాత దేహం నుంచి ఆత్మ విడువడగానే, ఆ ఆత్మను పట్టుకుని, సూక్ష్మ, కారణ దేహాలు, వాటిల్లో ఉండే వాసనలు తదుపరి ఉపాధిని వెతుకుతూ ప్రయాణం మొదలుపెడతాయి. ఉపాధి అంటే శరీరం. ఇంకా ఉంది.... 

No comments:

Post a Comment