Saturday, April 1, 2023

కర్మసిద్ధాంతం- 17

 కర్మసిద్ధాంతం- 17
స్వామి శివానంద ఇంకా ఈ విధంగా చెప్తున్నారు....
సంస్కారాలన్నీ చిత్తంలో నిద్రాణ స్థితిలో ఉంటాయి. కేవలం ఈ జన్మ సంస్కారాలే కాదు, గత జన్మ సంస్కారాలు, అనాది కాలం నుంచి ఉన్న సంస్కారాలన్నీ చిత్తంలో గుప్తంగా, నిద్రాణ స్థితిలో ఉంటాయి. జంతుజన్మ సంస్కారాలు, దేవ సంస్కారాలు, పేదవాడి జన్మ సంస్కారాలు, ధనిక జన్మ సంస్కారాలన్నీ చిత్తంలో దాక్కుని ఉంటాయి, లేదా దాచి పెట్టబడి ఉంటాయి. ఈ మానవ జన్మలో, ఈ జన్మకు ఏ సంస్కారాలు తగినవో, అవి మాత్రమే బయటకు వచ్చి కార్యం నిర్వర్తిస్తాయి. ఇతర సంస్కారాలు నిగూఢంగా నిద్రాణ స్థితిలో ఉంటాయి. ఏ విధంగా అయితే ఒక వర్తకుడు సంవత్సరాంతంలో పాత లెక్కల పద్దు మూసివేసి కొత్త లెక్కల పద్దు తెరిచినప్పుడు, గతంలో ఉన్న పాత వస్తువుల వివరాలన్నీ అందులో నిక్షిప్తం చేయడం కాకుండా, కేవలం బ్యాలెన్స్ మాత్రమే అందులో పొందు పరుస్తాడు. ఎందుకంటే కొత్తగా మొదలుపెట్టిన పద్దులో గతంలో జరిగిన వ్యాపారం యొక్క స్థితిని ఈ బ్యాలెన్స్ చూపెడతాయి. అలాగే ఆత్మ లేదా జీవుడు, గత జన్మ యొక్క తన అనుభవాలను, తన గుర్తులను పొందుపరిచి, దాని యొక్క సారాన్ని కొత్తగా ఏర్పడిన జన్మలో వాడుకునేందుకు నిగూఢంగా చిత్తంలో దాచిపెడతాడు. ఇదే నిజమైన జ్ఞాపకము. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన మెదడులో ఉన్న ఒక విధమైన మానసిక సామాగ్రి.

స్థూల శరీరము మరియు మనసుకు, గతంలో చేసుకున్న కర్మలవలన, ఒక విధంగా ప్రవర్తించే తీరు ఉంటుంది మరియు మనం కూడా దానికి అనుగుణంగానే వర్తిస్తాము. వీటికి మనమే కర్త అనుకొని పొరబడి పరిస్థితిని మరింత తీవ్రతరం చేసుకుంటాము. మనం చేసే చాలా కర్మలు మనకు తెలిసినా, తెలియకున్నా, వాటంతట అవే మన ప్రయత్నం లేకుండానే జరుగుతాయి. నిష్కామ కర్మ యొక్క స్ఫూర్తితో మీరు మీ కర్మలను చేయడం కష్టం అనిపించినప్పుడు, అన్ని కర్మలను త్యజించడంలో కోరిక కలిగి ఉండండి.

స్వర్గంలో, మానవ లేదా భౌతిక జీవనం యొక్క అన్ని అనుభూతులు వేరు చేసి విశ్లేషించి పెడతాయి. వాటి యొక్క సారం తీసుకోబడుతుంది. జీవుడు మరలా భౌతిక జగత్తులో, కొత్త శరీరంతో పుట్టినప్పుడు, గతంలో ఏర్పడిన మానసిక స్థితి, అనుభవాల ఆధారంగా, మనస్సు ప్రవర్తిస్తుంది. మీరు ఒక నాటకం రాస్తున్నప్పుడు, నిద్ర వస్తే మీరు వెంటనే అన్ని పక్కన పెట్టెసి నిద్రపోతారు. మీరు ఎక్కడైతే గత రాత్రి రాయడం ఆపారో, అక్కడి నుంచి తిరిగి మొదలు పెడతారు. అలాగే మీరు కొత్త జన్మ తీసుకున్నప్పుడు, గత జన్మలో మీరు ముగించకుండా వదిలేసిన కర్మల ఒక్క వాసనలు ఈ జన్మలో కూడా మీ మనసుపై ప్రభావం చూపుతాయి. మీరు తిరిగి ఆ పనులను ఎక్కడ ఆపారో, అక్కడ నుంచే మొదలు పెట్టి కొనసాగిస్తారు. రాబోయే జన్మకు కూడా మీరు ఈ జన్మలో చేసిన కర్మ ఆధారంగానే ఉంటుంది.

ఈ ప్రపంచంలో మనిషి నిరంతరం ఎన్నో పనులు చేస్తాడు మరియు ఏ విధంగా కూడా ఎక్కువ హాని చేయకుండా ఎన్నో పనులు చేయవచ్చు. అయితే పదే పదే ఎన్నో పనులు ఇతరులకు హాని చేయకపోయినప్పటికీ, మనకు హానీ చేసేవి కూడా ఉంటాయి. వాటిని నిజాయితీగా ఆత్మసాక్షాత్కారం పొందగొరే సాధకులు, పాపకర్మను పదే పదే చేస్తే ఖచ్ఛితంగా అధోగతి పాలవుతారు.

సంస్కారాల మీద మనసు తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. సంస్కారాల నుంచి వాసనలు గుంపులు గుంపులుగా ఉద్భవిస్తాయి. దాని నుంచి కోరిక అనే వాగు ప్రవహిస్తుంది. ఆ వాగు నుంచి వస్తువులను అనుభవించాలి అనే తృష్ణ బయలుదేరుతుంది. తృష్ణ చాలా శక్తివంతమైనది. సంస్కారాలన్నీ మనసులో, కారణశరీరంలో నిక్షిప్తమై ఉంటాయి. అక్కడి నుంచి మనసులోనే ఆ వస్తువును అనుభూతి చెందాలనే సంకల్పం ఉద్భవిస్తుంది. అప్పుడు మనస్సు దాని గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. కల్పనా/భ్రాంతి/ ఊహలోనే మాయ తన శక్తిని దాచి ఉంచుతుంది. అక్కడి నుంచి బంధం మొదలవుతుంది. మనసు ఏ విధంగానైనా ప్రణాళికను రచించి దాన్ని పొందేందుకు ప్రయత్నిస్తుంది. మీరు కోరికల వలలో చిక్కుకుపోతారు. ఆ వస్తువులను పొంది భౌతికంగా అనుభవించాలన్న తపన మీకు కలిగి, వాటిని పొందేందుకు మీ ప్రయత్నాలు మొదలుపెడతారు. మీ ప్రయత్నాల్లో మీకు కొన్నిటి మీద ఇష్టం కలుగుతుంది, కొన్నింటి మీద అయిష్టం కలుగుతుంది. ఫలితంగా మీరు చేసిన పాప పుణ్యాలకు తగిన ఫలం అనుభవించాలి. రాగద్వేషాలు, పాపపుణ్యాలు, సుఖదుఃఖాలు అనే ఆరు ఆకుల సంసారచక్రం అనాదికాలం నుంచి ఆగకుండా తిరుగుతూనే ఉంది.
ఇంకా ఉంది...

No comments:

Post a Comment