Sunday, April 23, 2023

కర్మసిద్ధాంతం- 15

 కర్మసిద్ధాంతం- 15
స్వామి శివానంద గారి మాటల్లో;
అసలు సంస్కారం అంటే ఏమిటి?
మనోసముద్రంలో వృత్తులు (ఆలోచనా తరంగాలు - సుడిగుండాలు) ఏర్పడతాయి. అవి కొంతసేపు ఉండి, తర్వాత సాధారణ చేతనా స్థాయి క్రిందకు వెళ్ళిపోతాయి. అవి అప్పటి వరకు ఉన్న చేతనావస్థ మనస్సు నుంచి, లోతుగా ఉండే ఉపచేతన మనస్సు (చిత్తం) లోకి ప్రవేశిస్తాయి. అక్కడ అవి సూక్ష్మంగా, మహత్తరంగా పని చేస్తూ, సంస్కారంగా మారుతాయి. జాగురూక స్థితిలో చేసిన కర్మ - అది స్మృతిలో ఉన్నదైనా, ఉద్వేగపూరితమైనదైనా లేదా సంకల్పమైనా- చేతనావస్థకు క్రిందనే అది సూక్ష్మమైన, అవ్యక్తమైన రూపం తీసుకుంటుంది. దాన్నే సంస్కారం అంటాము.

స్మృతి - సంస్కారం తిరిగి వ్యక్తమవుట.
సంస్కారాలు ఉపచేతన మనస్సు లేదా చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి. ఉపచేతన మనస్సునే అచేతనా మనస్సు అని పిలుస్తారు. ఈ చిత్తం ఉండేది చిన్నమెదడులో. చాలా సూక్ష్మ విషయంతో సహా అన్నీ ఇందులో రక్షించబడుతుంటాయి. కొద్దిగా కూడా ఎన్నటికీ నష్టపోవు. చేతనా మనస్సు యొక్క ఉపరితలానికి పెద్ద తరంగంలా వచ్చే సూక్ష్మమైన సంస్కారాలు, లేదా జ్ఞాపకము వలన పురాతన వృత్తి చేతనామనస్సు ఉపరితలానికి వచ్చినప్పుడు, దాన్ని స్మృతి అంటారు. సంస్కారం లేకుండా స్మృతి/జ్ఞప్తి అసాధ్యం.

సంస్కారం ఎలా ఏర్పడుతుంది?
ఇంద్రియ భూమికలో కలిగిన అనుభవం చిత్తం యొక్క లోతుల్లోకి ప్రవేశించి సంస్కారంగా మారుతుంది. మనస్సు దేన్నైనా అనుభూతి చెందిన క్షణమే, ఆ అనుభూతి యొక్క సంస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడున్న అనుభూతికి, సుప్తచేతనలో ఏర్పడే సంస్కారానికి మధ్య సమయ బేధం ఉండదు. ఒక ప్రత్యేకమైన అనుభవం ప్రత్యేకమైన సంస్కారాన్ని కల్పిస్తుంది. ఈ అనుభూతి యొక్క స్మృతి/జ్ఞప్తి అనేది ఆ ప్రత్యేకమైన సంస్కారం నుంచే కలుగుతుంది.

మీరు మొదటి సారి బెల్లం రుచి చూసినప్పుడు, మీకు బెల్లం గురించి తెలుస్తుంది. దాని రుచి తెలుస్తుంది. అది బెల్లమనే వస్తువని తెలుస్తుంది. అప్పుడు సుప్తచేతన మనస్సులో ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఏ సమయంలోనైనా, ఈ సంస్కారం ఆ వస్తువు యొక్క స్మృతిని, దాని గురించి అవగాహనను మీకు కలిగిస్తుంది. వస్తువు, దాని గురించి అవగాహన వేర్వేరు చేయచ్చు గానీ, ఆ రెండు విడదీయరానివి.

బాహ్యమైన స్పందనల ద్వారా ఏ వస్తువైనా మనస్సులొని సంస్కారాన్ని తట్టిలేపుతుంది. అందువలన సంకల్పం అనేది బయట నుంచి ఏ స్పందన లేకున్నా లోపల నుంచి ఉద్భవిస్తుంది. మీరు ఇంతకముందు చూసిన ఆవు గురించి ఆలోచించినప్పుడు, మీరు మానసికంగా అవు అనే పదాన్ని స్మరిస్తారు. అప్పుడు దాని రూపం మనస్సులో ఏర్పడుతుంది. అప్పుడు ఆలోచన ఏర్పడుతుంది. ఎలాగైతే విత్తనం నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తనం వస్తుందో, అలానే సంస్కారం సంకల్పాన్ని కలిస్తుంది, సంకల్పం సంస్కారానికి కారణమవుతుంది. ఈ చక్రం బీజ-వృక్ష న్యాయమును తలపిస్తుంది. మనస్సులోని వృత్తి సంస్కారాన్ని కల్పిస్తే, ఆ సంస్కారం ఇంకో వృత్తికి కారకమవుతుంది. బాహ్యం లేదా లోపల నుంచి కలిగే స్పందనలు, ప్రేరణల వలన విత్తనాల వంటి సంస్కారాలు పెరిగి, అనేక కర్మలకు కారణమవుతాయి. వృత్తులు మరియు సంస్కారాల ఈ చక్రం అనాది, కానీ దివ్యజ్ఞానం పొందడంతోనే ఇది అంతమవుతుంది. అప్పుడతి ప్రకృతిలో లయిస్తుంది. అవి జీవన్ముక్తుని మీద ఏ ప్రభావం చూపలేవు. నిరంతర సమాధి వలన సంస్కారాలు కాలిపోతాయి. అప్పుడు మాత్రమే జీవుడు జనన మరణాదుల నుంచి విముక్తుడవుతాడు. ఇంకా ఉంది ... 

No comments:

Post a Comment